Tuesday, March 19, 2024

నక్కరోగం కుదిరింది

Ysrkadapa-Mada Anjaneyuluఅడవిలో ఒక నక్క ఉండేది. అది జంతువులకు వైద్యం చేస్తుండేది.

కానీ పక్షలు, చిన్న జీవుల్ని మాత్రం చులకనగా చూసి ఆటపట్టిస్తూ ఉండేది. ఒకసారి ఒక కాకి జ్వరంతో మందు కోసం నక్క దగ్గరకు వచ్చింది. ‘దీనికి మందెందుకు? చెరువులో మునక వేయి తగ్గిపోతుంది” అంది నక్క.

అది నిజమని కాకమ్మ చెరువులో మునిగితే పాపం చలికి వణికిపోయింది. జ్వరం మరింత పెరిగింది. అప్పుడు నక్క పకపకా నవ్వి నాలుగు రొట్టె ముక్కలిస్తే సరైన పసరు మందిస్తా అంది.

మరోసారి కుందేలు పంటి నొప్పని నక్క వద్దకు కొస్తే నాలుగు గులకరాళ్లు నమిలితే అదే తగ్గిపోతుంది అనిచెప్పింది. అది నిజమేననుకుని అలా చేసేసరికి మరింత బాధ పెరిగింది. ఇలా నక్క వల్ల ఇబ్బందులు పడిన జంతువులన్నీ ఒక చోట ఒకరి బాధ మరొకరితో చెప్పుకున్నాయి. తర్వాత అన్నీ కలిసి నక్కకు తగిన శాస్త్రి చేయాలనుకున్నాయి. ఆప్పుడు కోతి ఒక ఉపాయం ఆలోచించింది. ఏం చేయాలో జంతువులకి చెప్పి ముందుగా తను నక్క దగ్గరికి వెళ్లి ‘నక్కబావా ఒళ్లంతా ఒకటే దురదలు ఏదైనా మందిద్దూ..’అంది. నక్క ఎప్పటిలాగానే కొంటెగా ఆలోచించి ‘ఆ.. ఏముంది? వెళ్లి చెరువు పక్కన పెరిగిన తుమ్మ ముళ్ల మీద దొర్లు. చిటికెలో తగ్గిపోతాయి’ అంది. వెంటనే కొతి బయటకు పరుగెత్తి ఓ గంట తర్వాత మళ్లీ నక్క దగ్గరకు వచ్చింది. ‘ ఆహా.. నక్కబావా! వైద్యుడివంటే నువ్వేనయ్యా నువ్వు చెప్పినట్టు చేయగానే దురదలు ఇట్టే తగ్గి పోయాయనుకో’ అంటూ పెద్ద అరటి పళ్ల గెల బహుమతిగా ఇచ్చి వెళ్లి పోయింది. కోతి అలా వెళ్లిందో లేదో జింక వచ్చి తనకు ఒళ్లంతా దురదలని చెబుతూ తెగ బాధ నటించింది. నక్క మరో ఆలోచన లేకుండా కోతికి చెప్పిన వైద్యమే చెప్పింది. కాసేపటికి జింక తిరిగి వచ్చి నక్కను వేనోళ్ల పొడిగి బహుమతులు ఇచ్చింది. ఇలా నాలుగైదు జంతువులు వచ్చి దురదలంటూ చెప్పడం. నక్క అదే వైద్యం చెప్పి పంపాక కాసేపటికి తిరిగొచ్చి నక్కను పొగిడి బహుమతులు ఇవ్వడం చేశాయి. తన వైద్యం ఇంతబాగా ఫలిస్తున్నందుకు నక్క ఉబ్బితబ్బిబైపోయింది.


నక్క ఈఆనందంలో ఉండగానే పులి గాండ్రించుకుంటూ వచ్చి ‘ ఒళ్లంతా దురదలు.. వెంటనే మందేంటో చెప్పు…’ అంది. సంబరంలో ఉన్న నక్క అందరికీ చెప్పిన వైద్యమే పులికి కూడా చెప్పి పంపించింది. ‘ఆహా..పులిరాజుకి కూడా తగ్గిపోతే .. పెద్ద బహుమతి ఇవ్వడం ఖాయం’ అంటూ ఎదురు చూడ సాగింది. నక్క చెప్పినట్టే పులి చెరువు ఒడ్డుకు పరిగెత్తుకుని వెళ్లి తుమ్మ ముళ్ల మీద దొర్లేసరికి దారి ఒళ్లంతా గీరుకుపోయింది. వెంటనే అది నక్క గుహ దగ్గరికి వచ్చి కోపంగా గాండ్రుమని గర్జించింది. లోపల ఉన్న నక్క ఆనందంగా బయటకు వస్తూ ‘ఏం పులిరాజా? దురదలు తగ్గాయా? మరి నావైద్యం అంటే ఏంటనుకున్నావ్‌? అంది.

పులి ‘నీ దిక్కుమాలిన వైద్యం వల్ల ఒళ్లంతా గీరుకుపోయింది.  చూడు నిన్నేం చేస్తానం!’ అంటూ నక్క మీద పడి పంజాలతో ఎడాపెడా కొట్టేసింది. ఆదెబ్బకి నక్క ‘కుయ్యో.. మొర్రో అంటూ అడవి నుంచి పారిపోయింది.

ఇదంతా చూసిన జంతువులన్నీ నక్కకు తగిన శాస్త్రి చేసినందుకు కోతి అభినందించడానికి వచ్చాయి.

వాటిలో చిలుక ‘అవును కానీ కోతిబావా? మనందరం లేని దురదలు ఉన్నట్లుగా నటించి నక్కను వైద్యం అడిగాం. మరి పులికి దురదలేలా వచ్చాయి? అని అడిగింది. కోతి నవ్వి ‘ఏముందీ? పులి పడుకునే చోట దురదగుంటాకులు పడేశా. నేను ఊహించినట్లుగానే పులికి కూడా నక్క అదే వైద్యం చెప్పి దొరికి పోయింది’ అంది జంతువులన్నీ చప్పట్లు కొట్టాయి.(2015 ఫిబ్రవరి 25న ఈనాడు హాయ్‌బుజ్జిలో ప్రచురితమైంది.)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular