ఈనెల 28వతేది నుంచి  జిల్లాలో చేపట్టే “ఏరువాక పూర్ణిమ” కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించాలని జిల్లా కలెక్టరు హరికిరణ్‌ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన మేరకు ఇందులో పె­­­ద్దఎత్తున రైతులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. సోమవారం రాత్రి తన ఛాంబర్లో వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…. నైరుతి రుతుపవనాలు ఆధారంగా జ్యేష్ఠ మాసం పౌర్ణమి రోజున  గ్రామాల్లో రైతులు వారి పశువులు, ఉపకరణాలను అలంకరించడం, విత్తనాల నమూనాలను విక్రయించటం చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమాలను రైతులు ఒక పండుగగా, ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం 28న ఏరువాక పూర్ణిమ కార్యక్రమాన్ని చేపట్టిందని చెప్పారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఏరువాక కార్యక్రమాన్ని పకడ్బందీగా చేయాలని, ఈ కార్యక్రమాలకు ఇంఛార్జి మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు, ఎంపీలు, ఎమ్యెల్యే లు, ఎంఎల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు, సింగిల్ విండో ప్రెసిడెంట్స్ లందరిని ఆహ్వానించాలని, రైతులందరు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ జేడిని ఆదేశించారు. వ్యవసాయ శాఖ  ఎంపీఈవో లు, ఏఈఓలు ఆయా గ్రామాలు, మండలాల్లోని ఎన్పీఎమ్ రైతులు, మహిళా రైతులు, రైతుమిత్ర గ్రూపులు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ లను మోటివేట్ చేసి కార్యక్రమంలో పాల్గొనేలా అవగాహన కల్పించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పారు. అలాగే జిల్లాలో పసల్‌బీమా యోజన అమలవుతున్న తీరు, సాధించిన ప్రగతి, ఈ పథకం కింద ఎంతమంది రైతులు పంటల బీమా చేసుకున్నారు, ప్రీమియం చెల్లింపులు, పంట రుణాలకు సంబంధించి బ్యాంకర్లు సహకారం తదితర అంశాలలో ఎల్ డిఎం, వ్యవసాయ శాఖ జేడీని వివరాలు అడిగి తెలుసుకుని సూచనలు చేశారు. సమావేశంలో ఇంఛార్జి జేసీ2 రామచంద్రా రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ, హార్టికల్చర్, సిరికల్చర్, మైక్రో ఇర్రిగేషన్, పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, జయకుమార్, ఎల్ డి ఎమ్ అంజనేయాచారి, సీపీఓ తిప్పేస్వామి, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.