జిల్లాలో వివిధ ప్రాంతాల్లోని క్వారీలలో ఇసుక పరిమాణం తగ్గిన 16 ఇసుక క్వారీలను వెంటనే మూసివేయాలని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.  ఉచిత ఇసుక విధానంపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టంగుటూరు, కోమంతరాజపురంలో కొత్త ఇసుక రీచ్‌లను ప్రారంభించేందుకు ప్రాథమికంగా అనుమతిస్తూ చర్యలు చేపట్టాలని మైనింగ్ ఏడీని ఆదేశించారు. పర్యావరణ కాలపరిమితి ముగిసిన 6 క్వారీలకు పర్యావరణ అనుమతుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై చెక్ పోస్టుల వద్ద గట్టి నిఘా ఏర్పాటు చేయాలని రవాణా, పోలీస్ శాఖల అధికారులను ఆదేశించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  కలెక్టరు అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో గనులు, భూగర్భ శాఖ ఏడి చంద్రమౌళి, రవాణా శాఖ డిటిసి బసిరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి, డిపిఓ, ఆర్ డబ్ల్యూయెస్ ఎస్ఇ, కడప డిఎఫ్ఓ, భూగర్భ జలశాఖ ఏడి తదితరులు పాల్గొన్నారు.