బాధ్యత నుంచి తప్పుకోవడం తప్పుదుష్టవాయు వితతి దోర్బలమ్మునుజూప
దుర్బలులకు బ్రతుకు దుస్సహమ్ము
కలవరమ్ము మాపి కాపాడజూడుమా
కాళికాంబ!హంస!కాళికాంబ.
బలవంతుల దౌర్జన్యాలవల్ల బలహీనుల బతుకు భరించదానిదై పోతున్నది. వాళ్ళు కలవరపడుతున్నారు. వాళ్ళ కలవరాన్ని పోగొట్టి కాపాడండి. 17వ శతాబ్దంనాటి సామాజిక వాస్తవికతను కళ్ళారా చూసిన బ్రహ్మంగారు ఇచ్చిన పిలుపు ఈపద్యం . సమాజం బలవంతులు, బలహీనులు అని రెండువర్గాలుగా చీలిపోయి పరపీడన పరాయణత్వం అమలులో ఉండడం ఆయన గమనించారు. తనసౌఖ్యం కోసం బలవంతుల పంచన చేరలేదాయన. బలహీనులవైపు నిలిచారు. వాళ్ళబతుకు దుస్సహంగా ఉండడం చూశారు. సంస్కర్తగనక అందర్నీ బలహీనులవైపు నిలబడి వాళ్ళ కలవరాన్ని పోగొట్టమన్నారు. కలవరం అంటే భయంతో కూడిన ఆందోళన. బిత్తరపాటు. బలవంతులకు కావలసిన సకల వస్తువులనూ ఉత్పత్తి చేసేవారు. వాళ్ళకవసరమైన సకలసేవలూ చేసేవాళ్ళు. అయినా వాళ్ళకు జీవనభద్రత లేదు. ప్రజలమధ్య తిరుగుతూ ప్రజల దైనందిన సమస్యల్ని అర్థం చేసుకునే క్రమంలో ఆయన వర్గవైరుధ్యాలను గుర్తించారు. కర్మసిద్ధాంతాన్ని వ్యతిరేకించారు బ్రహ్మంగారు. లేకుంటే వాళ్ళకర్మ వాళ్ళది అని వెళ్ళిపోయేవారు. కర్మసిద్ధాంతంలోని స్వార్థ రహస్యం ఆయనకు తెలుసుగనక ప్రజలకే విజ్ఞప్తి చేశారు. బాధలలో ఉన్నవాళ్ళబాధ్యత తీసుకోమని. తాత్త్వికులైనంత మాత్రాన, ఆధ్యాత్మికవాదులైనంత మాత్రాన భౌతిక సమాజం ఎదుర్కొనే సమస్యల పట్ల బాధ్యత నుంచి తప్పుకోవడం తప్పు అని బ్రహ్మంగారి జీవితం చాటిచెప్పింది. సమాజంలో బతుకుతూ సమాజాన్ని విస్మరించకూడదు అని ఆయన జీవితం బోధిస్తుంది. ఆధ్యాత్మిక వాది అంటే పలాయనవాది కాదు అని ఆయన ప్రజా నిబద్ధత తెలియజేస్తుంది. ఇవాళ మన ఆధ్యాత్మికరంగంలో మనం చూస్తున్న అవలక్షణాలను గమనిస్తుంటే బ్రహ్మంగారు ఎంత ఎత్తులో ఉన్నారో అర్థమౌతుంది. భావవాదిగా కనిపిస్తూ భౌతిక సమాజాన్నిగురించి ఎంత శ్రద్ధ చూపారో నేటి ఆధ్యాత్మికరంగం ఆలోచించాలి. ఆయనను ఈనాటి సమాజం చదవాలి. సామాజిక హింసను నివారించడానికి పాఠశాలస్థాయి నుంచే పునాది వెయ్యడానికి బ్రహ్మంగారు ఉపయోగపడతారు.