జిల్లాలో 772 యూనిట్లకు రూ.48.97 కోట్లప్రోత్సాహకాలు

వార్తలు
48 Views




స్థానికంగా ఉన్నచోటే ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయంటే... ఎంఎస్ఎంఈ సెక్టార్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ ప్రోత్సాహమేనని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా అన్నారు. శుక్రవారం రాష్ట్రంలోని దాదాపు ఒక్క లక్ష సూక్ష్మ, చిన్న  తరహా ఎంఎస్ఎంఈ లకు రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ.1,110 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్సు ద్వారా బటన్ నొక్కి ప్రారంభించారు.  స్థానిక వీసీ హాలు నుంచి ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్  హాజరయ్యారు.  వీసీ అనంతరం జిల్లా కలెక్టర్ హరికిరణ్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు చెందిన 772 యూనిట్లకు మొదటి దశలో మంజూరైన రూ. 48.97 కోట్లను  విడుదల చేయడం జరిగిందన్నారు. రెండవ దశలో జూన్ 29వ తేదీన మిగతా లబ్ది మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారన్నారు. ప్రత్యేకించి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచి, అటు పారిశ్రామిక, ఇటు సర్వీసు రంగాల్లో ప్రభుత్వం ఉపాధి అవకాశాలను అపారంగా అందిస్తుందన్నారు. ఇప్పటికే పలు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ద్వారా వేలాది మంది లబ్ధి పొందుతూ పలువురికి ఉపాధిని కూడా కల్పిస్తున్నారన్నారు.  ప్రభుత్వం కల్పించే పలురకాల రాయితీలను, సబ్సిడీలను, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సద్వినియోగించుకొని సొంతంగా ఉపాధి యూనిట్లను నెలకొల్పడమే కాకుండా.. పది మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. అనంతరం విసి కి  హాజరయిన పారిశ్రామిక వేత్తలను వారివారి యూనిట్ల నిర్వహణ తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో పరిశ్రమల నిర్వహణకు సంబంధించి ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం జిల్లా ఎంఎస్ఎమ్ఈ లకు మంజూరయిన రూ.48.97 కోట్ల మెగా చెక్కును రాష్ట్ర ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ హరికిరణ్, లబ్దిదారులకు అందించారు.  ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్-2 శివారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, పారిశ్రామికవేత్త ఎస్.వి. రామమూర్తి, నూతన, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *