అంకితభావంతో పనిచేస్తే వంద శాతం ఫలితాలుఅభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముందుకు వెళ్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. అధికారులు అంకితభావంతో పని చేస్తే 100% ఫలితాలు సాధించవచ్చునన్నారు. శుక్రవారం అమరావతి నుంచి ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లు, అధికారులు, సాధికారమిత్రలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సమన్వయంతో పని చేయడం ద్వారా దేశంలో ఎక్కడా లేనివిధంగా అభివృద్ధి సాధించామన్నారు. పరిష్కార వేదిక, రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేలా డాక్యుమెంటరీ తయారు చేయాలని సూచించారు. వర్మి కంపోస్టు, ఘన వ్యర్ధాల నిర్వహణ, సోక్‌ఫిట్స్ నిర్మాణాలను వేగవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 25 వేల కిలోమీటర్ల సిమెంట్‌ రోడ్డు నిర్మించామని, ఉపాధి హామీ పనుల్లో ముందున్నామన్నారు. ప్రతి నెలా 3న ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించాలని సూచించారను. మాతా శిశు మరణాలను తగ్గించేలా వైద్య అధికారులు కృషి చేయాలన్నారు. నూటికి నూరుశాతం టీకాల కార్యక్రమం జరగాలన్నారు. టెక్నాలజీ ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు రావడం జరిగిందని వివరించారు. ప్రభుత్వ శాఖల అధికారులు ఒకరినొకరు పోటీతత్వంతో పని చేయాలని, నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకున్నప్పడే ఫలితాలు సాధించవచ్చునన్నారు. ప్రతి సోమవారం జలవనరుల శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రాజెక్టులపై సమీక్షించాలన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ లో ఇన్‌ఛార్జ్‌ కలెక్టర్ కోటేశ్వరరావు, ఇన్‌ఛార్జ్‌ జాయింట్ కలెక్టర్- 2 రామచంద్రారెడ్డి, సీపీవో తిప్పేస్వామి, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ గోపాలకృష్ణ, జెడ్పీ సీఈవో వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.