కరోనా కట్టడికి ప్రజల సహకారం అవసరం

వార్తలు
48 Views
కరోనా కట్టడికి ప్రజల సహకారాలు ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించి కట్టడి చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్బాష అన్నారు. సోమవారం నగర పాలక సంస్థ సమావేశ భవనంలో కడప సబ్ కలెక్టర్ పృధ్వి తేజ్ ఆధ్వర్యంలో టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పట్టణంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోందన్నారు, నగరంలో ఇప్పటి వరకు సుమారు 6373 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు. అందులో 3853 కేసులు రికవరీ కాగా 2449 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు సడలింపు మేరకు కడప నగరంలో ప్రస్తుతం ఒంటి గంట వరకు మాత్రమే కొన్ని దుకాణాలకు అనుమతి ఉండేదన్నారు. ఈ సమావేశంలో అందరి నిర్ణయం మేరకు కమర్షియల్ షాపులన్నీ సాయంత్రం నాలుగు గంటల వరకు తెరచుకునేలా అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు. సాయంత్రం 4 గంటల తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలన్నారు. కడప నగరంలో రెండు పీహెచ్‌సీలు, ఐదు మ్యాక్స్ సెంటర్లు ఉన్నాయని, ఈ సెంటర్లలో తప్పనిసరిగా ప్రతి రోజూ వారికిచ్చిన లక్ష్యాల మేరకు ఒక్కో కేంద్రంలో 50 శాంపిల్స్ టెస్టు చేయాల్సి ఉంటుందన్నారు. కడప మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి ఒక సంజీవిని బస్సు అలాట్ చేయడం జరిగిందన్నారు. ప్రతి సచివాలయంలో అక్కడి అడ్మిన్ ఏఎన్ఎం లను అలర్ట్ చేసి ఆ ప్రాంతంలో ఉండే 60 సంవత్సరాలు పైబడిన వారికి మొదటి ప్రాధాన్యత ఇచ్చి, తరువాత లక్షణాలు ఉన్న వారందరికీ కూడా కరోనా టెస్టులు చేయాలన్నారు. వర్షాకాలంలో ప్రజలు అనారోగ్యానికి గురికాకుండా శానిటేషన్ చేయాలని మున్సిపల్ కమిషనర్ వారి సిబ్బందికి సూచించారు. శానిటేషన్ పై ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు రాకూడదన్నారు. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాలలో హైపో క్లోరైడ్ ద్రావణం స్ప్రే చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లాలన్నారు. పట్టణంలో ప్రతి రోజూ శానిటేషన్ చేయాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లవన్న, డిఎస్పి సూర్యనారాయణ, తాసిల్దార్ శివరామిరెడ్డి, డాక్టర్ జమాల్ బాషా, మున్సిపల్ సిబ్బంది, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు షఫీ, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *