మనుషులున్న సమాజ నిర్మాణం

వార్తలు
40 Views

రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డిస్వాములనగ ఐహికాముష్మికఫలాల
వాంఛచేయనట్టివారు ధరణి
లోకవాంఛలకును లోబడ గురుడౌనె
కాళికాంబ!హంస!కాళికాంబ.
మనదేశంలో ప్రాచీనకాలం నుంచి స్వాములుగా చెలామణి అయ్యేవాళ్ళకు చాలా గౌరవముంది. వాళ్ళు చాలా శక్తులు సిద్ధులు గలవాళ్ళని జనం వాళ్ళకు ఒదిగి ఉండాలని వాళ్ళను ఎదిరిస్తే కష్టాలు వస్తాయని జనం భావిస్తారు. ప్రచారం కూడా అలాగే జరుగుతుంది. వాళ్ళను గురువులుగా జనం పూజిస్తారు. వాళ్ళకు విధేయత ప్రకటిస్తారు. అయితే వాళ్ళలో చాలామంది అంత విధేయతకు గౌరవానికి అర్హులుగా కనిపించరు. అందుకు కారణం వాళ్ళే. వాళ్ళు వేషంలో మాత్రమే స్వాములుగా ఉంటారు. కానీ వాళ్ళ అభిరుచులు అలవాట్లు మామూలు మనుషులకన్నా భిన్నంగా ఉండవు. ఇవాళకూడా మనం చూస్తున్నాం. అత్యంత వైభవోపేతమైన ఖరీదైన విలాసవంతమైన జీవితం గడుపుతున్న స్వాములను. వేషాన్ని మినహాయిస్తే వాళ్ళు కోటీశ్వరులులాగే బతుకుతుంటారు. బ్రహ్మంగారి దృష్టిలో వాళ్ళు స్వాములు కానేకారు. స్వాములంటే సర్వసంగపరిత్యాగం చేసిన వాళ్ళే స్వాములు. స్వాములంటే సమాజానికి గురువులు. స్వాములంటే ఐహికాముష్మిక వాంఛలులేని వారే. ఇహలోక సౌఖ్యాలపట్ల గానీ పరలోక సుఖాలపట్లగానీ ఆసక్తి లేనివారే స్వాములు గురువులు. గురువు కావడం అంత సులభం కాదని బ్రహ్మంగారు చురక వేశారు. క్షుద్రక్రీడలు ప్రద‌ర్శించేవాళ్ళు కోట్లాది రూపాయల విలువచేసే సంపదను పోగుచేసుకొని అత్యంత ఆధునిక సౌకర్యాల మధ్య ఓలలాడుతూ కొన్నిసందర్భాల్లో అసాంఘిక కార్యకలాపాలకు సైతం పాల్పడుతున్న నేటి స్వాములను చూస్తే బ్రహ్మంగారు విస్తుపోతారు. నిజమైన గురుడు ఐహికసుఖాలనే కాదు ఆముష్మిక సుఖాలను కూడా కోరరాదు అంటే మన స్వాములు భౌతిక సుఖాల దగ్గరే చతికిలపడుతున్నారు. ఇక వీళ్ళకు ఆముష్మిక వాంఛలెక్కడ ఉంటాయి. బ్రహ్మంగారి వాంఛారహిత శీలం నుండి మన సమాజం ఎన్ని యోజనాల దూరం జరిగి పోయిందో చెప్పలేము. అందుకే ఇవాళ మనం ఆధ్యాత్మికత ముసుగులో ఘోరాలు జరగని సమాజాన్ని నిర్మించుకోవలసి ఉంది. నిజమైన మనుషులున్న సమాజాన్ని నిర్మించుకోవలసి ఉంది.Leave a Reply

Your email address will not be published. Required fields are marked *