ysrkadapa

వార్తలు

రాష్ట్రంలో ప్రభుత్వాసుపత్రుల బలోపేతానికి ప్రత్యేక చర్యలు

కరోనా కట్టడికి డాక్టర్లు, వైద్య సిబ్బంది సైనికుల్లా పనిచేసి దేశంలో మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎస్ బి. అంజాద్ బాషా అన్నారు. మంగళవారం రిమ్స్ ఆస్పత్రిలో ఇటలీ దేశపు కథోలిక బిషప్ ల సమాఖ్య సహకారంతో లీగల్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ డైరెక్టర్ పెనుబాల విజయ్ కుమార్ రిమ్స్ వైద్యులకు, వైద్య సిబ్బందికి ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ మేయర్ సురేష్ బాబు చేతుల మీదుగా పిపిఈ కిట్స్, శానిటైజర్లను అందజేశారు.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కరోనా కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారని, రాష్ట్రవ్యాప్తంగా వైకపా నాయకులు, కార్యకర్తలు కరోనా నియంత్రణకు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారన్నారని కొనియాడారు. డాక్టర్లు, వైద్య సిబ్బంది ప్రొటెక్టివ్ గా ఉంటే కరోనా వ్యక్తులకు మంచి వైద్యం అందిస్తారన్నారు. దాతలు ముందుకు వచ్చి కరోనా నిర్మూలనకు సంబంధించిన మెటీరియల్ అందజేయాలని కోరారు. లీగల్ ఎడ్యుకేషన్ అవేర్‌నెస్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ డైరెక్టర్ పెనుబాలవిజయ్ కుమార్ రూ. 10 లక్షల పాయలతో రిమ్స్ వైద్యులకు పీపీఈ కిట్లు శానిటైజర్ లు అందజేయడం శుభపరిణామమన్నారు. ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. కడప జిల్లాలో కరోనా కేసులు నమోదయినప్పటికీ డాక్టర్లు, వైద్య సిబ్బంది అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయడం వల్లే ఒక్క కరోనా మరణం కూడా సంభవించలేదన్నారు. రాబోయే రోజులలో కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డి మాట్లాడుతూ కరోనా కట్టడికి గత మూడు నాలుగు మాసాలుగా వైద్యులు, వైద్య సిబ్బంది సైనికులుగా పనిచేసి కరోనాను నియంత్రించగలుగుతున్నామన్నారు. కరోనా కనిపించని శత్రువని ఈ కనిపించని శత్రువు పట్ల ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే లాక్ డౌన్ ఆ దేశాలకు మన రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16 మెడికల్ కళాశాలలు నిర్మించేందుకు వచ్చే ఆగస్టు మాసంలో టెండర్లు పిలవడం జరుగుతుందన్నారు. మరియు 72 ప్రైమరీ హెల్త్ సెంటర్ లను ఆధునీకరించేందుకు ప్రభుత్వం రూ. 26 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రిలో 9 నుంచి 10 వేల మంది సిబ్బందిని రిక్రూట్ చేసి మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజులలో ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. నిరంతరం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న మన ముఖ్యమంత్రి కి ప్రతి ఒక్కరూ సహాయసహకారాలు అందించి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సురేష్ బాబు, రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రసాద్ రావు, కోవిడ్-19 నోడల్ ఆఫీసర్ డాక్టర్ సురేశ్వర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ వరలక్ష్మి, ఆర్ ఎం వో డాక్టర్ కొండయ్య, ఫాదర్ బాలస్వామి రెడ్డి, వైయస్సార్ సిపి నాయకులు సుభాన్ భాష, దాసరి శివప్రసాద్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, 31 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి అజ్మతుల్లా ఖాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment