జిల్లాలో వల్లూరు మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దుతామని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అన్నారు. శుక్రవారం ఉదయం గ్రామదర్శిని – గ్రామ వికాసం కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ వల్లూరు మండలంలోని వల్లూరు పంచాయతీ లో గ్రామదర్శిని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రూ.165.59 లక్షల విలువ చేసే అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ…. వారం క్రితం గ్రామానికి వచ్చాను. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని అభివృద్ధి పనులు మంజూరైన ఇంకా అమలుకు నోచుకోలేదు. ఈ విషయాలను గమనించి వారం రోజుల్లో పనులు చేపట్టాలని అధికారులకు ఆదేశించడం జరిగిందన్నారు. ఈ మేరకు నేడు గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించి కోవడం జరిగిందన్నారు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలు అందరూ కలిసికట్టుగా ఉండాలని, అప్పుడే అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు. నేడు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక దృష్టితో పట్టణాల్లో లభించే సౌకర్యాలు అన్ని గ్రామాల్లో ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. గ్రామాల్లో కూడా ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించడం, త్రాగునీరు ఏర్పాటు, రోడ్లు వేయడం, కాలువలు చేయడం జరుగుతోందన్నారు. వల్లూరు మండలంలో గతంలో కోటి రూపాయల ఖర్చుతో రెండు స్మశానాలు, 4-బిటి రోడ్లు నిర్మించడం జరిగిందని, వారం రోజులలో దాదాపు 80 లక్షల రూపాయల పైబడి అభివృద్ధి పనులు చేసామని మొత్తంగా వల్లూరు మండలంలో రూ.2.80 కోట్లు అభివృద్ధి పనులకు ఖర్చు చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి, ఇప్పుడు లేదంటున్నారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు తగ్గిపోయాయి. ఉపాధి హామీ పనులు చేసుకోవడం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసుకోవడం మార్గంగా ముఖ్యమంత్రి ఆలోచించారు. ఈ మేరకు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరుగుతోందని వివరించారు. పంచాయితీలో సైడు కాలువలు ఇప్పించే కార్యక్రమం చేస్తామన్నారు. ఇందుకు ఎస్టిమేట్లు తయారుచేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. గ్రామంలో పరిశుభ్రత పాటించాలని సూచించారు. అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు కూడా సహకరించాలి. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించాం. ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు వాడాలని చెప్పారు. మరుగుదొడ్లు వాడని వారు ఉన్నారు. బయట మల మూత్ర విసర్జన చేయరాదు. ప్రతి ఒక్కరూ బాత్రూంలు కట్టించుకోవాలి. లేని వారు వెంటనే నిర్మించుకోవాలి. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రం, ప్రతి పాఠశాలకు మరుగుదొడ్లు ఉండాలని ఈ మేరకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తల్లి గర్భం లో బిడ్డ సంతరించుకున్నప్పటినుంచి చనిపోయేవరకు, చనిపోయిన తర్వాత కూడా ఇబ్బంది కలగకుండా శ్మశానానికి తీసుకెళ్ళి వరకు కూడా ముఖ్యమంత్రి నేతృత్వంలో అనేక పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని చెప్పారు. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలలో భాగస్వాములై అభివృద్ధి కార్యక్రమాలను పూర్తిచేసుకుని ఆనందంగా ఆహ్లాదంగా జీవించాలని కోరారు. కార్యక్రమంలో కమలాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి నాయకులు పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ… వారం క్రితం కలెక్టర్ వల్లూరు ను సందర్శించి ఆదర్శగ్రామంగా చేస్తామని చెప్పారు. ఈ మేరకు ఈ వారంలో దాదాపు 80 లక్షల రూపాయల అభివృద్ధి పనులను ఆయన పూర్తి చేయించారు. ఇందుకు కలెక్టర్కు ప్రజలందరి తరపున ధన్యవాదాలు తెలిపారు. ఊరికి ఐదు చెరువులు ఉన్నాయని, చెరువులకు ఉన్న గొలుసుకట్టు కాలువల్లో పూడికలు అన్ని పూర్తి చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవాలని కోరారు. నేడు గ్రామంలో పార్కు, , గోకులం, సి సి రోడ్లు వేశారు. ఇంకా మిగిలిన అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి రామచంద్రారెడ్డి, మండల ప్రత్యేక అధికారి, ఎస్సీ కార్పొరేషన్ ఇడి శ్రీలక్ష్మి , పశుసంవర్ధక శాఖ జెడి జయకుమార్, తాసిల్దారు, ఎంపీడీవో, డిస్ట్రిక్ట్ రిసోర్స్ పర్సన్ జుబేదా, వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.