బొమ్ము రామారెడ్డి. స్వాతంత్ర్య సమరయోధుడు. బ్రహ్మంగారిమఠం మండలం ఓబులరాజుపల్లె గ్రామానికి చెందిన రామారెడ్డి మహాత్మాగాంధి సిద్ధాంతాలను పాటించి ఆదర్శంగా నిలిచిన జిల్లాలోని రాజకీయ నాయకులలో ఒకరు. ఖద్దరు దుస్తులు ధరించారు. వంట తయారీ నుంచి వడ్డించేదాకా దళితులను ఏర్పాటు చేసుకుని హరిజనోద్ధరణకు పాటుపడ్డారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనే సందర్భంలో జన్మించిన కుమార్తెకు కస్తూరిబా, స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొనే సందర్భంలో జన్మించిన కుమారుడికి గాంధి మోహన్‌రెడ్డి పేర్లు పెట్టి దేశభక్తిని చాటుకున్నారు. కడప గడప నుంచి మహాత్మాగాంధి ఇచ్చిన పిలుపుతో స్వాతంత్ర్య రణరంగంలోకి దూకారు. వందేమాతరం అంటూ గాంధిజీ ఆశయాలకు అనుగుణంగా నడచి పోరాటం చేశారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన రామారెడ్డి 1939లో బళ్లారిలో 9నెలల జైలు జీవితం గడిపారు. జైలు శిక్ష ముగియగానే ప్రొద్దుటూరు చేరుకుని ప్రజల్లో చైతన్యం నింపేందుకు తెలుగుసీమ పేరుతో పత్రికను నడిపారు. మద్యపాన నిషేధానికి కట్టుబడి ఉన్నారు.
రాజకీయాలు
1924 నుంచి 1938 వరకు కడప ఎస్పీ కార్యాలయంలో క్లర్క్ గా విధులు నిర్వహించిన రామారెడ్డి 1964-69 మధ్య కాలంలో బద్వేలు సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. మైదుకూరు నియోజకవర్గం 1955 ఏర్పాటు కాగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. సమీప స్వతంత్ర అభ్యర్థి వడ్డమాను చిదానందంపై 11804 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు. బీమఠం మండలంలోని చౌదరివారిపల్లె వద్ద మడేరు ప్రాజెక్టు కోసం కృషి చేశారు.
జీవిత విశేషాలు | |
జననం | 1914 |
మరణం | 1985 జనవరి 1 |
తల్లిదండ్రులు | సుబ్బమ్మ, పెద్ద వీరారెడ్డి |
స్వగ్రామంలో ప్రాధమిక విద్యను, బద్వేలు చియ్యపాడులో ఉన్నత విద్యను, ప్రొద్దుటూరులో ఎస్ఎస్ఎల్సీ, మద్రాసు లయోలా కళాశాలలో పైచదువులు చదువుకున్నారు. నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డిలు సహచర విద్యార్థులుగా ఉన్నారు. |