జగనన్న ప్రభుత్వంలో…రైతన్నలకు ఏడాదంతా సంక్రాంతే

వార్తలు
220 Views

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతన్నల ఇంట ఏడాది పొడవునా సంక్రాంతి కళ సంతరించుకుందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా పేర్కొన్నారు. తొలియేడు – జగనన్న తోడు “మన పాలన- మీ సూచన” కార్యక్రమంలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం స్థానిక స్పందన హాలులో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధ్యక్షతన నిర్వహించిన “మనపాలన – మీ సూచన” లో భాగంగా వ్యవసాయ, అనుబంధ రంగాలపై క్షేత్ర స్థాయిలో పనిచేసిన అధికారులు, రైతులు, పలువురు నిపుణులతో మేధో మథన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులుగా హాజరైన ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో జనతా బజార్లు ఏర్పాటు చేయాలనే మరో వినూత్న కార్యక్రమానికి నిర్ణయం తీసుకున్నారన్నారు. వ్యవసాయ రంగంలో రైతు భరోసా కార్యక్రమం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం చేస్తూ రైతులకు వెన్నుదన్నుగా ప్రభుత్వం నిలుస్తుందన్నారు. వ్యవసాయ రంగంలో ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఉచిత పంటల బీమా గ్రామ స్థాయిలో రైతులకు మేలు జరిగే విధంగా గ్రామసచివాలయాలలో గ్రామ వ్యవసాయ, ఉద్యాన సహాయకుల నియామకం, మార్కెటింగ్ శాఖ ద్వారా రైతుల వద్ద నుంచి పండిన పంటను ప్రభుత్వము నేరుగా సేకరించుట, చిరుధాన్యాల సాగును ప్రోత్సహించుటకై “చిరుధాన్యాల బోర్డు” ను ఏర్పాటు, ప్రస్తుత కష్ట కాలంలో ( కరోనా వ్యాప్తిని నిరోధించడానికి) రైతు బజార్లను, మొబైల్ రైతు బజార్లను గ్రామ స్థాయి వరకు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రైతులకు మరింత మేలు చేయడానికి YSR రైతు భరోసా కేంద్రాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాలను సమన్వయం చేసి వ్యవసాయాన్ని ఒక పండుగలాగా చేయడానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమం సందర్భంగా వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలను రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ.. రాబోవు రోజుల్లో రైతు భరోసా కేంద్రాలు అత్యంత కీలకం కాగలవని పేర్కొన్నారు. జిల్లాలో 620 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్ట కాలంలో కూడా వ్యవసాయ మార్కెటింగ్ శాఖల ద్వారా రైతులు ఏ మాత్రం నష్టపోకుండా ప్రభుత్వం గిట్టుబాటు, మద్దతు ధరలు కల్పించిందన్నారు. ఈ ఏడాది పసుపు మద్దతు ధరతో జిల్లాలో 6600 క్వింటాళ్లు కొనుగోలు చేయడం జరిగింది. పశుసంవర్ధక శాఖ ద్వారా మేకలు,గొర్రెలు, బర్రెలు చనిపోతే..భీమా సౌకర్యం కల్పిస్తోందన్నారు. గత ఏడాది జులై 8న వైయస్సార్ జయంతి సందర్భంగా 7500 మంది శెనగ రైతులకు క్వింటాలుకు రూ.1500 చొప్పున గిట్టుబాటు ధరతో కొనుగోలు చేయడం జరిగిందన్నారు. గతంలో 2012 – 13లో పెండింగులో ఉన్న భీమా మొత్తాన్ని కూడా దాదాపు రూ.120 కోట్లను 2019లో ఎంపీ అవినాష్ రెడ్డి చొరవతో రైతులకు విడుదల చేయడం జరిగిందన్నారు. 2019 ముందు, తర్వాత ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు రూ.7 లక్షలు సాయం ఇస్తామని చెప్పిన ముఖ్యమంత్రి ఆ మాటను నిలబెట్టుకోవడం జరిగిందన్నారు. తద్వారా 90 రైతు కుటుంబాలకు కలిపి సుమారు రూ.5 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు. జిల్లాలో రైతు భరోసా కింద సుమారు 450 కోట్ల రైతులకు లబ్ధి చేకూరుతుందని అన్నారు. రైతు భరోసా పధకం ద్వారా ప్రతి అర్హత ఉన్న రైతుకు ప్రతి ఏడాది రూ. 