Tuesday, March 19, 2024

కుల నిర్మూలనోద్యమానికి బ్రహ్మంగారు ములుగర్ర

కులము గోత్రమంచు కూసెడి మలపల
కర్మఫలము ముందు కట్టికుడుపు
బ్రహ్మమందగలరు వర్ణాదలను వీడ
కాళికాంబ!హంస !కాళికాంబ
కులం గోత్రం అని కూసే మలపలు అంటే వదరబోతులను వాళ్ళు చేసే అసాంఘికవాదం భవిష్యత్తులో  కట్టికుడుపుతుంది. వర్ణపిచ్చిని వదలిపెట్టితే వాళ్ళు బ్రహ్మను అందుకోగలరు. బ్రహ్మంగారు భారతీయులను విడదీసి ఇంకా చెప్పాలంటే చీల్చి దేశాన్ని బలహీనపరచిన విచ్ఛిన్నకర శక్తులమీద తన కవిత్వంలో విమర్శ పెట్టారు. కులవ్యవస్థ వల్ల మనదేశం   నష్టపోయిందేమిటో ఆయన గుర్తించారు. మొదట్లో శ్రమవిభజన రూపంలో మొదలై క్రమంగా అది వర్ణ, కులరూపం తీసుకొని శ్రామిక విభజనగా మారిపోయింది.  ఒకచిన్న సమూహం ఆధిపత్యవర్గంగా రూపొంది మరో పెద్ద సమూహాన్ని అజ్ఞానంలో ముంచి దేశాన్ని శాశ్వతంగా కులదేశంగా మార్చేసింది. ఈనిచ్చెనమెట్ల వ్యవస్థను ప్రశ్నించకుండా ఉంచడానికి దైవ జన్మ కర్మ సిద్ధాంతాలను సృష్టించి . కర్మసిద్ధాంతం శ్రమదోపిడి సిద్ధాంతం. అది భారతీయ మానవ  చైతన్యాన్ని నిర్వీర్యం చేసేసింది.  కులవ్యవస్థ కొందరికి అహంకారాన్ని కలిగించింది. అనేకులలో ఆత్మన్యూనతను కలిగించింది. ఒకడు నాకులం గొప్పది , నాగోత్రం గొప్పది. నేను అదృష్టవంతుడిని , పెట్టిపుట్టాను అని విర్రవీగుతుంటే తొమ్మిదిమంది శ్రమకు అవమానానికీ పరిమితమై తాము చేసిన పాపమేమిటో తెలియ  కొట్టుమిట్టాడవలసివచ్చింది. బ్రహ్మంగారు ఏమంటారంటే కులగోత్రాలమదంతో విర్రవీగే వాగుడుగాళ్ళు భవిష్యత్తులో మార్పు వచ్చి , ఇన్నాళ్ళూ ఆత్మన్యూనతలో మ్రగ్గిన జనం చైతన్యవంతమై నిలదీసిన రోజున సమాధానం చెప్పుకోవలసి వస్తుంది అని గుర్తుచేశారు. కట్టి కుడపడమంటే పీడితజాతి వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేక తలవంచుకోవడమే. ఇవాళ జరుగుతున్నది ఇదే.  ఎన్ని పార్శ్వాల నుండి ఈ సాంఘిక ఆర్థిక నిరంకుశత్వ రూపమైన కులవ్యవస్థ మీద ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సమాధానం అయితే దౌర్జన్యం కాకుంటే మౌనం.  అబ్బ చేసిన చేష్టలకు కొడుకు బందారాకు మోసినాడన్నట్లు , బిడ్డ చచ్చినా పురిటివాసన పోలేదన్నట్లు కులవ్యవస్థ కదలబారినా దాని ప్రభావం నుండి ఆధునిక సమాజం కూడా కళవళపడుతున్నది. కులవ్యవస్థ నిర్మాత లు ఇప్పుడున్న వాళ్ళుకారు. కానీ అది ఈనాటి ప్రజల మధ్య కూడా చిచ్చు పెట్టుతున్నది. రెండుదేశాల మధ్య ఉండే శతృత్వంకన్నా రెండకులాల మధ్య ఉండే శతృత్వం తక్కువది కాదన్నారు డా. బి. ఆర్ . అంబేడ్కర్ గారు. ఇదే కట్టికుడపడమంటే.  అందువల్ల ఎవరైనా తుది సత్యమైన బ్రహ్మంను లేదా బ్రహ్మంగారిని చేరాలంటే వర్ణాది దురహంకార చిహ్నాలను వదులుకోవాలి అని ఆయన సూచించారు. వర్ణం బ్రహ్మ సృష్టి అని సంప్రదాయ గ్రంథాలు ప్రచారం చేశాయి. తప్పు అంటూ అసలు బ్రహ్మను అందుకోవాలంటేనే  ఆయన సృష్టిగా ప్రచారం జరిగే వర్ణాన్ని వదిలిపెట్టాలనడం తప్పుడు సిద్ధాంతాన్ని సరిదిద్దడమే. బ్రహ్మంగారిని సమీపించాలన్నా కులగోత్రాలను చిలక్కొయ్యకు తగిలించి రావాలన్న ధ్వని కూడా ఇందులోఉంది. ఇదివరకే అనుకున్నట్లుగా జరుగుతున్నదానిలోంచి జరగబోయే పరిణామాలను గుర్తించే భవిష్యజ్ఞాని వీరబ్రహ్మంగారు. సమాజంలో సంభవించే మార్పులను ముందే గ్రహించగల మేధస్సే కాలజ్ఞానం. కులవ్యవస్థ ఎదుర్కోబోయే సంక్షోభాన్ని ఆయన గ్రహించారు. అహంకారులను హెచ్చరించారు. కుల నిర్మూలనోద్యమానికి బ్రహ్మంగారు ములుగర్రగా ఉపయోగపడతారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular