రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డిపరులకొరకు పాటు పడువాడు ధన్యుండు

పరముకొరకు పాటుపడును యోగి

యోగికంటె ధన్యు డుత్తమోత్తముడౌను

కాళికాంబ!హంస!కాళికాంబ

ధన్యడు సాటిమనుషులకోసం పాటుపడతాడు. యోగి పరంకోసం ప్రయత్నిస్తాడు. ఈ ఇద్దరిలో  పరంకోసం సాధన చేసే యోగికన్నా సాటిమనిషుల బాగుకోసం ప్రయత్నించే ధన్యుడే గొప్పవాడు.  బ్రహ్మంగారి పద్యాలలో ఇంకొక ముఖ్యమైన పద్యమిది. ఈపద్యంలో ధన్యుడు, యోగి అని ఇద్దరిని గుర్తించి వాళ్ళు చేసే పనులను చెప్పి, ఎవడు గొప్పవాడో చెప్పారు.  ధన్యుడు తనకోసం కాకుండా సాటిమనుషులకోసం పాటుపడతాడు. యోగి తన మోక్షం కోసం సాధన చేస్తుంటాడు. మొదటివానికి మానవ విముక్త లక్ష్యం. రెండవవానికి వ్యక్తిగత ముక్తి లక్ష్యం. మొదటివ్యక్తి మనిషి జీవించినప్పటి బతుకును గురించి ఆలోచిస్తే రెండవ వ్యక్తి మరణానంతర బతుకును గురించి ఆలోచిస్తాడు. యోగసాధన చేసిన బ్రహ్మంగారు యోగికన్నా సాటి మనుషులకోసం పాటుపడే వానినే గొప్పవాడని నిర్ణయించారు.  ముక్తి  అనేది ఉంటే వ్యక్తిగతంగా దానికోసం చేయవలసిన సాధన చేసుకోవడంలో తప్పులేదు. కానీ సాటిమనుషులు  సమాజానికి సకల సౌకర్యాలూ సమకూర్చిపెడుతూ బాధలు పడుతుంటే వాళ్ళను పట్టించుకోకుండా ఉండడం న్యాయంకాదన్నది ఆయన అభిప్రాయం. వ్యక్తిగత ముక్తికన్నా సామాజిక విముక్తి ముఖ్యమని ఆయన తీర్పు. యోగసాధన చేసేవాళ్ళకు అన్నీ సమకూర్చిపెట్టే సామాన్య మానవుల పక్షం వహించి మాట్లాడారు బ్రహ్మంగారు. ఆయన తనపరం కోసమే కృషి చేసుకొని ఉంటే ఇలా అనేవారు కాదు. ఆయన తనదైన మార్గంలో  అనేక సంకెళ్ళ మధ్య ఇరుక్కున్న, ఆధిపత్యాలలో నలిగిపోతున్న ప్రజలను భావప్రచారం ద్వారా జాగృతం చేయడానికి కూడా కృషి చేశారు గనకనే ఈపద్యం రాయగలిగారు. ఇహంకన్నా పరం ముఖ్యం అని ప్రచారం జరుగుతున్నకాలంలో పరవాదుల స్వార్థాన్ని పరిశీలించిన బ్రహ్మంగారు ఇహవాదానికే మొగ్గు చూపారు. వ్యక్తి ప్రయోజనం కన్నా సమష్టి ప్రయోజనానికే మద్దతు తెలిపారు. దీనిని ఆధునిక సమాజం గుర్తించాలి.