సంక్షేమ పథకాల అమలును.. వేగవంతం చేయాలి

వార్తలు
738 Views
“నవశకం”లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ సంక్షేమ పథకాల కార్యాచరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు పురోగతి, ఇసుక సరఫరా, కోవిడ్-19 నియంత్రణ చర్యలు తదితర అంశాలపై గురువారం స్థానిక కలెక్టరేట్ విసి హాలు నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, నియోజకవర్గ ప్రత్యేకధికారులు, తహశీల్దార్లు, ఎంపిడిఓలు, వైద్యాధికారులతో చర్చించారు
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలోని అన్ని సచివాలయాల్లో గ్రామ, వార్డు వేల్ఫేర్ సెక్రెటరీలు, సంక్షేమ నోడల్ బాధ్యతలను నిరంతరాయంగా చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాల కేలండర్ ను విధిగా అనుసరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న “పేదలందరికి ఇంటి పట్టాల పంపిణీ”కి సంబంధించి అర్హులు, అనర్హులు, పాత లబ్ధిదారులు, కొత్త లబ్ధిదారుల జాబితాలను అందరికీ తెలిసేలా జూన్ 12వ తేదీన అన్ని సచివాలయాల్లో నోటీసు బోర్డులో పొందుపరచాలన్నారు. హౌసింగ్ పథకానికి సంబంధించి జూన్ 15వ తేదీ లోగా పాత లే అవుట్ల పనులు పూర్తి చేసి జూన్ 30 లోగా కొత్త లే అవుట్ల పనులు (ఇంటర్నల్, అప్రోచ్ రోడ్లు తదితరాలు) పూర్తి చేయాలన్నారు. కొత్తగా ఎంపిక చేసిన జాబితాకు జూన్ 25వ తేదీలోపు లాటరీ ద్వారా ప్లాట్లు కేటాయించాలన్నారు. జులై 8వ తేదీ నాటికి ఇంటి పట్టాల పంపిణీ కోసం ఏర్పాట్లను సర్వం సిద్ధంగా ఉండాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో ఎక్కువగా కొత్తవారు వచ్చి చేరడం.. పాత వారు ఇతర ప్రాంతాలకు వెళ్లడం తరచూ జరుగుతూంటుందని.. ఈ నేపథ్యంలో కొత్త అర్హుల జాబితా ఎంపికలో ప్రత్యేక దృష్టి సారించాల్సి వుంటుందన్నారు.
* గ్రామ సచివాలయాలు, వైఎస్ ఆర్ రైతు భరోసా కేంద్రాలు, వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్ భవన నిర్మాణా ల కోసం స్థల సేకరణ వేగవంతం చేయాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి ఆర్బికే, విలేజ్ క్లినిక్, సచివాలయం మూడు కూడా ఒకే ప్రాంగణంలో ఉండేలా.. ప్రాధాన్యం ఇస్తూ స్థల సేకరణ చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఏవైనా స్థానిక సమస్యలు ఉంటే.. సంబందిత జేసికి లేదా తన దృష్టికి తీసుకురావాలన్నారు.

* ఇసుకకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక జీవోను విడదల చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ఎద్దుల బండ్ల ద్వారా 5 కిలోమీటర్ల పరిధి లోపు ఉచితంగా ఇసుక రవాణా చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. అది కూడా సమీపంలోని వాగులు, వంకలు నుండి గ్రామస్థులు సొంత ఇంటి నిర్మాణం వంటి అవసరాల కోసం మాత్రమే ఉపయోగించుకోవలన్నారు. ఏ మాత్రం వాణిజ్య అవసరాలకు ఈ విధానాన్ని (ఎద్దుల బండ్ల ద్వారా) ఉపయోగించకూడదన్నారు. సంబందిత అధికారులు ప్రతి ఒక్కరూ ఇసుక రవాణా పై పర్యవేక్షణ ఉంచాలన్నారు. ఎద్దుల బండ్ల ద్వారా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే.. మొదటి జరిమానగా రూ.2000, రెండవ జరిమానగా రూ.3000లు, మూడవ జరిమానగా రూ.5000లు విధించడంతో పాటు వాహనం సీజ్ చేయడం జరుగుతుందన్నారు.

