తనువు లస్థిరమని ధనము తాగాదని
ధర్మశీలుడగచు తగినపాటి
దానమిచ్చువాడె ధన్యాత్ముడిలలోన
కాళికాంబ!హంస!కాళికాంబ.
శరీరాలు శాశ్వతమైనవి కాదు, డబ్బుకూడా శాశ్వతం కాదు. అందువల్ల ధర్మాన్ని తెలుసుకున్నవ్యక్తి తనకు వీలైనంతవరకు దానం చెయ్యాలి. అలా చేసిన వ్యక్తే ధన్యుడౌతాడు. ఇది బ్రహ్మంగారు తనకాలంనాటి ఆర్థికవ్యత్యాసాలను, పేదరికాన్ని చూసి చెప్పిన పద్యం. కంటిముందు పేదరికం కనిపిస్తుంటే కర్మసిద్ధాంతాన్ని నమ్మమని ఆరన బోధించలేదు. ధనవంతులకు శక్తికొలది దానం చెయ్యమని పిలుపు నిచ్చాడు. సంపద కొంతమంది చేతుల్లో పోగు పడటాన్ని వేమన, బ్రహ్మంగార్లు ఆమోదించలేదు. అప్పటికి వాళ్ళకు తోచిన మార్గం దానగుణాన్ని ప్రచారం చేయడమే. ఒకవైపు వైరాగ్యాన్ని బోధిస్తూనే మరోవైపు కుప్పపడి ఉన్న సంపదలో దానం రూపంలో కదలిక తీసుకొని రావడానికి ప్రయత్నించారు. దానికోసం దానం చేస్తే జన్మ ధన్యం అవుతుందని ప్రచారం చేశారు. అప్పటికి దానాలతో పన్నులు ఎగవేసే వ్యవస్థ లేదనుకుంటాను. దానాన్ని ఒక ధార్మిక కార్యక్రమంగా ప్రచారం చేశారు. దీనిని మితవాదమనో ఇంకొకటనో ఈనాడు మనం అనవచ్చు. కానీ బ్రహ్మంగారి కాలంలో నిలబడి ఆలోచిస్తే అప్పటికి అదొక కదలిక. ఈపద్యం బ్రహ్మంగారు సంపన్నులనుద్దేశించి రాశారు. ఈదానం అనేది ఆర్థిక వ్యత్యాసాలను సమూలంగా నిర్మూలించేదేమీ కాదు. మూడుపూటలూ మాడిచచ్చేవాళ్ళకు ఒకపూటైనా తిండి దొరుకుతుంది. సమూలమైన మార్పు వచ్చేదాకా దానం ఒక ఉపశమన చర్య. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు లేని వ్యవస్థ నిర్మాణం అయ్యేదాకా దానం ఒక దారిబత్తెం. ఈ దానగుణాన్ని గురించే బ్రహ్మంగారు మరో పద్యం కూడా చెప్పారు.
బావిలోని జలలు పైకి చిమ్మెడురీతి
హెచ్చుగాను దానమీయవలెను
ఇచ్చి నొచ్చుకున్న హేయంబు నరకంబు
కాళికాంబ!హంస!కాళికాంబ
బావిలో నీళ్ళ ఊటలోంచి చేదుకున్నకొలదీ నీళ్ళు వస్తుంటాయి. అలాగే ధనవంతులు తమ ధనరాశుల నుంచి ఎక్కువగా దానం చెయ్యండి. చెడిపోరు అని చెప్పారు బ్రహ్మంగారు. ఇక్కడే ఆయన ఇంకొక విషయం కూడా చెప్పారు. ఇచ్చి నొచ్చుకోవద్దని చెప్పారు. దానం చేసేసి అయ్యో నా ధనరాశి ఎత్తు తగ్గిపోయిందేనని బాధపడవద్దు అన్నారు. కొంతమంది దాతలు దనం చేసి దానం తీసుకున్నవాళ్ళ నుంచి బానిసత్వాన్ని ఆశిస్తారు. దానం తీసుకున్నవాడు కొంచం స్వతంత్రిస్తే దానం చేసి పొరపాటు చేశాననుకుంటారు. ఇదంతా హేయం అంటారు బ్రహ్మంగారు. అంతేకాదు అది నరకంతో సమానమని కూడా చెప్పారు. సంఘాన్ని వదిలి పరాన్నిగురించి మాత్రమే ఆలోచించే జాతికి చెందిన తాత్త్వికుడు కాదు బ్రహ్మంగారు.