Tuesday, March 19, 2024

అగ్నిపూలు

స్వేదం క‌న్నీటితో మిళిత‌మై సేద్యాన్ని పోషిస్తోంది
కాడి నాడిని కాలం నిశితంగా ప‌రీక్షిస్తోంది
నాగేలు దుక్కి సాల్లల్లో సొక్కుతూ సోలుతూ తూలిపోతోంది
చేల‌న్నీ నెర్రెల నోళ్లతో ఆక్రంద‌న‌లు చేస్తున్నాయి
అదును ప‌దును ఎప్పుతో విడాకులు తీసుకున్నాయి
కొత్తగా వ్యయం ప్రయాస‌తో జోడును కుదుర్చుకుంది
అయినా…
ప‌ట్టువ‌ద‌ల‌ని విక్రమార్కులు వ్యయ ప్రయాస‌ల‌కు ఎదురొడ్డి
పుట్లు పుట్లుగా పండిస్తూనే ఉన్నారు
పాల‌కుల క‌నీస మ‌ర్యాద కూడ క‌రువైన పుట్లుపుట్ల పంట‌
కాలం క‌ల‌సి వ‌చ్చేవ‌ర‌కు విరామ‌మే శ‌ర‌ణ్యంగా భావిస్తోంది
ఆది నుంచి దాన్నే న‌మ్ముకుని
క‌న్నబిడ్డలా చూసుకుంటూ…కంటికి రెప్పలా కాపాడుకుంటూ
స‌మ‌స్త ప్రాణ‌కోటికి ప్రాణ‌ధార స్వరూపులై
ఆరుగాలం త‌మ‌ను తామే శ‌పించుకుంటూ
ద‌హించుకుపోతున్న అన్నదాత‌ల‌పై
వీస‌మెత్తు క‌నిక‌రం కూడ చూప‌కుండా వారిని
అనాధ‌ను చేసి త‌న దారిని తాను వెతుక్కుంటోంది పంట కృతఘ్నరాలిగా
అయితే…
నారాయ‌ల‌సీమ నేల‌లో – నా రాతి గ‌రుకు చేల‌ల్లో
పంట ఎప్పుడూ విరామాన్ని కోరుకోలేదు కాని…
ప్రకృతే నాసీమ‌పై క‌క్షగ‌ట్టి దాన్ని నాసీమ పొలాల నుండి మాటు మాయం చేసింది
అప్పటి నుండే నాసీమ పొలాల‌తో మేఘాలు వైరాన్ని పెంచుకున్నాయి
క‌సిగా నాసీమ పొలాలు త‌డి చేయ‌టాన్ని అవి మానుకున్నాయి
త‌డారిన పొడారిన నాసీమ ఎడారి పొలాల‌కు
యిప్పుడు త‌డిగా నాస్వేద‌మే అనివార్యంగా మారింది
ఆశ్చర్యం!
నాసీమ పొలాల్లో యిప్పుడు నేను ఏవిత్తనం విత్తినా
అవి సింధూర‌పు మొక్క‌లుగానే మొలుస్తాయి
అవి ఎర్రని పుష్ఫాల‌నే పుష్పిస్తాయి కాని
అవి ఎప్పుడూ నిప్పు క‌ణాల‌ను వ‌ర్షిస్తూ
అవి అగ్నిపూలుగా జ్వలిస్తూ ఉంటాయి!

ప్రపంచీక‌ర‌ణ నేప‌థ్యంలో కుదేలైన వ్యవ‌సాయం అనివార్యమైన పంట విరామం, పంట విరామం కోరుకోకుండానే రాయ‌ల‌సీమ‌లో ప్రకృతే పంట పంట‌ల‌ను మాయం చేయ‌డం, సీమ చేల‌ను మేఘాలు త‌డి చేయ‌కుండానే బీళ్లుగా మార్చడం, ప‌రిణామ‌క్రమంలో సీమ రైతుల స్వేదం నుంచి విప్లవ బీజాలు మొల‌కెత్తి అగ్నిపూలుగా జ్వలిస్తూ నిప్పుక‌ణాల‌ను వ‌ర్షిస్తూ అన్యాయం, అస‌మాన‌త‌ల‌పై తిరుగుబాటు చేయ‌డం, ఇతివృత్తంగా సాగిన క‌విత ఇది. ఒంగోలులో ప్రపంచ తెలుగు మ‌హోత్సవాల వేదిక‌పై నిర్వహించిన క‌వి స‌మ్మేళ‌నంలో 2012 జ‌న‌వ‌రి 6వ‌తేదీన లెక్కల వెంక‌ట‌రెడ్డి అగ్నిపూలు శీర్షిక‌తో క‌విత‌ను ఆల‌పించారు. రాయ‌ల‌సీమ నుంచి పాల్గొన్న క‌వుల‌లో వెంక‌ట‌రెడ్డి ఒక‌రు కాగా వేదిక‌పై ఆల‌పించిన క‌విత‌కు ప్రముఖుల నుంచి ప్రశంస‌లు పొందారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular