ysrkadapa

వార్తలు

యోగికి గుణం ముఖ్యం

స్నానమందు లేదు పానమందును లేదు
మంత్రతంత్రములను మహిమలేదు
గుణము కుదిరెనేని ఘనయోగి తానౌను
కాళికాంబ!హంస!కాళికాంబ.

యోగి కావాలంటే దానికి సంబంధించిన గుణం కుదరాలి. అంతేగానీ స్నానపానాలలో, మంత్రతంత్రాలలో ఏమహిమలూ లేవు అంటున్నారు బ్రహ్మంగారు. యోగికి బాహ్య విషయాలు ముఖ్యంకాదు. గుణం ముఖ్యం. యోగి గుణం అంటే ఆడంబరాలతో సంబంధంలేని చింతన, నిరాడంబరమైన ఆచరణ, మనుషులపైన నిష్కల్మషమైన ప్రేమ, సమాజ పరివర్తనా దృష్టి , స్వార్థరాహిత్యం వంటి లక్షణాల సమూహం. వీటిని వదిలేసి మంత్రాలు తంత్రాలు విచిత్రవేషాలు వంటివాటితో గారడీలు ప్రదర్శించేవాళ్ళ మీద బ్రహ్మంగారు విమర్శపెట్టారు. మతంపేరున ఆధ్యాత్మికత మాటున ఆధిపత్యం చెలాయిస్తున్న శక్తలమీద ఆయన తిరుగుబాటు చేశారు. ఆధ్యాత్మికత సాధన తప్ప వ్యాపారం కాదు బతుకుతెరువు కారాదని ఆయన అభిప్రాయం. ఆయన తిరుగుబాటు వేలయేళ్ళుగా రాజ్యమేలుతున్న మతరాజ్యంమీదనే. అది నిశ్శబ్దమైన తిరుగుబాటే. వంచన, మోసం, పెత్తనం వంటిదుర్మార్గాల మీద ఆయన నిరంతరపోరాటం చేశారు. అయితే ఇప్పటికీ ఈ వేషాడంబరాలకు మంత్రతంత్రాలకు రాజభోగం తగ్గలేదు. పైగా రాజ్యాన్ని శాసించే దశకు చేరకున్నారు వారు. అందుకే బ్రహ్మంగారు ఈనాటి అవసరం. బ్రహ్మంగారిని చదివితే పోయేదేమీలేదు బూటక ఆధ్యాత్మికశక్తుల నుంచి విముక్తి పొందడం తప్ప. విశ్రాంతివర్గాల ఆగడాలకు అడ్డుకట్ట వేయడం తప్ప. అంతేకాదు అపారమైన సంపద ,వనరులు వాళ్ళపరం కాకుండా కాపాడవచ్చు. చదవండి బ్రహ్మంగారిని.

Leave a Comment