దుష్టులు గురువులా?

వార్తలు
1,269 Views

చీకుమబ్బులోన జీరాడు జీవికి
చొక్కమైనదారి చూపువాడె
గురుడుగాని గుండగొయ్యలు గురువులా
కాళికాంబ!హంస!కాళికాంబ

కటికచీకట్లో దిక్కుతెలియక తిరుగుతున్న మనిషికి సరైనదారి చూపించేవాడు గురువు గానీ దుష్టులు గురువులా? బ్రహ్మంగారి కవిత్వం గురు సంప్రదాయానికి చెందినది. ఆయన కవిత్వంలో గురువుకు ఎనలేని స్థానముంది. గురువులలోకూడా మంచి గురువులను చెడ్డగురువులను గుర్తించారాయన. ఎలాంటి వ్యక్తి నిజమైన గురువో ఈ పద్యంలో చెప్పారు.  దారితెలియక తిరిగే వ్యక్తికి చొక్కమైన దారి చూపించేవాడే గురుశబ్దానికి తగినవాడు. గుండగొయ్య అంటే దుర్మార్గులు గురువులుకాదు అని ఆయన తీర్పు. గుండగొయ్య అంటే అంధకారంలో అలమటిస్తున్నవారు తనను ఆశ్రయిస్తే వాళ్ళను మరింత అంధకారంలోకి నెట్టేసేవాడు.  తనను ఆశ్రయించినవాళ్ళకు తాను ఉపయోగపడకపోగా వాళ్ళనే తన స్వార్థానికి ఉపయోగించుకునేవాడు. చొక్కమైన దారి చూపించకపోగా  వాళ్ళను దారితప్పించి పనికిరానివాళ్ళుగా చేసేవాడు.  బ్రహ్మంగారి పద్యం చదువుతుంటే గురజాడ కన్యాశుల్కం నాటకంలోని గిరీశం, కరటకశాస్త్రి గుర్తుకు వస్తారు. గిరీశం వెంకటేశానికి ఇంగ్లీషుగురువు ఆధునిక గురువు. కరటకశాస్త్రి మహేశంకు సంస్కృతం గురువు. ఇద్దరూ తమశిష్యులకు పాఠం చెప్పరు.గిరీశం శిష్యునికి చుట్టలుకాల్చడం నేర్పాడు తప్ప చదువు చెప్పిన పాపాన పోలేదు. కరటకశాస్త్రి మహేశంకు చదువు చెప్పకుండా నాటకాలలో వేషం వేయిస్తూ ఉంటాడు. అంతేకాదు. ఈగురువులిద్దరూ శిష్యులను తమస్వార్థానికి ఉపయోగించుకుంటారు. గిరీశం విజయనగరంలో సమస్యలనుంచి తప్పించుకోడానికి వెంకటేశంతో వాళ్ళ గ్రామం కృష్ణరాయపురం అగ్రహారంకు ఉడాయిస్తాడు. కరటకశాస్త్రి తనమేనకోడలు పెళ్ళి తప్పించడానికి మహేశంకు ఆడవేషం వేసి ఉపయోగించుకుంటాడు. వీళ్ళు గుండగొయ్యలు అంటే. బ్రహ్మంగారు ఎలాంటివాళ్ళను చూశారోగానీ ఆరనకు రెండున్నర శతాబ్దాల తర్వాత అలాంటి గురువులను మనముందు ప్రదర్శించారు. గురువులకు ఆదర్శనీయమైన అనుసరణీయమైన వ్యక్తిత్వం ఉండాలి.  విద్యాగురువైనా తాత్త్వికగురువైనా ఇది అర్హత.  విద్యేతర, తాత్త్వికేతర మార్గాలలో తమను ఆశ్రయించిన వాళ్ళను చెడగొట్టేవాళ్ళు  తాజెడ్డకోతి వనమెల్లా చెరిచె అన్నట్లు సమాజవృక్షానికి చీడపురుగులు. వాటిని ఏరిపారేయడం సమాజం కర్తవ్యం. బ్రహ్మంగారు సద్గురువును చాలా గౌరవించారు.  చూడండి మంచిగురువుకు ఎంత ఉన్నతస్థానమిచ్చారో.

చరణములను వ్రాలి శరణన్న వారికై
సుకృతఫలములెల్ల చూరలిచ్చు
గురుని మించువారు ధరలోన లేరయా
కాళికాంబ!హంస!కాళికాంబ
నేటిగురువులు కూడా తమను మించినవాళ్ళు ఈభూమిమీద లేరు అని సమాజంచేత అనిపించుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *