Tuesday, June 6, 2023

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్

చార్లెస్ ఫిలిప్ బ్రౌన్
అట‌ల‌క‌పై చెద‌లుప‌డుతున్న తాళ‌ప‌త్ర గ్రంధాల‌ను వెలుగులోకి తెచ్చేందుకు జీవితాన్నే ధారపోసిన హ‌నీయుడు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఆంగ్లేయుడుగా ఉండి తెలుగు సాహిత్యమునకు విశేష కృషి చేసిన భాషోద్ధార‌కుడు మ‌న బ్రౌన్. తెలుగు-ఆంగ్లం, ఆంగ్లం-తెలుగు నిఘంటువులు, ఆంధ్రేత‌రులు తెలుగు సుల‌భంగా నేర్చుకోవడానికి న‌వ్యాంధ్ర వ్యాక‌ర‌ణం, వాచక ర‌చ‌న చేశారు. సాధురేప‌ము, శ‌క‌ట రేఫ‌ముల తెలుగులిపిని సంస్కరించి వ‌ర్ణమాలను స‌రిదిద్ధారు. వేమన ప‌ద్యాల‌ను ఆంగ్లానువాదం చేసి తెలుగు దీప్తిని ప్రపంచ వ్యాప్తితం చేసి తెలుగుభాషామత‌ల్లి సేవ‌లో త‌రించారు. సి.పి.బ్రౌన్ కలకత్తాలో జన్మించారు. తండ్రి డేవిడ్ బ్రౌన్ క్రైస్తవ విద్వాంసుడు. తండ్రి మరణానంత‌రం బ్రౌను కుటుంబం ఇంగ్లండు వెళ్ళిపోగా అక్కడే చార్లెస్ బ్రౌను హిందూస్థానీ భాష నేర్చుకున్నారు. 1817 ఆగష్టు 4న మద్రాసులో ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగ బాధ్యతల్లో  భాగంగామద్రాసులో కోదండరామ పంతులు వద్ద తెలుగులో ప్రాధమిక జ్ఞానాన్ని సంపాదించారు. 1820 ఆగష్టులో కడపలో డిప్యూటీ కలెక్టరుగా చేరారు. విధి నిర్వహ‌ణ‌లో భాగంగా వివిధ ప్రాంతాల్లో పనిచేయాల్సి రావ‌డం, తెలుగులో మాట్లాడడం తప్పనిసరి కావ‌డం, తెలుగేతరుల‌కు ఇబ్బందిగా మార‌డంతో తెలుగు నేర్చుకోవడంలో ఉన్న ఇబ్బందుల‌తో తెలుగు భాషా పరిశోధనకు పురికొల్పింది. ప్రాచీన తెలుగు కావ్యాలను వెలికితీసి, ప్రజలందరికీ అర్ధమయ్యేలా పరిష్కరించి, ప్రచురించడం, భాషకు వ్యాకరణం, నిఘంటువు, ఏర్పడడానికి దారితీసింది. మచిలీపట్నం, గుంటూరు, చిత్తూరు, తిరునెల్వేలి ఇలా ప‌లుచోట్ల పనిచేసిన బ్రౌను 1826 లో కడపకు తిరిగొచ్చి ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సొంత డబ్బుతో పండితులను నియమించుకుని సాహితీ వ్యాసంగాన్ని కొనసాగించారు.
అయోధ్యాపురం కృష్ణారెడ్డి బ్రౌను వ్యవహారాలను పర్యవేక్షిస్తూ ఉండేవారు. కడప, మచిలీపట్నంలో పాఠశాలలు ఏర్పాటు చేసి ఉచితంగా చదువులు చెప్పించారు. నేటి మ‌ధ్యాహ్న భోజ‌నంలాగా ఆనాడే ఉచిత‌ భోజనవసతి కల్పించారు. దానధర్మాలు విరివిగా చేసేవారు. వికలాంగులకు సాయం చేసేవారు. నెలనెలా పండితులకిచ్చే జీతాలు, దానధర్మాలు, పుస్తక ప్రచురణ ఖర్చులతో ఆర్థికంగా చితికి పోయి అప్పులు చేసేవారు. 1834లో ఉద్యోగం నుంచి తొలగించడంతో ఇంగ్లండు వెళ్ళిపోయిన బ్రౌను 1837లో కంపెనీలో పర్షియను అనువాదకుడిగా ఇండియా వచ్చారు. పదవీ విరమణ అనంత‌రం 1854లో లండన్‌లో స్థిరపడ్డారు. 1865లో లండన్ యూనివర్సిటీలో తెలుగు అధ్యాప‌కులుగా నియమితుల‌య్యారు. బ్రౌన్ 1884 డిసెంబర్ 12 న తన స్వగృహంలో 22 కిల్డారే గార్డెన్స్, వెస్ట్‌బార్న్ గ్రోవ్, లండన్లో అవివాహితునిగానే మరణించాడు.
బ్రౌన్ కొలువులో తొలి తెలుగు కథకుడు నేలటూరు వేంకటాచలం ఉర‌ఫ్ తాతాచారి. తాతాచారి చెప్పిన కథలు విన్న బ్రౌన్ 24 కథలను, శ్రీకృష్ణమాచారి చెప్పిన రెండు కథలను కలిపి 1855లో పుస్తకంగా ముద్రించారు. అదే ఏడాది పాపులర్ తెలుగు టేల్స్ పేరుతో ఆంగ్లానువాదం చేసి ప్రచురించారు. 1916లో తాతాచారి కథలు పేరుతో గిడుగు వేంకట అప్పారావు, 1951లో వావిళ్ల, 1974లో బంగోరె సంపాదకత్వంలో ముద్రణలు పొందాయ‌. సీపీ బ్రౌన్ తెలుగుభాష‌కు చేసిన సేవ‌ల‌కు స్మృతి చిహ్మంగా గ్రంధాల‌య ఏర్పాటుకు ఆచార్య ఆరుద్ర, బంగ‌రో, జీఎన్‌రెడ్డితోపాటు జానుమ‌ద్ది హ‌నుమ‌చ్ఛాస్త్రిలు గ్రంధాల‌య ఏర్పాటుకు కృషి చేశారు. వేమన పద్యాలను వెలికితీసి 1829లో 693 పద్యాలు, 1839లో 1164 పద్యాలు ప్రచురించారు. 1841లో నలచరిత్రను ప్రచురించారు.
ఆంధ్రమహాభారతము, శ్రీమద్భాగవతములను ప్రచురించారు. తెలుగు నేర్చుకునే ఆంగ్లేయుల కోసం వాచకాలు, వ్యాకరణ గ్రంథాలు రాసారు. 1840లో వ్యాకరణ గ్రంధాన్ని ప్రచురించారు. లండన్‌లోని ఇండియాహౌస్ లైబ్రరీలో ఉన్న 2106 దక్షిణ భారత భాషల గ్రంథాలను మద్రాసు తెప్పించారు. 1844లో వసుచరిత్ర, 1851లో మనుచరిత్ర ప్రచురించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular