ysrkadapa

చరిత్ర

గండికోట

కళ్యాణీ చాళుక్యులైన త్రైలోక్యమల్ల మహారాజుకు సామంత రాజుగా ఉన్న కాకరాజు క్రీ.శ. 1123 జనవరి 9వ తేదిన గండి కోటను నిర్మించినట్లు  గండికోట దుర్గం కైఫియత్‌ ద్వారా తెలుస్తోంది. కాకరాజు అసలు పేరు చిద్దణచోళ మహరాజు కావచ్చుననే అభిప్రాయం కూడా వెల్లడైంది. కాకరాజు గండికోట సమీపంలోని బొమ్మనపల్లె వాసి.

1279 నాటి అత్తిరాల శాసనంలో గండికోట గురించిన ప్రస్తావన మొదటిసారిగా కనిపిస్తోంది. కాయస్థ అంబదేవుడు తన రాజధానిని వల్లూరి నుండి గండికోట కు మార్చి క్రీ.శ. 1290 నాటి త్రిపురాంతకం శాసనం తెలుపుతోంది.

కాయస్థ అంబ దేవుడు గండికోట పట్టణమున పట్టంబు కట్టుకున్నట్లు క్రీ.శ. 1292 నాటి రాజంపేట శాసనం ద్వారా తెలుస్తోంది.

కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని సేనాపతి పట్టణ సాహిణి నాయకుడు కాయస్థ రాజులలో చివరివాడైన రెండవ త్రిపురారిదేవుడిని ఓడించి కొంతకాలంపాటు గండికోటను పరిపాలించినాడు. ఇతని అనంతరం జుట్టయలెంక గొంకారెడ్డిగండికోటకు అధిపతిగా నియమించబడ్డాడు. క్రీ.శ.1305 నాటి కానాల శాసనం ప్రతాపరుద్రుని ప్రతినిధి ఒకరు గండికోట నుండి పాలన చేశాడని చెబుతోంది.

మొదటి బుక్కరాయలు కాలంలో ఎల్లమరసామాత్యుడు గండికోట పాలకునిగా ఉండి, అక్కడి యోగానంద నృశింహలయానికి మరమ్మత్తులు చేయించాడు. కాకతీయ సామ్రాజ్య పతనాంతరం గండికోట తుగ్లక్‌ పాలన కిందికు వెళ్ళింది.

శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో సాళువ తిమ్మరుసయ్య అవసరం, తిమ్మరుసయ్య అవసరం దేమరుసయ్య, సాళువ గోవిందయ్యలు గండికోట సీమను నాయరకంగా పొందిన గూడూరు, తలమంచిపట్నం, నేకవారిపేట, ఉప్పలూరు, శాసనాల ద్వారా తెలుస్తోంది.

అచ్యుత దేవరాయలు కాలంలో అయ్యసరుసయ్య, బాచరుసు, చంద్రగిరి తిమ్మరుసయ్యలు గండికోటను నాయకరంగా పొందారని చింతకొమ్మదిన్నె, నూతులకోన, పుష్పగిరి శాసనాల ద్వారా తెలుస్తోంది.

విజయనగర చక్రవర్తి సదాశివరాయల కాలంలో గొబ్బూరి అవుబళదేవమహరాజు నంద్యాల తిమ్మయ దేవ మహరాజు, అవుబలరాజు, చినఅవుబలేశ్వర మహరాజు, నంద్యాల తిమ్మరాజు, నంద్యాల తిమ్మరాజయ్య, నంద్యాల నారసింహ

దేవరాజయ్యమహరాజు, పెమ్మసాని తిమ్మనాయుడులు గండికోటను నాయంకరంగా పొందినట్లు  శాసనాలు చెబుతున్నాయి.

తల్లికోట యుద్దం అనంతరం గోల్కొండ పాలకుడు మహమ్మద్‌ కులీకుతుబ్‌షా  తన మంత్రి అమీర్‌ ఉల్‌ ముల్క్‌ ద్వారా గండికోటను వశపరుచుకున్నాడు. అయతే రెండవ వెంకటపతిరాయలు కొద్దిరోజుల్లోనే తిరిగి గండికోటను

తన అధీనంలోనికి తెచ్చుకున్నాడు.

గోల్కొండ నవాబు అబ్దుల్‌ కులీ కుతుబ్‌షా  ప్రధాని, సైన్యాధికారి, మీర్‌జుమ్లా 1652సంవత్సరం  ఆగష్టు25 వ తేదిన పెమ్మసాని చిన్న తిమ్మనాయుని నుండి కోటను స్వాధీన స్వాధీనం చేసుకుంటారు. గండికోట చరిత్రలో పెమ్మసాని వారి పాలనకు విశిష్టమైన స్థానం ఉంది.

1687లో గోల్కొండ సామ్రాజ్యం ఔరంగజేబు వశం అయ్యేంతవరకు కుతుబ్‌షాహిల అధీనంలోనే గండికోట ఉండేది. ఆ తర్వాత కడప మయానా నవాబులు, మైసూరు పాలకుడైనహైదర్‌అలీ అధీనంలోకి గండికోట వెళ్ళింది. హైదర్‌అలీ గండికోటలో  సైన్యపు దండును ఉంచాడు. తర్వాత అతని కుమారుడు టిప్పు సుల్తాన్‌ స్వాధీనమై 1791లో టిప్పును, సుల్తాన్‌, ఆంగ్లేయుల చేతిలో ఓటమి పొందిన తర్వాత కెప్టెన్‌ లిటిల్‌ ఆధీనంలోకి గండికోట వెళ్ళింది.
http://ysrkadapa.info/archives/2048

Leave a Comment