కాంస్య శిలాయుగపు శిలా చిత్ర లేఖనాలు వైయస్ఆర్ జిల్లా దువ్వూరు మండలం దాసరపల్లె, నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం చిన్నవంగలి మధ్యన మైదుకూరు పురావస్తు పరిశోధకుడు శేగినేని వెంకట శ్రీనివాసులు గుర్తించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని పెద్దబండలశెలగా పిలిచే ప్రాంతంలో కొండరాళ్లపై శిలాయుగపు చిత్ర లేఖనాలను గుర్తించినట్లు శ్రీనివాసులు తెలిపారు. జింకలు, దుప్పులు, శివ లింగాలు వంటి 40 చిత్రలేఖనాలు ఆప్రాంతంలో ఉన్నట్లు తెలిపారు. ఆనాటి మానవులు ఆహార సేకరణతోపాటు జంతువులను మచ్చిక చేసుకుని పశుపోషణ, వ్యవసాయం వైపునకు జీవన విధానాన్ని మరల్చుకున్నట్లుగా రాతిపై ఉన్న చిత్రలేఖనాలు తెలియజేస్తున్నాయని వివరించారు. లోయ గుహలో చారిత్రక యుగానికి చెందిన శివలింగం ఉన్నట్లు తెలిపారు.