గురువు ప్రజలకు భారం కాకూడదు

రాచపాలెం
1,040 Views
గురువులనుచు ప్రజకు బరువుగా నుందురు
గుట్టు తెలియనట్టి గురువులెల్ల
గుట్టుమట్టు దెలియు గురువులే హరిహరుల్?
కాళికాంబ!హంస!కాళికాంబ!
గురువులు పేరుతో గుట్టు తెలియనివారు ప్రజలకు బరువుగా తయారవుతున్నారు. గుట్టుమట్టు తెలిసిన గురువులు శివకేశవుల వంటివారు. బ్రహ్మంగారు తనకాలంలో గురువులుగా చలిమణి అవుతున్నవాళ్ళను చూసి చేసిన వ్యాఖ్య ఈ పద్యం. అనేక సామాజిక రంగాలతోపాటు తాత్త్వికరంగం కూడా కలుషితం కావడాన్ని గుర్తించి బ్రహ్మంగారు ఈ వ్యాఖ్య చేశారు. గురువు ప్రజలకు భారం కాకూడదు. ప్రజలభారం తగ్గించాలి. గురువు సమాజంలో మేధావివర్గానికి చెందినవాడు. ప్రజలకు వైజ్ఞానిక నాయకత్వం వహించవలసినవాడు. గురువు ప్రజలకు ఆదరణీయుడే కాదు ఆదర్శనీయుడు కూడా కావాలి. ప్రజలకు వాస్తవికమైన జ్ఞానాన్ని అందించాలి. ప్రజలను వంచించి మోసగించి అబద్ధపుజ్ఞానంలో ముంచి పబ్బంగడుపుకునేవాళ్ళు గురువులు కారు. గురువులు అంటే గుట్టు తెలిసిన వాళ్ళు అని బ్రహ్మంగారి అభిప్రాయం. గుట్టు అంటే ఒకజ్ఞానాంశంలోని వాస్తవికత. జీవితపరమార్థం. సామాన్యులు జీవితాన్ని గడుపుతారు. గురువులు ఆజీవిత తత్త్వాన్ని తెలుసుకొని ప్రజలకు వివరించాలి. జ్ఞానం కానిదానిని జ్ఞానంగా ,అజ్ఞానాన్ని జ్ఞానంగా ప్రచారం చేస్తూ ప్రజలశ్రమ దోపిడీ కావడానికి సహకరించే వాళ్ళు గురువులు కారు. గుట్టు అనేదానికి అనేకార్థాలు ఉండవచ్చు. ఎన్ని అర్థాలున్నా ప్రజలకు గురువుల భారాన్ని పెంచేది మాత్రం గుట్టుకాదు. బ్రహ్మంగారి దృష్టిలో గురువులు రెండురకాలు. బోధగురువులు, బాధగురువులు అని. ఈపద్యంలో విశ్రాంతిపరులైన బాధగురువులను గురించి చెప్పారు. గట్టుమట్టు తెలిసిన గురువులుంటే వాళ్ళు పౌరాణికులైన శివకేశవులతో సమానులన్నారు. నకిలీ గురువుల బెడద ఆనాడేకాదు ఈనాడూ ఉంది. విచిత్ర వేషధారణ , వంచనాత్మక సంభాషణలతో ప్రజను ఆకర్షించి, తామేదో మహాశక్తిసంపన్నులమని నమ్మించి, గారడీలతో మోసం చేసేవాళ్ళను బ్రహ్మంగారు గర్హించారు. ఇవాళ కూడా ఈ బాధగురువుల ప్రభ వెలిగిపోతూనే ఉంది. వీళ్ళకిప్పుడు రాచమర్యాదలుకూడా దక్కుతున్నాయి. వీళ్ళ చెప్పుచేతుల్లోకి రాజ్యం కీలుబొమ్మగా మారే దశ వస్తుందా అనిపిస్తున్నది. ప్రజలకు భారంగా మారుతున్న గురువుల గుంపుల గుట్టును రట్టు చేయాలంటే బ్రహ్మంగారిని చదవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *