జిల్లాలో తప్పుల్లేని ఓటరు జాబితా రూపొందించేందుకు బాధ్యతా యుతంగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చేకూరి హరికిరణ్ రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ లోని ఎన్ఐసి కేంద్రంలో స్పెషల్ సమ్మరీ ఎలెక్టరల్స్ పై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ….. ప్రజా ప్రయోజన చట్టాన్ని అనుసరించి ఎన్నికల సంఘం నిర్ధేశించిన షెడ్యూల్ మేరకు నిర్ధేశించిన సమయం లోగా జిల్లాలో స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపొందించాలన్నారు. నియోజకవర్గాల వారీగా సంబంధిత ఈర్వోలు రాజకీయ పార్టీలతో వెంటనే సమావేశాలు ఏర్పాటు నిర్వహించి చర్చించాలని,  రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ ప్రక్రియలను పూర్తి చేయాలని సూచించారు. అలాగే బోగస్ ఓటర్లు, డూప్లికేట్ పేర్లు, వలస పోయిన వారి పేర్లు, మృతులను గుర్తించాలని, సమావేశానికి సంబంధించి మినిట్స్ రికార్డ్ చేయాలని, మినిట్స్ ప్రతిని తప్పనిసరిగా కలెక్టరేట్ కు పంపాలన్నారు. పర్యవేక్షకులు, బీఎల్వోలతో సహాయ రిటర్నింగ్ అధికారులు సమావేశాలు నిర్వహించి ఎన్నికల సంఘం నిర్ధేశించిన షెడ్యూల్ లోని పనులను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువత ఓటర్లుగా నమోదు చేసుకొనేలా యూనివర్సిటీలు, కళాశాలలు, హాస్టల్స్ లలో విస్తృత అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో పెండింగులో ఉన్న 30 వేల క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ లను జూన్ నెలాఖరులోగా  పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.