ప్రజల్లోకి జ్ఞాన సిద్ధాంతం

వార్తలు
1,299 Views

కాలగమనమంచు కర్మమంచు

బ్రహ్మలిఖితమంచు వాపోవుచుందురు

కాళికాంబ!హంస!కాళకాంబ. 

సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న జనం తమ సమస్యల్ని తాము పరిష్కరించుకోలేక ఎవరూ దిక్కులేనప్పుడు జ్ఞానహీనులై నిజం తెలుసుకోలేనివారై  అదేదో కాలగమనంలో సహజంగా వచ్చిందని, కర్మ అని బ్రహ్మరాసిన నుదిటిరాత అని వాపోతూ ఉంటారు.  మధ్య యుగాలలో సమాజంలో దోపిడీపీడనలు  హద్దులు దాటాయి. ప్రజలకూ ప్రభుత్వానికీ మధ్య ఉండవలసిన సంబంధం విచ్ఛిన్నమైపోయింది. చిల్లరరాజులు పాలెగాళ్ళు ఏలికలైనారు. వాళ్ళపని ప్రజల్ని పీడించుకు తినడమే. ప్రజలమొర వినే నాథుడు లేడు. రాజకీయవ్యవస్థ శిథిలమైపోయింది. ప్రజలకు దిక్కెవ్వరు. అజ్ఞానం విలయతాండవం చేస్తున్నది. అజ్ఞత అంధత్వం ముదిరిపోయాయి. హేతుజ్ఞానం నశించిపోయింది. తమ సమస్యలకు మూలం ప్రభుత్వమే అనిగానీ తమవి భౌతిక సమస్యలు అనిగానీ తెలుసుకునే తెలివి పోయింది. అందుకే అప్పటి జనం తమబాధలు కాలగమనంలో సహజంగా వచ్చాయని తమనుతామే ఓదార్చుకున్నారు. కర్మమని తమనుతాము వంచించుకున్నారు. బ్రహ్మలిఖితమని తమనుతాము మభ్యపెట్టుకున్నారు అని బ్రహ్మంగారు ఎత్తిచూపారు. కర్మఫలాన్ని కొన్ని పద్యాలలో ప్రస్తావించిన బ్రహ్మంగారే ప్రజలబాధలు కర్మఫలితాలని ఆమోదించలేదు. కర్మసిద్ధాంతం మోసపుసిద్ధాంతం అని ఎప్పుడు ఆయన బలంగా నమ్మారు. జడపదార్థంగా మారిపోయిన వ్యవస్థలో చలనం తీసుకొనిరావడానికి సకల ప్రయత్నాలూ చేశారు ఆయన.  స్థిరపడి ఉన్నది జ్ఞానం కాదని దానిని హేతుబద్ధంగా పూర్వపక్షం చేయాలి. దానిస్థానంలో తాను జ్ఞానమనుకున్నదానిని ప్రతిపాదించాలి. బ్రహ్మంగారు తనకాలపు ఆధిపత్యవర్గం ప్రజలలోకి తిసుకుపోయి ఉన్న భావజాలాన్ని అనేక పార్శ్వాలనుండి ఖండించి తాను చెప్పదలచుకున్న జ్ఞానాన్ని ప్రచారం చేశారు. ఒక జ్ఞానసిద్ధాంతాన్ని ప్రజలలోకి ఎలా తీసుకుపోవాలో బ్రహ్మంగారినుండి నేర్చుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *