జన్మించినపుడు అందరూ శూద్రులే

రాచపాలెం
37 Views

Shiva is the source of creationజన్మకాలమందు సర్వులు శూద్రులు
మంత్రతంత్రములను మారె కులము
శుద్ధిమంతుడాయె శూద్రుండు గురుదీక్ష
కాళికాంబ!హంస!కాళికాంబ

పుట్టినప్పుడు అందరూ శూద్రులే. తర్వాత మంత్రతంత్రాల వల్ల కులం మారింది. శూద్రుడు గురుదీక్ష తీసుకొని శుద్ధిమంతుడయ్యాడు. బ్రహ్మంగారు భారతీయ సమాజాన్ని సహస్రబ్దాలుగా శాసిస్తున్న కులవ్యవస్థ మూలాలను అన్వేషించారు. ఆధిపత్యవర్గాలు కులవ్యవస్థను శాశ్వతం చేసి అధికసంఖ్యలో జనాన్ని తమ గుప్పిట్లో పెట్టుకోడానికి దానికి దైవకర్తృత్వాన్ని ఆపాదించి ప్రశ్నించకుండా జాగ్రత్తపడ్డాయి. దేవుడే వర్ణ, కుల సృష్టికర్త అయితే ఎదిరించడం దైవ వ్యతిరేకతగా ప్రచారం చేశాయి. జనంలో భయాన్ని కల్పించాయి. అయితే భారతీయ భౌతికవాదులు ప్రాచీనకాలం నుంచి దీనిని వ్యతిరేకిస్తూ వచ్చారు. కానీ వాళ్ళనోర్లు నొక్కివేయబడ్డాయి. అలా వర్ణ కుల వ్యవస్థ దైవనిర్మితం అనేవాదాన్ని వ్యతరేకించిన వారిలో బ్రహ్మంగారు ఒకరు. కులం పుట్టుకతో రాదని శూద్రత్వం విద్య ద్వారా పోయి బ్రాహ్మణత్వం సిద్ధిస్తుందని ఆయన సిద్ధాంతం చేశారు. గురుదీక్ష అంటే గురువు శిష్యునికి విద్యాబుద్ధులు నేర్పించి కర్తవ్యబోధ చేయడమే. శుద్ధిమంతుడు అంటే మడికట్టుకున్నవాడు అనికాదు. గురువు చెప్పిన పద్ధతిలో సంఘ పునర్నిర్మాణంలో పాల్గొనడమే. ఇది ఆధిపత్యవర్గాల ధర్మశాస్త్రాల సిద్ధాంతాలకు ప్రత్యామ్నాయం. ఈ అభిప్రాయాన్నే బ్రహ్మంగారు మరో పద్యంలో ఇంకా స్పష్టంగా చెప్పారు.

ఇలకు దిగెడువేళ కుల మెవ్వరికి లేదు
మొదలు శూద్రుడుగను పుట్టువందు
శ్రుతులు చదువు వెనుక శూద్రుండె విప్రుడౌ
కాళికాంబ!హంస!కాళికాంబ

తల్లిగర్భం నుండి నేల మీద పడినప్పుడు ఎవరికీ కులం లేదు. మనిషి మొదట శూద్రుడుగానే పుడతాడు. వేదాలు చదువుకొని ఆ శూద్రుడే విప్రుడు అవుతాడు. ఈపద్యం తరతరాలుగా జనంలో జీర్ణించుకొని ఉన్న శాశ్వత కుల సిద్ధాంతాన్ని పూర్వపక్షం చేస్తున్నది. శాశ్వత కుల వ్యవస్థ సిద్ధాంతం 85%శ్రామిక ప్రజల్ని ఆత్మన్యూనతలో ముంచి వేసింది. అంతేకాదు ఆఅందరి శ్రమ దోపిడి కావడానికి ఆధారమైంది. శాశ్వత కుల సిద్ధాంతం ఒక కుట్ర. దానిని బ్రహ్మంగారు ఛేదించారు. ఇప్పుడు కులవివక్ష వ్యతిరేక ఉద్యమకారులు, కుల నిర్మూల నోద్యమకారులు వేమనతో పాటు బ్రహ్మంగారిని కూడా చదువుకుంటే వాళ్ళ ఉద్యమానికి బలం చేకూరుతుంది.
Leave a Reply

Your email address will not be published. Required fields are marked *