* ఉపాధి హామీ పనుల నిర్వహణపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టారని, అన్ని జిల్లాలకు టార్గెట్ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 75 % టార్గెట్ చేయగలిగారని.. జూన్ చివరి నాటికి 100% టార్గెట్ పూర్తి చేయాలని కలెక్టర్ డ్వామా అధికారులను ఆదేశించారు. జిల్లాలో 4.15 మంది ఉపాధి కూలీలు విధులు నిర్వహించాల్సి ఉండగా.. 3.15 లక్షల మంది మాత్రమే ప్రస్తుతం కూలీలు హాజరవుతున్నారన్నారు. కూలీల సంఖ్యను.. పెంచే దిశగా ఏపీడీలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోవిడ్-19 దృష్ట్యా.. జిల్లాకు చెందిన వలస కూలీలు వందల సంఖ్యలో తిరిగి వెనక్కి వస్తుండటంతో.. వారిపై దృష్టి సారించి, వారికి ఉపాధి పనులు కల్పించాలన్నారు. అలాగే.. ఉద్యాన తోటలు పెంపకంపై డ్వామా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. జిల్లాకు ఇచ్చిన టార్గెట్ ను
అధికమిం చేందుకు కృషి చేయాలన్నారు.

* రాష్ట్ర ప్రభుత్వం జూన్ 9న లాంఛనంగా ప్రారంభించిన.. “సచివాలయాల్లోనే అన్ని సంక్షేమ పథకాల సర్వీసులు” పై సచివాలయ వెల్ఫేర్ సెక్రెటరీ లేదా వార్డు వెల్ఫేర్ డెవలప్మెంట్ సెక్రెటరీల ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరగాలని సూచించారు. పెన్షన్లు, రైస్ కార్డు లబ్ధిదారుల ఎంపికలో కీలక పాత్ర పోషించాలన్నారు. దరఖాస్తు చేసిన 10 రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉంటుందన్నారు. అందుకు సంబంధించి విధివిధానాలను అన్ని సచివాలయాలకు పంపడం జరిగిందన్నారు. ఆరోగ్యశ్రీ కార్డు లబ్ది కోసం 20 రోజుల సమయాన్ని ఇవ్వడం జరిగిందని, వాలంటీర్ల ద్వారా దరఖాస్తు, వెరిఫికేషన్ అనంతరం చివరగా జిల్లా కో-ఆర్డినేటర్ ఆమోదంతో కార్డు తయారవుతుందన్నారు. ఈ ప్రక్రియలన్నీ ఎంపిడివోలు, మున్సిపల్ కమిషనర్ల పర్యవేక్షణలో జరగాల్సి వుంటుందన్నారు. ఇంటి పట్టాల కోసం లబ్ధిదారుల ఎంపికను 30 నుండి 90 రోజుల్లోపు పూర్తి చేసే ప్రక్రియను రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో.. పక్కాగా చేపట్టాల్సి వుంటుందన్నారు.
ఎంపిడివోలు, మున్సిపల్ కమీషనర్లు ఆన్లైన్ లో లాగిన్ అయ్యి సంక్షేమ సర్వీసుల వివరాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలన్నారు. అన్ని సచివాలయాల్లో నోటీసు బోర్డులో అర్హుల, అనర్హుల జాబితాలను విధిగా పొందుపర్చడంతో పాటు “నవశకం” వివరాల పోస్టరులోనే.. సంక్షేమ క్యాలండరును కూడా డిస్ప్లే చేయాల్సి వుంటుందన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో వీసీ హాలు నుంచి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ తో పాటు జేసీలు ఎం.గౌతమి(ఆర్.బి., రెవెన్యూ) సీ. ఎం.సాయికాంత్ వర్మ (సచివాలయాలు, అభివృద్ధి), శివారెడ్డి (ఆసరా, సంక్షేమం) డిఆర్వో రాఘనాథ్ డీపీఓ ప్రభాకర్ రెడ్డి, డ్వామా పిడి యధుభూషన్ రెడ్డి, డిఆర్డీఏ పిడి మురళీమనోహర్, డిఎంహెచ్ఓ డా.ఉమా సుందరి, ఆరోగ్యశ్రీ డిసి డా.రవీంద్ర రెడ్డి, మైన్ శాఖ డిడి మోహన్ రావు, డిస్ట్రిక్ట్ సాండ్ ఆఫీసర్ రవి ప్రసాద్, స్టెప్ సీఈవో డా.రామచంద్రా రెడ్డి, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రెడ్డి, ఆయా మండల తహశీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, వైద్య అధికారులు, సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *