ysrkadapa

వార్తలు

పల్లె జీవం

“పల్లె జీవం” కార్యక్రమం తో రాష్ట్ర ప్రభుత్వం కరవు గ్రామాల్లో వెలుగులు నింపుతోందని జిల్లా జాయింట్ కలెక్టర్ (రైతు భరోసా, రెవెన్యూ) ఎం.గౌతమి అన్నారు. బుధవారం స్థానిక కలెక్టరేట్‌ స్పందన హాలులో ‘ఆంధ్రప్రదేశ్‌ కరువు సంసిద్దత పథకం’ (APDMP) ఆధ్వర్యంలో.. “పల్లెజీవం – వ్యవసాయ అనుబంధ శాఖల అనుసంధానం” అనే అంశంపై శాఖల అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేసీ గౌతమి మాట్లాడుతూ కరవు ప్రాంతాల్లో వ్యవసాయ, పశు పోషణ రంగాల్లో నూతన, సాంకేతిక విధానాలను అమలు చేయడంతోపాటు భూగర్భ జలాలను సమర్థవంతంగా వినియోగించుకుని, సన్న, చిన్నకారు రైతులు, ఎస్సీ, ఎస్టీ రైతుల ఆదాయ వనరులను పెంచి జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే పథకం ఆశయమన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలను పథకంతో అనుసంధానం చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ఎంపిక చేసిన 9 మండలాల్లో “పల్లె జీవం” పథకం ద్వారా రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరచాల్సిన బాధ్యత శాఖల అధికారులదేనన్నారు. ప్రధానంగా రైతు ఉత్పాదక సంస్థలను ఎక్కువగా ప్రోత్సహించాలన్నారు. ఉద్యానవన శాఖలో ఫారం పాండ్స్, సంబందిత పంటల ఉత్పత్తులు పెంచడంపై దృష్టిసారించి రైతులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయ రంగంలోని రైతులకు వర్షాధారం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనువైన పంటలు, చిరుధాన్యాల సాగు, ఉత్పత్తులను పెంచేలా ప్రోత్సహించాలన్నారు. ప్రణాళికకు అనుగుణంగా శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. ఇప్పటివరకు నిర్వహించిన కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఆయా మండలాల్లోని మండలస్థాయి అధికారులు, ఏఈఓలు, హెచ్ఈఓలు, పశుసంవర్ధక శాఖ అధికారులు, పశు వైద్యులు, ఎంపిఈవోలు, సచివాలయాల్లోని గ్రామీణ వ్యవసాయ సహాయకులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఏపీడీఎంపీ రాష్ట్ర ముఖ్య కార్యనిర్వాహక ఆధికారి బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎంపిక చేసిన గ్రామాల్లో రైతు ఉత్పత్తిదారుల సంఘాలను (ఎఫ్‌పీవో) ఏర్పాటు చేసి వాటిని రిజిస్టర్‌ చేసి ఆ సంఘాలే గ్రామస్థాయిలో ఈ పథకాన్ని పూర్తిస్థాయిలో నిర్వహించేలా బలోపేతం చేయాలన్నారు. జిల్లాలోని వర్షాభావ ప్రాంతాలైన వేముల, చక్రాయపేట, వేంపల్లి, సంబేపల్లి, టి.సుండుపల్లి, చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లి, రామాపురం, గాలివీడు మండలాల్లోని 9 క్లస్టర్లలో 9 ఎఫ్.పి.ఓ. లలో 8740 మంది రైతులు రూ.35,40,495 భాగస్వామ్య పెట్టుబడితో సభ్యత్వం పొందిన వ్యవసాయ కుటుంబాలకు ఆహారభద్రత, ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తున్నామన్నారు.
వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు విజయకుమారి మాట్లాడుతూ నీటి వనరుల పెంపునకు భూగర్భ జలాలపై ఆధారపడకుండా వాతావరణంలోని తేమను స్థిరీకరించే విధానాన్ని పెంచి, ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా కరవు ప్రాంతాలను అభివృద్ధి పరచవచ్చన్నారు. ఏడాది పొడవునా పంటసాగు జరిగేలా వ్యవసాయంలో సహజ పద్ధతులను ఉపయోగించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. సుస్థిర విధానం ద్వారా రైతు సాధికారితను మరింతగా పెంచేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సంఘటితంగా కృషి చేయాల్సి ఉంటుందన్నారు. అంతేకాకుండా మహిళా రైతుల భాగస్వామ్యంతో మరింత అభివృద్ధిని సాధించగలమన్నారు.

పశుసంవర్ధక శాఖ జెడి సత్య ప్రకాష్, ఉద్యానవన శాఖ డిడి వజ్రశ్రీ, భూగర్భజల శాఖ డిడి మురళీధర్, డ్వామా పిడి యధుభూషన్ రెడ్డి, డిపిడీ మురళి, ఎపిడి డా.శ్రీనివాసులు రెడ్డి, డీపీఎం ఐడి శ్యాం సుందర్ రెడ్డి, ఐడి శ్రీధర్ బాబు, అనుబంధ శాఖల జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment