రూ12,950 కోట్ల అంచనాతో జిల్లా రుణ ప్రణాళిక ఆమోదం

వార్తలు
1,378 Views
జిల్లాలో 2020 -21 ఆర్థిక సంవత్సరానికి రూ12950 కోట్ల అంచనాతో జిల్లా రుణ ప్రణాళికను ఆమోదించినట్లు జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తెలిపారు. స్థానిక కలెక్టరేట్ లోని స్పందన హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టెటివ్ కమిటీ (DCC), డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ (DLRC) బ్యాంకర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… కోవిడ్-19 నేపథ్యంలో కుదేలైన రంగాలను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు పథకాలను ప్రకటించాయని వాటిని అమలు చేయడానికి బ్యాంకులు కృషి చేయాలన్నారు. ప్రస్తుతం ఆమోదించిన రూ12,950 కోట్ల జిల్లా రుణ ప్రణాళిక గత సంవత్సర రుణ ప్రణాళిక కంటే 16.89 శాతం ఎక్కువ అన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం రుణ ప్రణాళికలో ప్రాధాన్యతా రంగాలకు రూ.10,250 కోట్లు, నాన్ ప్రయారిటీ రంగానికి రూ.2700 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ప్రాధాన్యత రంగంలో వ్యవసాయానికి సంబంధించి ఖరీఫ్ మరియు రబీ పంట రుణాల కింద రూ.5,500 కోట్లు, వ్యవసాయ దీర్ఘకాలిక రుణాలకు రూ.1,600 కోట్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1,600 కోట్లు అందించడం లక్ష్యమన్నారు. ఆయా రంగాలలో అభివృద్ధి సాధించడానికి అవసరమైన సమయాలలో ఆయా యూనిట్లకు బ్యాంకులు తగిన విధంగా చేయూతనివ్వాలని పేర్కొన్నారు. Covid 19 నేపథ్యంలో నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం ఎంతో అవసరమన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రాయితీలను, ఆర్థిక సహాయం కార్యక్రమాలను లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా ఇస్తున్నారని, ఈ క్రమంలో గ్రామీణ , పట్టణ ప్రాంతాలలో బ్యాంకులు నిర్వహించే ఆర్థిక అవగాహన కార్యక్రమాలలో బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేయించడం, నగదు రహిత లావాదేవీలు నిర్వహణలో అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆర్థిక చేకూర్పు కార్యక్రమంలో ఉన్న లక్ష్యం ఎంత, బ్యాంకు ఖాతాలు ఎంతమందికి ప్రారంభించారు, ఇంకా ఖాతాలు ప్రారంభించని వారు ఎంతమంది ఉన్నారు తదితర వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ బ్యాంకు ఖాతాలు ప్రారంభించని వారందరితో వెంటనే బ్యాంకు ఖాతాలు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ (RSETI) ద్వారా ఉపాధి శిక్షణ అవకాశాలను మరింత ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్టాండప్ ఇండియా పథకంలో భాగంగా పరిశ్రమల శాఖ మరియు డిక్కీ ప్రతినిధులు మార్గదర్శకాలను అనుసరించి కొత్తగా వచ్చే దరఖాస్తులను వెంటనే బ్యాంకులకు పంపాలని, అనంతరం వాటి ప్రగతిని బ్యాంకులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకోవాలని పరిశ్రమల శాఖ జిఎం, డిక్కీ ప్రతినిధిని, ఎల్డిఎంను ఆదేశించారు. ప్రధానమంత్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకం లో జిల్లాలో 2.92 లక్షల మంది లబ్ధి పొందారని వాళ్ళందరికీ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులను వెంటనే అందజేయాలని బ్యాంకర్లను, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. Covid 19 వల్ల కలిగే ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని గ్యారెంటెడ్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ (GECL) పథకంలో భాగంగా ఆత్మ నిర్బర్ భారత్ అభియాన్ పథకం కింద సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలను, ఇతర రంగాలను ఆదుకునే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిందని, ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యం పరిశ్రమల నిమిత్తం ఇప్పటికే రుణాలు పొందిన వారికి ఆత్మవిశ్వాసాన్ని నింపడంతోపాటు వారికి మరింత అదనపు రుణ లభ్యతను అందించి ప్రోత్సహించడం అన్నారు. ఈ పథకం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధించాలని తెలిపారు. జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, కాపు కార్పొరేషన్ లు ద్వారా పురుషులకు మరియు మహిళలకు ప్రభుత్వ ప్రాయోజిత యూనిట్ల స్థాపనలో బ్యాంకుల వద్ద పెండింగ్ దరఖాస్తులను త్వరితగతిన మంజూరు చేయాలని, ఇందుకు సంబంధిత కార్పొరేషన్ అధికారులు, బ్యాంకర్లు సమన్వయంగా కృషిచేయాలని సూచించారు. అనంతరం వివిధ అంశాలను సమీక్షించి తగు సూచనలు జారీ చేశారు. ఈ సమావేశంలో జేసి ఎం.గౌతమి, ఎల్డిఎమ్ జె.అంజనేయాచారి, యూనియన్ బ్యాంక్ డిజిఎం మురళీకృష్ణ, కెనరా, ఏపీజీబి బ్యాంకు ఆర్ఎంలు సూర్యనారాయణ, శైలేంద్రనాధ్, నాబార్డ్ డీడీఎం శ్రీనివాసులు, జిల్లా అధికారులు, వివిధ బ్యాంకర్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *