ఈ నెల 17, 18 తేదీలలో జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి గారి కార్యక్రమానికి ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమావేశమైన కలెక్టర్‌ ఈసందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 17న బద్వేలు మండలం బాలయపల్లిలో ముఖ్యమంత్రి గ్రామాదర్శిని, బద్వేలు ఎస్ బి వీ ఆర్ డిగ్రీ కళాశాలలో బహిరంగ సభ, సాయంత్రం కడపలో రెండు అన్న క్యాంటీన్లను ప్రారంభించి రాత్రి బస చేస్తారు. 18న ఉదయం కడప లో పార్టీ సమావేశం, మధ్యాహ్నం పుల్లంపేట రెడ్డివారిపల్లి లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో హెలిప్యాడ్స్, గ్రామాదర్శిని, గ్రామసభ, బహిరంగ సభల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని కలెక్టరు పోలీస్ శాఖను ఆదేశించారు. గ్రామదర్శిని జరిగే గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమాలు పక్కగా చేసి పరిశుభ్రంగా తయారు చేయాలని, గ్రామసభ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
18న ఉదయం జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం పుల్లంపేట మండలం రెడ్డివారిపల్లి లో విగ్రహావిష్కరణ కార్యక్రమాలకు తగిన బందోబస్తు, ఇతర ఏర్పాట్లను పటిష్టంగా అమలు చేయాలని చెప్పారు. బద్వేలు మండలంలో జరిగే కార్యక్రమాలను జేసీ, కడప కార్యక్రమాలను జేసీ2 పర్యవేక్షించాలని సూచించారు. అప్పగించిన విధులను బాధ్యతాయుతంగా పూర్తిచేసి ముఖ్యమంత్రి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.