రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేదల పక్షపాతి అని, ఇది సంక్షేమ ప్రభుత్వం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా కంప్యూటర్ బటన్ నొక్కి “జగనన్న చేదోడు” పథకం ప్రారంభించి రజక, నాయీబ్రాహ్మణ, టైలర్ల ఖాతాల్లో ఒక్కరికి నేరుగా రూ.10 వేలు జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్ వీసీ హాలులో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఆసరా, సంక్షేమం శాఖల జేసీ శివారెడ్డి హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్సు అనంతరం వీసీ హాలులో ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన ద్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పని చేస్తున్నారని, పేదల పక్షపాతి అని కొనియాడారు. పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల కష్టాలను కళ్లారా చూశారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే 90% పైగా ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు. “నవరత్నాలు” పేరుతో అన్ని వర్గాల ప్రజలు సంతృప్త స్థాయిలో లబ్ధి పొందేలా సంక్షేమ పథకాలకు ఊపిరి పోశారన్నారు. దేశానికే ముఖ్యమంత్రి జగన్ ఆదర్శంగా నిలిచారని పేర్కొన్నారు. “వైఎస్ఆర్ చేదోడు” పథకంతో నాయీ బ్రాహ్మణులకు, లాండ్రీ షాపు ఉన్న రజకులకు, టైలరింగ్ షాపులున్న దర్జీలకు ఏడాదికి రూ.10 వేల ఆర్థిక సాయం అందించి వారి కుటుంబ పోషణకు చేదోడుగా నిలిచారన్నారు. జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మాట్లాడుతూ… అర్హత ఉన్న ప్రతి వ్యక్తికి కూడా “జగనన్న చేదోడు” పథకం ద్వారా లబ్ది చేకూరలన్నదే ముఖ్యమంత్రి ఉద్దేశ్యం అన్నారు. కరోనా లాక్ డౌన్ ఆర్థికంగా చితికి పోయిన చిన్నపాటి వ్యాపారాలు చేసుకునే బలహీన వర్గాల కుటుంబాలకు జగనన్న చేదోడు” పథకం ద్వారా రూ.10 వేల సాయం ఎంతో ఉపకరించిందన్నారు. “జగనన్న చేదోడు” పథకంతో షాపులు ఉన్న 15,053 మంది టైలర్లు, రజకులు, నాయి బ్రాహ్మణుల కుటుంబాలు లబ్ది పొందినట్లు తెలిపారు. వీరిలో 5,706 మంది టైలర్లకు రూ.5.70 కోట్లు, 7,372 మంది రజకులకు రూ.7.37 కోట్లు, 1,975 మంది నాయీ బ్రాహ్మణులకు రూ.1.97 కోట్లు సాయం అందిందన్నారు. అనంతరం “జగనన్న చేదోడు” ద్వారా 15054 మంది లబ్దిదారులకు మంజూరైన రూ.15.05 కోట్లు విలువైన వేర్వేరు మెగా చెక్కులను ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరికిరణ్ లు విడుదల చేశారు. కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఈడీ కరుణాకర్ రెడ్డితోపాటు ఇతర సంక్షేమ శాఖల అధికారులు, లబ్దిదారులు పాల్గొన్నారు.