ysrkadapa

రాచపాలెం

విద్య సార్వజనీనం కావాలి

ఎద్దుమొద్దులందు నేమిభేదములేదు
బుద్ధిగలుగువాడె పూరుషుండు
మనుజపశువు కంటె మహిపశువు మేలు
కాళికాంబ!హంస!కాళికాంబ
ఎద్దుకూ మొద్దుకూ భేదం లేదు. జ్ఞానం ఉన్నవాడే మనిషి. అదిలేని మనిషి అనే పశువు కన్నా నేలమీద తిరుగాడే అసలైన పశువే మేలు. జ్ఞానం అందరిదీ కాకపోతే మనిషి స్థానం ఏమిటో బ్రహ్మంగారు ఈ పద్యంలో చెప్పారు.  విద్యలేనివాడు వింతపశువు అనేసామెత మన సమాజంలో పురాతనకాలం నుంచి  ఉన్నది. చదువగవలయు జనులకు అని చదివిన సదసద్వివేకచతురత కలుగున్ అని పోతన చెప్పారు. అయినా ప్రాచీన సమాజంలో విద్య సార్వజనీనం కాలేదు. ఇదొక భారతీయ విషాదం. ఈ విషాదాన్ని గుర్తించి బ్రహ్మంగారు ఈ పద్యం చెప్పారు. మనిషికీ పశువుకు తేడా ఉన్నదనీ మనిషి ఆలోచించగలడు వస్తువులు ఉత్పత్తి చేస్తాడు. అనేకనిర్మాణాలు చేస్తాడు. భావాలు అభివ్యక్తం చేస్తాడు. ఇలాంటి పనులేవీ పశువులు చేయలేవు. అందువల్ల మనిషి పశువు కన్నా విశిష్టమైన ప్రాణి. మనుషులు చెయ్యలేని పనులు కొన్ని జంతువులు చేస్తాయి. అది వేరే విషయం. మనిషి కర్రూ, కాడి మొదలు కమండలం దాకా కమండలం నుంచి కంప్యూటర్ దాకా వేణువు మొదలు వ్యాట్సప్ దాకా మట్టిబండి నుంచి మహాక్షిపణి దాకా బాణం నుంచి రాకెట్ దాకా మానవుడు ఉత్పత్తి చెయ్యగలడు. పశువులు మనిషి సృష్టించిన వస్తువులను మోయగలవు లాగగలవు. క్రూరమృగాలను సైతం మనిషి లోబరచు కున్నాడు గానీ మృగం మనిషిని లోబరచుకోలేదు. ఇదెలా సాధ్యమైంది. మనిషి జ్ఞానం ద్వారా. దీనినే బ్రహ్మంగారు బుద్ధి అన్నారు.  ఈ బుద్ధి విద్య ద్వారా సిద్ధిస్తుంది. ఈ బుద్ధే గనక మనిషికి లేకపోతే మనిషి పశువుతో సమానం. మనిషన్నవాడు బుద్ధి గలిగినవాడు కావాలి. విద్య ఫలితమే బుద్ధి. ఆబుద్ధి లేని మనిషి అనే పశువు కన్నా అసలైన పశువే మేలు అని బ్రహ్మంగారి తీర్పు. మనిషిని పశువు నుంచి వేరు చేసే జ్ఞానాన్నిచ్చే విద్యను కొందరికే స్వాధీనం  చేసి అధిక సంఖ్యాకులను దానికి దూరం చేసి మనషులను మహిపశువులకన్నా తక్కువ చేసిన సామాజిక దురన్యాయం మీద విమర్శ బ్రహ్మంగారి పద్యం. బలవంతులు దర్బలజాతిని బానిసలుగా చేయడంలో బుద్ధి నియంత్రణ పాత్ర చాలా ఉంది. మనషులు మనీషులు కావలసిన చోట బుద్ధి నియంత్రణ జరగడం వల్ల దేశం మనుజ పశువులమయం అయిపోవడాన్ని గుర్తించిన బ్రహ్మంగారు  బుద్ధి అందరిదీ కావాలని భారతదేశం బుద్ధిమంతుల దేశం కావాలని అభిలషించారు. బ్రహ్మంగారికి చదువంటే ఏమిటి, ఏది చదువు,  ఏది చదువు కాదు, చదువు వలన ప్రయోజనం మొదలైన అంశాలన్నీ తెలుసు. ఆయన జ్ఞాని అయ్యారు. ప్రజలందరూ జ్ఞానులు కావాలని ఆకాంక్షించారు. విద్య అల్పజనీనం కావడాన్ని వ్యతరేకించి అది సార్వజనీనం కావాలని చాటి చెప్పారు. ఆయనకు నమస్కరిద్దాం.

Leave a Comment