జిల్లాలో రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు పెరగనున్నాయని, వడగాల్పులు ఎక్కువ అవనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలతో వడగాడ్పుల ముప్పు పొంచి ఉందన్నారు.
*తీసుకోవలసిన జాగ్రత్తలు – సూచనలు :*
*** రోహిణి కార్తె సమీపించినందున ఎండలు పెరుగుతాయి. ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.
*** వృద్ధులు, పిల్లలు మరింత అప్రమత్తంగా ఉండాలి. వేడివల్ల డీహైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఎక్కువ.
*** నీళ్లు, మజ్జిగ, కొబ్బరి నీరు లాంటివి ఎక్కువగా తీసుకోవాలి.
*** వేడి నుంచి కొంత ఉపశమనం కోసం లేత రంగులో ఉండే వదులైన దుస్తులు ధరించాలి.
*** ఎండ వేళ వీలైనంత వరకూ బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే తల, మొహంపై నేరుగా సూర్య కిరణాలు పడకుండా టోపీ లేదా తలపాగా ధరించాలి. లేదంటే గొడుగు వాడాలి.
*** శరీరంలో నీరు, లవణాలు చెమట వేడివల్ల ఎక్కువగా బయటకు వెళ్లే అవకాశం ఉన్నందున ఉప్పు కలిపిన మజ్జిగ ఎక్కువసార్లు తీసుకోవడం మంచిది.
*** వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు గది వాతావరణం కొంత చల్లగా ఉండేలా కిటికీలకు వట్టివేళ్లు లాంటివి కట్టి.. నీరు చల్లడం లాంటి ఏర్పాట్లు చేసుకోవాలి.
*** ఏదైనా అత్యవసరమైతే సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యశాలలకు వెళ్లాలని వైద్యులను సంప్రదించి వారిచే సూచనలు సలహాలు పాటించాలి.
*** అవసరం అయితే ప్రభుత్వం సూచించిన మేరకు వైఎస్ఆర్ టెలి మెడిసిన్ వైద్యసేవల టోల్ ఫ్రీ నెంబర్ 14410 కు లేదా టెలీ కన్సల్టెన్సీ కోసం 08562-244070 నెంబరుకు ఫోన్ చేసి వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలి.
ప్రజలందరూ ఎండల నుంచి కాపాడుకుంటూ తగు జాగ్రత్తలు పాటిస్తూ… ఆరోగ్యవంతులుగా ఉండాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.