Friday, March 29, 2024

సంక్షేమ ఆలయాలుగా.. సచివాలయాలు

పేదల సంక్షేమమే.. ప్రధాన ద్యేయంగా అడుగులేస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో సచివాలయాలన్నీ సంక్షేమ ఆలయాలుగా వెలుగొందుతున్నాయని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పేర్కొన్నారు. సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మంగళవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ కు జిల్లా ఎస్పీ అన్బు రాజన్, జెసిలు గౌతమి (ఆర్.బి.కె., రెవెన్యూ), సాయికాంత్ వర్మ (సచివాలయాలు,అభివృద్ధి), శివారెడ్డి (ఆసరా,సంక్షేమం)లు పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ నిర్దిష్ట కాలపరిమితిలోనే సంక్షేమ పథకాల అర్హత ధ్రువీకరణ పత్రాలను గ్రామ, వార్డు సచివాలయాల్లోనే అందించే వినూత్న కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో కాలపరిమితి నిర్ణయించే పద్ధతిని ఆరంభించిన మొదటి రాష్ట్రం మనదేనన్నారు. కొత్త విధానం ప్రకారం.. దరఖాస్తు చేసిన పది రోజుల్లోనే బియ్యం కార్డు, పది రోజుల్లో పింఛన్‌ కార్డు, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో లబ్దిదారులయిన మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్‌ చేసి అప్పగిస్తారన్నారు. ప్రభుత్వ ప్రధాన సేవలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా 541 రకాల సేవలు నిర్దిష్ట కాలపరిమితితో ప్రజలకు అందనున్నాయన్నారు. లబ్ధిదారుల జాబితా, అర్హతలు, లబ్ధిపొందే విధానం వంటి వివరాలను అక్కడే పొందుపరచడం జరుగుతోందన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను వలంటీర్లు క్షేత్ర స్థాయిలో నిజనిర్ధారణ చేసి, నిర్దిష్ట కాలపరిమితిలో.. సంబందిత సంక్షేమ ఫలాలను లబ్ధిదారుల ఇంటికే వెళ్లి అందజేస్తారన్నారు. ఈ సేవలన్నింటిని ప్రజలు సద్వినియోగించుకునేందుకు సంబందిత అధికారులు అవగాహన కల్పించాల్సి ఉందన్నారు.

సంక్షేమ ఫలాలకు సంబంధించి లబ్ది పొందడంలో ఏవైనా సమస్యలు ఉంటే.. సంబంధించిన సలహాలు, సూచనలు, ఫిర్యాదులను 1902 టోల్‌ ఫ్రీ నంబర్‌కు తెలియజేయవచ్చన్నారు. వ్యవసాయ అనుబంధ సేవల కోసం 1907కు, టెలి మెడిసిన్‌ సేవల కోసం 14410, అవినీతిపై ఫిర్యాదుల కోసం 14400, “దిశ ” చట్టంకు సంబంధించి 181, మద్యం అక్రమ తయారీ, అమ్మకం, రవాణా, ఇసుకపై ఫిర్యాదులను 14500కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందన్నారు.

జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న గ్రామ సచివాలయ భవనాలు, వైఎస్ ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ ఆర్ విలేజ్ క్లినిక్ లు కోసం పెండింగ్ లో ఉన్న స్థల సేకరణ పనులు, మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై జాయింట్ కలెక్టర్లతో సమీక్షించి, పలు సూచనలు అందించారు. అలాగే పాఠశాలలు, పీహెచ్ సి లలో చేపడుతున్న “నాడు-నేడు” అభివృద్ధి పనుల పురోగతిపై విద్యాశాఖ, పంచాయతీరాజ్ శాఖ, డ్వామా అధికారులు, ఇంజనీర్లు నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంపౌండు వాల్, మరుగుదొడ్లు, నిరంతర నీటి వసతి కల్పనపై వివరాలను సేకరించారు. అలాగే కొత్త ఇసుక రీచుల గుర్తింపు, ఇసుక సేకరణ, నిల్వ సామర్థ్యం, టెండర్ల వివరాలు, స్టాకు పెంచేందుకు చేపట్టే చర్యలు, పక్కా జిల్లాలకు సరఫరా చేసే వీలు, బల్క్ ఆర్డర్ల పై కూడా చర్చించారు. మనబడి-నాడు-నేడు పనులకు సరిపడా నిల్వలను సమకూర్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. నిర్ణీత గడువులోపు పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే కోవిడ్-19 నియంత్రణ కోసం చేపట్టే చర్యలను నిరంతరాయంగా కొనసాగించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బంది ఎప్పటిలాగే ఫీవర్ సర్వేలు, ఇతర ప్రాంతాల నుండి వచ్చేవారిని కోవిడ్ నిర్ధారణ పరీక్షలు విధిగా నిర్వహించాలన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ప్రభుత్వ విధివిధానాలను, ఆరోగ్య సూత్రాలను ప్రజలు పాటించేలా చర్యలు చేపట్టాలని సంబందిత అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో డిఆర్వో రఘునాథ్, సిపిఓ తిప్పే స్వామి, డిపిఓ ప్రభాకర్ రెడ్డి, డీఆర్డీఏ పిడి మురళీమనోహర్, సిఎం హెచ్ఓ డా. ఉమ సుందరి, రిమ్స్ సూపరింటెండెంట్ డా. ప్రసాద్ రావు, ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా.రవీంద్రా రెడ్డి, వ్యవసాయ శాఖ జెడి మురళీకృష్ణ, డీఈఓ శైలజ, ఎస్ఎస్ఏ పిఓ ప్రభాకర్ రెడ్డి, డ్వామా పిడి యధుభూషన్ రెడ్డి, మైన్స్ శాఖ డిడి మోహన్ రావు, పీఆర్ ఎస్ఈ సుబ్బారెడ్డి, చేనేత జౌళి శాఖ సహాయ సంచాలకులు శ్రీరంగం అప్పాజీ, సంబందిత శాఖల ఇంజనీర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular