తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మంగారిమఠంలో రూ.1.45కోట్లతో నిర్మించిన యాత్రికుల భవన సముదాయాన్ని తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌యాదవ్‌ ప్రారంభించారు. పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామిని దర్శించుకున్న అనంతరం 22గదులతో నిర్మించిన యాత్రికుల సముదాయాన్ని బ్రహ్మంగారి ఆలయ పీఠాధిపతి వసంత వీరభోగ వెంకటేశ్వర స్వామితో కలసి ప్రారంభించారు. ప్రత్యేక పూజల అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈసందర్భంగా సుధాకర్‌యాదవ్‌ మాట్లాడుతూ గ్రామాల్లో భజన మందిరాల నిర్మాణం కోసం రూ.10లక్షలు మంజూరు చేసేలా పాలకమండలి నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. గతంలో రూ.8లక్షలు మాత్రమే మంజూరు చేసేవారని పెరిగిన ధరలతో మొత్తాన్ని పెంచినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే భజన మందిరాలు మంజూరు చేసి పనులు ప్రారంభించని వాటికి కూడా రూ.10లక్షలు చెల్లిస్తామని తెలిపారు. ఆలయాల్లో ఉత్సవాల సందర్భంగా హిందూ ధార్మికతను చాటి చెప్పేలా తితిదే వారిచే ధార్మిక కార్యక్రమాలను నిర్వహించబోతున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట కోదండరామాలయంలో నాలుగు వారాలకు ఒకసారి తితిదే చే తీర్థ ప్రసాదాలను పంపిణీ చేస్తామన్నారు. పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి శిష్యుడు సిద్ధయ్యగారిమఠంలో తితిదే ఆధ్వర్యంలో రూ.4.5కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్లు తెలిపారు. రూ.85లక్షలతో అక్కడే యాత్రికుల భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందరెడ్డి, తెదేపా నాయకులు మేకల రత్నకుమార్‌యాదవ్‌లు పాల్గొన్నారు.