ysrkadapa

వార్తలు

కమ్యూనిస్టుల ఉద్యమ అడ్డా..!

కడప జిల్లా కమ్యూనిస్టుల ఖిల్ల్లాగా..ఉద్యమాలకు అడ్డాగా పేరొందింది. స్వాతంత్య్రానికి పూర్వమే పలువురు నేతలు ఉద్యమాల్లో చేరి జైలుకెళ్లిన సంఘటనలున్నాయి. నాటి తరం కమ్యూనిస్టుల నాయకుల నీతి, నిజాయితీకి మెచ్చిన జిల్లా ప్రజలు ఓట్లు వేసి ఆదరించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి కడప ఎంపీగా నాలుగు పర్యాయాలు ఎంపీగా గెలిచి రికార్డును సాధించారు. కమ్యూనిస్టు పార్టీ తన ఖాతాలో కడప పార్లమెంటు వేసుకోవడం అరుదైన విశేషం. కమ్యూనిస్టులకు ఆయువుపట్టుగా జిల్లాలో రానురాను ప్రావభం కోల్పోంది.

1952-53లో కర్నూలు రాజధానికి కరవు యాత్రను చేపట్టింది. ఎంతోమంది శ్రమజీవులు రాజధాని కర్నూలుకు కాలినడన వెళ్లారు. ఆకులు, అలుములు చెట్లవేర్లను తిన్న రోజులవి. ప్రభుత్వం గంజి కేంద్రాలను నడిపింది. కమ్యూనిస్టు కార్యకర్తలున్న గ్రామాల్లో గంజికేంద్రాలకు ఇచ్చిన ధాన్యం సద్వినియోగం చేశారు. 1952లో అప్పటి ప్రధాని నెహ్రూ కడపకు వచ్చినప్పుడు కేంద్రాల్లో గంజిని ఆయన రుచి చూశారు.

రామక్కపాఠశాల : పుల్లంపేట సమీపంలోని రామక్కపల్లెలో రాజకీయ పాఠశాలను ఏర్పాటుచేశారు. పి.సుందరయ్య, ముక్కామాల, నాగభూషణంలు హాజరయ్యారు. హుస్సేన్‌ సోదరులు నిర్వహించారు. ఉద్యమంలో ఆలంఖాన్‌పల్లెకు చెందిన నంద్యాల నాగిరెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. గ్రామంలో బాలసంఘ, యువజనసంఘాన్ని ఏర్పాటుచేశారు. ఆయనతోపాటు చెంచురామయ్య, సుబ్బన్నలు సభ్యులుగా ఉండేవారు. 1946లో ఈశ్వరరెడ్డి కమ్యూనిస్టు పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. భూస్వామి కుటుంబంలో జన్మించిన ఈశ్వర్‌రెడ్డి ప్రజాసేవకే అంకితమయ్యారు. 1941 గాంధీజీ పిలుపునందుకొని చెన్నూరులో సత్యాగ్రహం చేశారు. 1946 ఎన్నికల్లో పంజం నరసింహారెడ్డి ఎన్నికల్లో పోటీచేశారు. బద్వేలు, సిద్ధవటం, తాలుకాల ఈశ్వర్‌రెడ్డి కాలినడకన ప్రచారం చేశారు. ధరావత్తు దక్కించుకున్నారు. 1947లో పులివెందులలో ప్రథమ మహాసభ: జిల్లా కమ్యూనిస్టు పార్టీ మొదటి జిల్లా సమావేశాన్ని 1947 అక్టోబరు 15న పులివెందులలో ఏర్పాటు చేశారు. పంజం నరసింహారెడ్డి మొదటి కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఈశ్వర్‌రెడ్డి, వరదారెడ్డి, పి.వెంకటరెడ్డి, జి.మల్లారెడ్డి, హుస్సేన్‌బాబు, శివరామిరెడ్డి, వెంకట్రామిరెడ్డిలతో నూతన కార్యవర్గాన్ని ఎంపికచేశారు.

పార్టీపై నిషేధం : 1948లో కమ్యూనిస్టు పార్టీని నిషేధించారు. పి.వెంకటరెడ్డి, గజ్జలమల్లారెడ్డి, వెంకటసుబ్బయ్య, టి.సుబ్బారావు, హుస్సేన్‌బాబులను కడప జైలుకు తరలించారు. పంజం నరసింహారెడ్డి, శివరామిరెడ్డి, ఈశ్వర్‌రెడ్డిలు రహస్యజీవితం గడిపారు. జిల్లాలోని ప్రముఖ నాయకులు అరెస్టులు కావడంతో రాష్ట్ర కమిటీ వై.కృష్ణారావును ఇన్‌ఛార్జి బాధ్యతలను అప్పగించింది. ఆయనను పోలీసులు అరెస్టు చేసి ప్రొద్దుటూరు జైలుకు పంపారు. కృష్ణారావు తప్పించుకొని శివరామిరెడ్డి వద్దకు చేరారు.

* కృష్ణారావు సి.రాజుపాలెంలో రాజకీయ పాఠశాలను నడిపారు. జాతీయ ఉద్యమాల్లో కమ్యూనిస్టుల పాత్ర, నిర్మాణ సూత్రాలను బోధించారు.  జేవీ వెంకటరామిరెడ్డి ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదిలి కమ్యూనిస్టు పార్టీలో చేశారు.

పోలీసు కాల్పులు : కమ్యూనిస్టు నాయకుడు ఎద్దుల ఈశ్వర్‌రెడ్డిని 1949 సెప్టెంబరు 29న ఒకరిచ్చిన సమాచారంతో పోలీసులు అరెస్టు చేశారు. గ్రామస్థులు పోలీసులపై దాడిచేసి తప్పించారు. పోలీసుల కాల్పులు జరపగా వెంకటకొండారెడ్డి అనే యువకుడు మృతిచెందారు.రిజర్వుడ్‌ పోలీసులు రాజుపాలెంపై దాడిచేసి కమ్యూనిస్టు కార్యకర్తలను అరెస్టు చేయడానికి   వెళ్లారు. పార్టీ సభ్యులు, అభిమానులు వడిసెల రాళ్లతో భవనాలపైకెళ్లి పోలీసులను అడ్డుకున్నారు. పోలీసు కాల్పుల్లో పెద్దవెంకటన్న, మారెన్న, చిన్నవెంకటన్న అనే సభ్యులు మృతిచెందారు.

తెలంగాణసాయుధ పోరాటానికి మద్దతు
సాయుధ పోరాటం చేయాలని పార్టీ నిర్ణయించడంతో ఆయుధాలసేకరణకు నేతలు ఆస్తులు, భార్యమెడలోని నగలు విక్రయించారు. కమలాపురం ఉద్యమానికి అడ్డాగామారింది.
* 1952 ఎన్నికల్లో కడప ఎంపీగా ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి కమలాపురం ఎమ్మెల్యేగా ఎన్‌.శివరామిరెడ్డి, రాజంపేటలో పి.నరసింహారెడ్డి, జమ్మలమడుగు సీపీఐ బలపరిచిన కుండారామయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు.1955 ఉపఎన్నికల్లో జిల్లాలో రాయచోటి మినహా మిగతా శాసనసభ స్థానాల్లో దరావతులు దక్కలేదు. 1957 ఎన్నికల్లో ఈశ్వర్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. 1961, 1967, 71 కడప పార్లమెంటు సీపీఐ అభ్యర్థిగా ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి గెలుపొందారు.

* 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలిక ప్రభావం పెద్దగా లేదు. జిల్లా నాయకుడు పి.వెంకటరెడ్డి, తరిమెల నాగిరెడ్డి వైపు, రోశిరెడ్డి మార్కిస్ట్‌ వైపు వెళ్లారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఉద్యమాన్ని నడిపారు విజయరామరాజు. జీసీ వెంకటరెడ్డి, లక్ష్మిరెడ్డి, రోశిరెడ్డి, సంజీవరెడ్డి సర్టిఫికెట్లు రద్దు చేయడంతో జీవన భృతిని కోల్పోయారు.1966లో టన్నుకు రూ.రెండువేలు ఎగుమతి సుంకాన్ని విధించడంతో నిరసనగా  10వేల సంతకాలను సేకరించారు. రామనపల్లె దళితులకు సాంఘిక దేర, వెట్టి తదితరాలపై పోరాడి దళితులకు కాలనీలు ఇప్పించారు. 1974లో ఖాజీపేటలో 167ఎకరాల భూములను పంచారు.

ప్రజా సమస్యలపై పోరాటం
బ్రహ్మణి ఉక్కు కర్మాగారం నిరంతరం పోరాటం చేశాం. మండలకేంద్రాల్లో ధర్నాలు ఫికెటింగులు చేపట్టాం. ఉక్కు సంకల్పంతో చేశారు. భాకపా రాష్ట్ర, కేంద్ర నాయకులతో కలిసి యూపీఏ ప్రభుత్వం అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు ఉక్కు పరిశ్రమ కోసం వినతిపత్రం ఇచ్చాం. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, సీమకు ప్రత్యేక ప్యాకేజీ, నిధులు, నికర జలాల్లో సరైనవాటా, బీసీలకు ఉపప్రణాళిక, ప్రైవేట్‌రంగంలో రిజర్వేషన్లు, నిరుద్యోగభృతి, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, డిమాండ్లపై రాష్ట్ర మహాసభలు చేపడుతున్నాం. కడప ఉర్దూవిశ్వవిద్యాలయం, టెక్స్‌టైల్స్‌, హార్టీకల్చర్‌ హబ్‌లు ఏర్పాటుచేయాలనే డిమాండ్లపై పలుతీర్మానాలు చేయనున్నాం.

-గుజ్జల ఈశ్వరయ్య, భాకపా జిల్లా కార్యదర్శి, కడప

రెడ్‌ విలేజీగా  ఆలంఖాన్‌పల్లె
కడప సమీపంలోని ఆలంఖాన్‌పల్లె యువజన సంఘాన్ని ఏర్పాటుచేసి, సహకార పరపతి సంఘాన్నిఏర్పాటుచేసి డబ్బు అవసరమున్న రైతులకు  రుణాలిచ్చేవారు. పశువుకు కొనుగోలు రుణాలిచ్చారు. తక్కువ వడ్డీకి రుణాలివ్వడంతో గ్రామస్థులు కమ్యూనిస్టులపై అభిమానం ఏర్పడింది. గ్రామపరపతి సంఘం, పంచాయతీబోర్డు కమ్యూనిస్టుల ఆధీనంలో సుదీర్ఘంగా 30ఏళ్లు ఉండటంతో రెడ్‌ విలేజ్‌ అనే పేరువచ్చింది. కమ్యూనిస్టు ఉద్యమాల్లో మహిళలు పాల్గొన్నారు. పలువురు కులాంతర వివాహాలు చేసుకున్నారు.

జిల్లాలో ఉద్యమ  కారకులు వీరే…
జిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి కొందరు పునాదులు చేశారు. వీరిలో సంగమేశ్వరరెడ్డి, మోకాసుబ్బయ్య, నంద్యాల వరదారెడ్డిల అనంతరం వై.ఈశ్వర్‌రెడ్డి, పంజం నరసింహారెడ్డి, పి.వెంకటరెడ్డి, గజ్జలమల్లారెడ్డి, ఎన్‌.శివరామిరెడ్డి, హుస్సేన్‌బాబు, జె.వెంకట్రామిరెడ్డి, ఎం.వెంకటసుబ్బయ్య, టిసుబ్బారావు, పి.చెన్నారెడ్డి, ఫక్కీరారెడ్డి, చిన్నప్పరెడ్డి, అంకిరెడ్డి, పుల్లారెడ్డి, రామిరెడ్డి, సుబ్బన్న, లింగమూర్తి, చెంచురామయ్య, పిచ్చిరాజు ఉన్నారు.

ప్రాజెక్టుల సాధనకు అలుపెరగని పోరుబాట : శాశ్వత కరవు నివారణకు కృష్ణాజలాలు తరలించాలని ఉద్యమించారు. 1952లో సిద్ధేశ్వరం, గండికోట, ప్రాజెక్టుల కోసం ఆందోళన చేపట్టారు.కడప, ప్రొద్దుటూరులో మహాసభలు చేపట్టారు. శ్రీశైలం కుడి, ఎడమకాలువల బ్రాంచికాలువలను సాధించింది కమ్యూనిస్టు నేతలే. కళాకారుల కబమ్ము సోదరులు ఎస్‌ఆర్‌బీసీ, తెలుగుగంగ కోసం కె.సుబ్బన్న, లింగమూర్తిలు ఉద్యమాలు చేపట్టారు. జిల్లాలో కమ్యూనిస్టుల పార్టీ పాత్ర రాజకీయంగా పెద్దగా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. ఇటీవల పెద్దగాఎన్నికల్లో పోటీచేసి గెలిచిన సంఘటనలు లేవు. గతంలో తెదేపాతో సీపీఐ మద్దతు ఉండటంలో అప్పటిలో జిల్లా కార్యదర్శిగానున్న ఓబులేసు ఎర్రగుంట జడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికయ్యారు. తర్వాత పెద్దగా ప్రత్యక్ష ఎన్నికల్లో పదవులుదక్కలేదని చెప్పవచ్చు.

 

Leave a Comment