కష్టజీవులు వర్ధిల్లాలి

రాచపాలెం
1,224 Views

రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డిస్వార్థపరత పెంచి పరసౌఖ్యములద్రుంచి

తనకు గలుగుదాన తనియలేక

లోకములను మ్రింగ లోనెంచు నీచుండు

కాళికాంబ!హంస!కాళికాంబ..

నీచమానవుడు ఎలా ఉంటాడో ఏమి చేస్తాడో బ్రహ్మంగారు ఈ పద్యంలో  చెప్పారు. సామాన్యులకు కూడా అర్థమయ్యే భాషలో చెప్పారు.  నీచుడు స్వార్థాన్ని పెంచుకుంటాడు. తన సుఖం కోసం ఇతరుల సౌఖ్యాలను నాశనం చేస్తాడు. తనకు ఉన్నదానితో తృప్తిపడకుండా లోకాలనే మింగాలని ఆలోచిస్తాడు అన్నారు బ్రహ్మంగారు. స్వార్థం స్వ అర్థం అంటే నాప్రయోజనం అని అర్థం. ఆపదానికి ఇది అనుకూలార్థం. ఇది ఇతరులకు హాని చేసేదైతే వ్యతిరేకార్థం సిద్ధిస్తుంది. నాజీవితం బాగుండాలి అనుకోవడం తప్పు కాదు. దానికోసం న్యాయమైన మార్గంలో ప్రయత్నం చేయడమూ తప్పుకాదు. అయితే నేనే బాగుండాలి, తక్కినవాళ్ళంతా  దిక్కు లేకుండా పడిఉండాలి అనుకోవడం న్యాయం కాదు. ఇది ప్రమాదకరమైన స్వార్థం. ఒకడు సుఖపడడానికి ఇతరుల సుఖాలను త్రుంచాలని ప్రయత్నించడం నీచత్వమన్నారు బ్రహ్మంగారు. ఆయన సంతృప్తవాది. వైరాగ్యవాది. జనం  సుఖసంతోషాలతో ఉండాలన్నదే ఆయన ఉద్యమం. అయితే ఒకరిసుఖం కోసం ఇతరులసుఖాలను నాశనం చెయ్యటాన్ని ఆయన గుర్తించి వ్యతిరేకించారు. అందుకు ఆయన ఆత్మతృప్తివాదం ముందుకు తెచ్చారు. ఉన్నదానితో తృప్తి చెందకుండా లోకాలను మింగేసి  సంపన్నులమై పోదామను కోవడం నీచత్వమని అన్నారు.  వ్యక్తికోసం సమూహం బాధలపాలవ్వటాన్ని ఆయన వ్యతిరేకించారు. వ్యక్తిత్వవికాసం పేరుతో వ్యక్తివికాసాన్ని నేర్పతున్న  నిపుణులు బ్రహ్మంగారిని చదవాలి. మనిషి సామాజిక సంస్కారాన్ని వదులుకొని  అడ్డదారులలో పైకి రావాలనుకునే వారికి చెంపపెట్టు ఈపద్యం. సంపదమీద విపరీతమైన యావ, దానికోసం లోకాలను మింగేయాలని ప్రయత్నించడం నీచత్వం అని బ్రహ్మంగారి నిర్వచనం. 17వ శతాబ్దంలోనే ఇంత మాటన్న బ్రహ్మంగారికి ఇవాళ పెరుగుతున్న సంపన్నుల తీరుతెన్నులను చూస్తే వాళ్ళను నిర్వచించడానికి పదాలు దొరికేవా! భూదందాలు, ఇసుకదందాలు, రాజకీయగోడ దూకుళ్ళు, బయటపడుతున్నస్కాంలు , ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు,  విద్యవైద్య ఉపాధి వ్యాపారాలు, కల్తీమందులు, కల్తీ ఆహారాలు, నకిలీసరుకులు, కాల్మనీ సెక్స్ రాకెట్లు , మాఫియాల ఆగడాలు  వీటన్నిటినీ చూస్తే బ్రహ్మంగారు తనపద్యాలను ఎలా సవరించుకునేవారో!  లోకంలో జీవించాలనుకునే వారికి బ్రహ్మంగారి పద్యాలు సృజనాత్మకంగా ఉంటాయి. లోకాలను మింగేయాలనుకునేవారికి అవి విమర్శనాత్మకంగా ఉంటాయి.  పరపీడా పరాయణులు నశించాలనీ  కష్టజీవులు వర్ధిల్లాలనీ కోరుకుందాం. అందుకు పనికివచ్చే బ్రహ్మంగారిని చదువుదాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *