ఎర్రచెరువులోని చేపలు చాలా తెలివిగలవి. ఒకసారి ఆ చెరువు దగ్గరికి బకము అనే కొంగ వచ్చి అక్కడ బోలెడన్ని చేపలు ఉండటం చూసి సంతోషించింది. మరే కొంగా చెరువు దగ్గర లేక పోవడంతో ఆశ్చర్యపోతూ చేపలు పట్టేందుకు ప్రయత్నించింది. అవి దొరికినట్టే దొరికి తప్పించుకుంటున్నాయి. అలా మూడు రోజులు అదేపనిలో ఉండటం వల్ల శోషవచ్చి గట్టు మీద పడిపోయింది. దాని దీనావస్థ చూసిన చేపల రాజు మీనం ‘ఇదిగో నువ్వు ఆకలికి చచ్చిపోయేట్టున్నావు. కొంత ఆహారం ఇస్తాను. తినేసి వెళ్లిపో అని చెప్ప చెరువులోని కొనిన పురుగులను సేకరించి దానికిచ్చింది. మీనం సహాయానికి బకం ఎంతో సంతోషించింది. మీనానికి మొదట ఇష్టం లేకపోయినా ఇద్దరూ స్నేహితులయ్యారు. ఇదిలా ఉండగా ఒకరోజు ఆచెరువు దగ్గరికి గాలాలు తీసుకుని చేపలుపట్టే వాళ్లు వచ్చారు. బకం ఇది గమనించి మీనాన్ని హెచ్చరించింది. దాంతో ఒక్క గాలాన్ని కూడా చేపలు ముట్టుకోలేదు. రేపు వచ్చి వల వేసి పట్టుకుందామనుకుంటూ బెస్తవాళ్లు వెళ్లడం బకం విన్నది. విషయాన్ని మీనానికి చెప్పి మీనం కుటుంబాన్ని సురక్షిత ప్రదేశానికి తీసుకెళ్తానంది. అందుకు ఒప్పుకోలేదు మీనం. మరుసటిరోజు చేపల గురించే ఆలోచిస్తున్న బకానికి కొద్దిదూరంలో సింహం నిద్రపోతూ కనిపించింది. అప్పుడు దానికి ఓ ఉపాయం తోచి సింహాన్ని ముక్కుతో గట్టిగా పొడిచింది. దానికి నిద్రా భంగమై కోపంగా బకాన్ని తొక్కేయబోతే అది ఎగిరి తప్పించుకుంది. అలా ఎగురుతూ వీలున్నప్పుడల్లా సింహాన్ని పొడుస్తుంటే అది పిచ్చిపట్టిన దానిలా బకం వెంట పరుగులు తీసింది. అలా సింహాన్ని మీనమున్న చెరువు వరకూ తీసుకొచ్చి అక్కడి ఎత్తైన కొమ్మమీద కూర్చుంది. అప్పుడే చెరువు దగ్గరికి వస్తున్న బెస్తవాళ్లు సింహం అరుపు విని భయంతో పరుగుపెట్టారు. తమను ఆపద నుంచి కాపాడిన బకానికి కృతజ్ఞతలు చెప్పుకున్నాయి చేపలు. (2015 డిసెంబరు 27న ఆదివారం ఈనాడు పుస్తకంలో ఈకథ ప్రచురితమైంది.)