13,500లు చొప్పున అందించడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది ఇప్పటికే రూ.7500 వారి ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. రెండవ విడతగా అక్టోబర్ లో, మూడవ విడతగా వచ్చే జనవరిలో మిగతా మొత్తం అందజేయడం జరుగుతోందన్నారు. వ్యవసాయ అనుబంధం రంగం అయిన ఉద్యాన శాఖ ద్వారా.. ప్రతి గ్రామ సచివాలయం ఆధ్వర్యంలో హార్టికల్చర్ అసిస్టెంట్ ను నియమించడం జరిగిందని, వారిద్వారా.. ఉద్యన రైతులకు సేవలు అందించడం జరుగుతోందన్నారు. మైక్రో ఇరిగేషన్ ద్వారా.. వ్యవసాయ పొలాలకు తక్కువ మోతాదులో నీటిని ఉపయోగించేలా సూక్ష్మ నీటి పారుదల కింద.. బిందు సేద్యం, తుంపర సేద్యం విధానాలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తోందన్నారు. సూక్ష్మ సేద్యం వాడకంలో జిల్లా యంత్రాంగం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, 50 వేల ఎకరాలలో దాదాపు 150 కోట్ల వెచ్చించి సబ్సిడీతో పలు రకాల పద్ధతులను రైతులకు చేరువ చేస్తోందన్నారు. సూక్ష్మ సేద్యంలో రాష్ట్రం రెండవ స్థానం, దేశంలో 3వ స్థానంలో ఉందన్నారు. పండ్ల తోటలకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆ దిశగా రైతులను ప్రోత్సహిస్తోందన్నారు. విద్యుత్ వినియోగంలో రైతులకు పగలు పూట 9 గంటలు ఉచిత సరఫరా చేస్తూ.. రైతులకు ఎంతో మేలు జరుగుతోందని… జిల్లాలో 760 ఫీడర్లు ఉంటే.. 650 ఫీడర్ల ద్వారా ప్రస్తుతం విద్యుత్తు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఇంక 120 ఫీడర్ల ద్వారా విద్యార్థులు ఇవ్వడానికి 33 కెవి, లెవెన్ కె.వి లైన్లు, ట్రాన్స్ఫార్మర్లు వేసి సెప్టెంబర్ నాటికి.. పూర్తి స్థాయిలో అందివ్వగలమన్నారు. ఉచిత విద్యుత్ ద్వారా రైతులకు ఒక్కొక్కరికి 7200 ఏడాదికి యూనిట్లు అందివ్వడం జరుగుతోందన్నారు.
సోలార్ ప్రోజెక్టుల ద్వారా 275 కోట్లతో.. రెండు చోట్లా జిల్లాలో పనులు చేపట్టడం జరిగిందన్నారు. సిఎం యాప్ ద్వారా రైతు గిట్టుబాటు ధరకు కొనుగోలు, మార్కెటింగ్ ఇంటిలిజన్స్ , సలహాలు అందుతాయన్నారు. జనతా బజార్ లు 2022 లోపు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. జిల్లాను హార్టికల్చర్ హబ్ గా తీర్చి దిద్దుతున్నామన్నారు. రైతుల కమిటీలు వేసి అర్హులందరికీ సాయం అందేలా.. సరళీకృత విధానం ద్వారా రైతులకు లబ్ది చేకూర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
గండికోట జలాశయంలో 26 టీఎంసీల మేర సామర్ధ్యాన్ని పెంచి.. రైతులకు మరింత మేలు చేకూర్చే విధంగా.. ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారన్నారు. మైదుకూరు, పులివెందుల, రాయచోటి నియోజక వర్గాల్లో సాగునీటి ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలకు గత డిసెంబర్ నెలలోనే.. శంకుస్థాపనలు చేయడం జరిగింది. త్వరలోనే… కార్యాచరణ పూర్తి చేయడం జరుగుతుందన్నారు. సదస్సులో ఉపయుక్త సలహాలు సూచనలిచ్చే వాడిని ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుందన్నారు.

రైతు భరోసా, రెవెన్యూ విభాగం జేసీ ఎం.గౌతమి మాట్లాడుతూ.. అధికార వికేంద్రీకరణను చేపట్టడంతో పాటు పాలనలో జవాబుదారీ, పారదర్శకతను ప్రభుత్వం తీసుకువచ్చిందని, ఇందులో భాగంగా అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసిందన్నారు. జిల్లాలో ఇప్పటి వరకూ వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక శాఖ, ఆక్వా తదితర రంగాల్లో జిల్లా సాధించిన ప్రగతిని, అందుకు సంబంధించిన పథకాలు, రైతు సంక్షేమ పథకాల అమలు తీరును పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా జేసి వివరించారు. కార్యక్రమంలో మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రైతు భరోసా, జాయింట్ కలెక్టర్లు ఎం. గౌతమి, సి.ఎం.సాయికాంత్ వర్మ హాజరయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *