నియోజకవర్గానికి మూడు వేల చొప్పున గృహాలు మంజూరు కానున్నట్లు జిల్లా కలెక్టర్ హరికిరణ్‌ అన్నారు. అందుకు అనుగుణంగా లబ్ధిదారుల ఎంపిక నిర్వహించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో రెవెన్యూ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే నెల మూడో వారంలో ఎనిమిదవ భూపంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పంచాయతీల వారీగా భూములను గుర్తించి నవంబరు ఏడోతేదీలోగా నివేదిక సమర్పించాలని సూచించారు. సబ్ డివిజన్ చేసి నివేదికను సమర్పించాలన్నారు. కిందిస్థాయి సిబ్బందికి వదిలేయకుండా తహసీల్దార్లు క్షేత్ర పర్యటనలు వేసి వివరాలు సేకరించాలన్నారు. గ్రంథాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు, శ్మశానవాటికల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. జిల్లా హరిజనాభ్యుదయ సంస్థ ఆధ్వర్యంలో 3250 ఎకరాల భూమి ఉందని, వ్యక్తిగత పట్టాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ కోటేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి రఘునాథ్‌, కడప, రాజంపేట, జమ్మలమడుగు ఆర్డీవోలు రామచంద్రారెడ్డి, కోదండరామిరెడ్డి, నాగన్న, ఐసీడీఎస్‌ పీడీ పద్మజ, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.