ysrkadapa

రాచపాలెం

గురుశిష్య వ్యవస్థ

కోతిపిల్లరీతి గురువుతోనుండిన
శిష్యులకును సుంత చేటురాదు
నమ్మినమ్మకున్న దుమ్ముపాలగుదురు
కాళికాంబ!హంస! కాళికాంబ
బ్రహ్మంగారు తన కవిత్వంలో గురువుకు పెద్దపీట వేశారు. ఆయనే ఒక గురుడు. పూర్ణగురుడు. శిష్య వాత్సల్యానికి ప్రతీక. ఆయన గురువు గురుశిష్య సంబంధాలు గురించి నాణ్యమైన అనేక పద్యాలు రాశారు. ఆయన ఆస్తికుడైనా దేవుళ్ళకన్నా గురువునే ఉన్నతుడుగా భావించారు. ఆయన కాలంలో బోధ గురువులను బాధ గురువులను గమనించినట్లున్నారు. అసలైన గురువు ఎలాంటివాడో చెప్పారు. ఆయన దృష్టిలో గురువు పరమయోగి. ఆయోగి త్యాగధనుడు. మనిషికి ముక్తి ఆ గురువువల్లనే లభిస్తుంది. ఇలా బ్రహ్మంగారు గురువును నిర్వచించారు. పైపద్యంలో గురుశిష్య సంబంధాన్ని చెప్పారు. తల్లి కోతిని పిల్లకోతి నిరంతరం కరుచుకొని ఉన్నట్లుగా శిష్యులు గురువును వదిలి పెట్టకుండా వెన్నంటి ఉండాలి. అలా ఉంటే శిష్యులకు ఏకీడూ జరగదు. అలాకాకుండా శిష్యులు గురువును నమ్మీనమ్మకుండా ఉంటే దుమ్ముగొట్టుకుపోతారు అని బ్రహ్మంగారి తీర్పు. గురువుకూ శిష్యునికీ మధ్య సంపూర్ణ విశ్వాసం వారధిగా ఉండాలని బ్రహ్మంగారి భావన. శిష్యుడు గురువును పూర్తిగా నమ్మాలి. అవకాశవాదంతో స్వార్థబుద్ధితో వ్యాపారదృష్టితో గురువు దగ్గరికి రాకూడదు.  అది విద్యార్థికే చేటు తెస్తుందని వారి ప్రబోధం. ఉపాధ్యాయుడంటే శిష్యునికి అత్యంత సమీపంగా  ఉండి బోధన చేసేవాడని అర్థం. గురుశిష్యుల మధ్య సామీప్యత విశ్వసనీయత ఉండాలని బ్రహ్మంగారు తపించారు. శిష్యులు గురువును నిందించడాన్ని బ్రహ్మంగారు ఆమోదించలేదు. గురువులంతా గొప్పవాళ్ళు కాదని ఆయనకు తెలుసు. స్థిరమైన గురుత్వంగల గురువులు శిష్యుల చేత నిందలపాలు కావడం పట్ల ఆయన హెచ్చరిక చేశారు.
“గురునిందజేసి పరముగాంచెదనన్న
హీనగుణుడు బుద్ధిలేనివాడు
బుద్ధిలేని సుద్ద మొద్దు లజ్ఞానులు
కాళికాంబ!హంస! కాళికాంబ
బహుశా ఆయన చేరదీసిన శిష్యులంతా సిద్ధయ్యలాంటి వాళ్ళు కాకపోయి ఉండవచ్చు. కంఠం తీవ్రంగా ఉంది. అంతటి యోగికికూడా అంతటి చికాకు కలిగించే శిష్యులు కొందరైనా ఉండి ఉంటారు. గురువు చెప్పినట్లు నడచుకుంటే శిష్యులు కొంతకాలానికి గురువుతో సమానులౌతారట అప్పుడు గురువు శిష్యడు అనే భేదం తొలగిపోయి ఇద్దరూ ఒక్కరే అవుతారట. ఇది చాలా ఉదాత్తమైన భావం. ఉదాత్తమైన భావ ప్రచారం చేసేదే నిజమైన కవిత్వం. పరుసవేది వలన ఇనుము బంగారమైనట్లు ఉత్తముడైన శిష్యుడు లభిస్తే అతను గురువుద్వారా బంగారం వంటి వ్యక్తిగా రూపొందుతాడని మరొక పద్యంలో చెప్పారు. మంచి గురువులూ మంచి శిష్యులూ  జతకూడితే ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో కవి ఇంకో పద్యంలో చెప్పారు.
గురుశిష్యులెల్ల పరిపాలనాపరుల్
పారమార్థికులుగ ప్రబలిరేని
సంఘమందు సుఖము శాంతి వర్ధిల్లును
కాళికాంబ! హంస! కాళికాంబ
విద్యావంతులైన గురుశిష్యులు పరిపాలనాపరులు , పారమార్థికులు అయితే సంఘంలో సుఖమూ శాంతీ నెలకొంటాయని అన్నారు బ్రహ్మంగారు. ఇది కూడా క్రియాశీలమైన భావన. పరిపాలకులు పారమార్థికులుగా ఉండటంలేదు. పారమార్థికులు  పరిపాలకులయ్యే అవకాశం రావడం లేదు. శ్రీకృష్ణదేవరాయలు వంటి ఒకరిద్దరికి తప్ప. ఆధునికకాలంలోనూ అలాగే ఉంది. పారమార్థికులు  అంటే పరమార్థం తెలిసినవారు. పరమమైన అర్థం పరమార్థం. అంటే ఒకతాత్విక ధృక్పథం. ఒక జీవితతత్వం. సత్యమే పరమార్థం అంటుంది సంప్రదాయం. సత్యానికి ఎవరి అర్థాలు వారికున్నాయి. ఏమైనప్పటికీ తత్వవేత్తలు పరిపాలకులు కావాలని వారు విద్యావంతులైన గురుశిష్యులు కావాలని బ్రహ్మంగారు కోరుకున్నారు. ఇవాళ పరిపాలకులకు కొదవలేదు. వాళ్ళు పారమార్థికులు కాకపోవడం పైగా అపారమార్థికులు కావడం పెద్దలోటు. పారమార్థికులు పరిపాలకులైతే వాళ్ళలో స్వార్థం ఉండదు. హింసకు పాల్పడరు. అవినీతికి దూరంగా ఉంటారు. ప్రజలు పీడకు బలికారు. అవినీతి హింస స్వార్థం లేని సమాజంలో శాంతి సౌఖ్యాలుంటాయి. పారమార్థికత వేషంలో కాదు ఆలోచనలో ఆచరణలో ఉండాలి. ఇంత మంచి గురుశిష్య వ్యవస్థ కోసం కృషి చేద్దాం.

Leave a Comment