“తిలలరసము లేక దీపమ్ము వెలుగదు
పూవులేక ఫలము పుట్టబోదు
భక్తిలేక జ్ఞానఫలము లభింపదు
కాళికాంబ!హంస!కాళికాంబ!”
నువ్వులనూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అలాగే భక్తి లేకుండా జ్ఞానం అనే ఫలం లభించదు. ఈపద్యంలో బ్రహ్మంగారు జ్ఞానార్జనలో ఉండవలసిన నిబద్ధతను ప్రతిపాదించారు. దేనిని నీవు నమ్ముతున్నావో, దేనిని నీవు కోరుతున్నావో దానిమీదనే దృష్టిని కేంద్రీకరించడాన్ని భక్తి అనుకుందాం. జ్ఞానం దొరకాలంటే అది అలవోకగా దొరకదు. ప్రయత్నించి సాధించాలి.
“ఏదీ తనంతతానై నీదరికి రాదు, శోధించిసాధించాలి, అదియే ధీరగుణం” అన్నారు కవి. జ్ఞాన సముపార్జన చేసే వాళ్ళకు దాని మీదనే ధ్యాస ఉండాలి. ఆటంకాలేన్ని ఎదురైనా వాటిని అధిగమించాలి. ఏకాగ్రత ఉండాలి. ఏపని చేస్తున్నా జ్ఞానం మీదనే దృష్టి పెట్టాలి. అది భక్తి. జ్ఞానం పట్ల ఇష్టం ఉండాలి. దానిసాధన పట్ల తపన ఉండాలి. సాధారణంగా భక్తి అంటే దైవభక్తి అనే అంటాం. ఇక్కడ ఇష్టం నిబద్ధత ఏకాగ్రత పట్టుదల అని అర్థం. దీనిని చెప్పడానికి బ్రహ్మంగారు రెండు పోలికలు చెప్పారు. నూనె లేకుండా దీపం వెలగదు. పువ్వు లేకుండా పండు పుట్టదు. అని చెప్పి జ్ఞానం దొరకాలంటే శ్రద్ధ ఉండాలి అన్నారు. ఏపని చేస్తున్నా ఆపనిలో మనం లీనం కావాలి. అయిష్టంగా ఎవరిప్రీతికోసమో చేయరాదు. ప్రహ్లాదుడు విష్ణుభక్తి కోసం ఎన్ని సవాళ్ళు ఎదుర్కొన్నాడు! అది ఆయన భక్తి. భగత్ సింగ్, నేతాజీ స్వాతంత్ర్యం కోసం ఎన్ని సాహసాలు చేశారు! మహాత్మాపూలే, అంబేద్కర్ లు తమ ఉద్యమంలో ఎన్నో సవాళ్ళను, దౌర్జన్యాలను ఎదుర్కొన్నారు! వాళ్ళ వాళ్ళ లక్ష్యాలూ వాటిసాధన కవసరమైన నిబద్ధత అనేవి విడదీయరానివి. అందువల్ల జ్ఞానం అనే పండు దొరకాలంటే అది దాని సాధన పట్ల దీక్షతోనే సాధ్యం అని గుర్తించాలి. ముక్తివాదులకైనా విముక్తివాదులకైనా తమలక్ష్యంపట్ల నిబద్ధత ఉండాలి. తన సామాజిక సంస్కరణోద్యమంలో బ్రహ్మంగారు కూడా అడుగడుగునా ఆధిపత్యవాదులను ఎదర్కొన్నారు. దీనిని మనం గ్రహించాలి.