ysrkadapa

వార్తలు

కడపలో మరో రైతుబజారు ఏర్పాటుకు చర్యలు

కడప నగరంలో మరొక రైతు బజారు నిర్మించేందుకు చర్యలు చేపడుతున్నామని జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సీఎం సాయికాంత్ వర్మ తెలిపారు. బుధవారం చిన్నచౌక్ పాతపోలీస్ స్టేషన్, జిల్లా పరిషత్ పాఠశాల నందు ఖాళీ స్థలంలో రైతు బజార్ ఏర్పాటుకు జేసీ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ కడప నగరంలో ఒక రైతుబజార్ మాత్రమే ఉందని, ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరొక రైతు బజార్ ఏర్పాటుకు చిన్నచౌకు పాత పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న 15 సెంట్లు స్థలం, జిల్లా పరిషత్ పాఠశాల యందు ఉన్న స్థలాన్ని పరిశీలించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కరోనాను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించాలనే ఉద్దేశంతో త్వరలో పట్టణ ప్రజల కోరికమేరకు మరొక రైతు బజారును ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. నగరంలో రైతు బజారు ఏర్పాటు చేస్తే ఉదయం వేళ కూరగాయలు, ఆకుకూరలకు వచ్చే ప్రజలకు మరింత సౌకర్యవంతంగా ఉంటుందన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వీలైనంత త్వరలో రైతు బజారు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. స్థల పరిశీలనలో మున్సిపల్ కమిషనర్ లవన్న, తాసిల్దార్ శివరామిరెడ్డి, డిప్యూటీ సీఈఓ నాగిరెడ్డి, మార్కెటింగ్ శాఖ ఏ డి రాఘవేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment