సంక్షేమం పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై రోజుకోభారం మోపుతున్నారని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ అన్నారు. సోమవారం సీపీఎం రాష్ట్ర కమిటి పిలుపుతో ఇంటింటికి సీపీఎం కార్యక్రమంలో వచ్చిన ప్రజా సమస్యలపై కడప కలెక్టరేట్ ఎదుట మహా ధర్నానిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ అధ్యక్షత నిర్వహించిన ధర్నాలో కేంద్ర కమిటి సభ్యుడు గపూర్ మాట్లాడుతూ గ్యాస్, నిత్యావసర వస్తువులు, కరెంటు ఛార్జీలు, ఆస్థి పన్ను, నీటి పన్ను, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి సామాన్య పేద, మధ్య తరగతి ప్రజానీకాన్ని నడ్డివిరిస్తున్నాయని పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు ఇస్తూనే మరోపక్క అధిక ధరలతో ప్రజలపై బాదుడు కార్యక్రమాన్ని మొదలుపెట్టారని ఆరోపించారు. సంక్షేమ పథకాలలో కోత కోస్తున్నారని, వితంతు వృద్ధాప్య పెన్షన్లు ,రేషన్ కార్డుల్లో చిన్నచిన్న కారణాలు చూపి రద్దు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు అడియాశలే ఎదురయ్యాయన్నారు. జిల్లాలో ఉక్కు కర్మాగారం పనులు పునాదిరాళ్లకే పరిమితం అయ్యాయన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి. నారాయణ మాట్లాడుతూ జిల్లాలో అధికార పార్టీ అండదండలతో భూకబ్జాదారులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తున్నా అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందని విమర్శించారు. కడప రామకృష్ణ నగర్ లో నిరుపేదులు ఇళ్లు వేసుకున్నా ఇంతవరకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదన్నారు. వర్షాలు వస్తే పేదల నివసిస్తున్న కాలనీలు చెరువులను తలపిస్తున్నాయన్నారు. మహాధర్నా మహాధర్నాలో పార్టీ నాయకులు ఎ. రామ్మోహన్, మనోహర్, శివకుమార్, సుబ్బమ్మ, దస్తగిరి రెడ్డి, పాపిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అన్వేష్ సత్యనారాయణ, లక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.