Ysrkadapa-Mada Anjaneyuluలింగాపురం జమీందారు సూరయ్య పరోపకారిగా పేరు పొందారు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు సూరయ్య దగ్గరకు వచ్చేవారు. వారికి వడ్డీ లేకుండా డబ్బు సహాయం చేసేవారు మళ్లీ చేయి కుదిరినపుడు కొందరు అప్పు తిరిగి చెల్లించే వారు.

లింగాపురానికి దగ్గర్లో ఉన్న శివపురంలో ఉండే వీరయ్య చాలా ధనికుడు. కానీ పిల్లికి బిచ్చం వెయ్యని పిసినారి.
సూరయ్య దాన, గుణం గురించి తెలుసుకుని, తానూ అప్పు తీసుకుని ఎగ్గొట్టాలనుకున్నారు.

ఒకరోజు చిరిగిన బట్టలు వేసుకుని సూరయ్య దగ్గరికి వెళ్లాడు. వీరయ్య ‘అయ్యా నేను చాలా బీద రైతును నన్ను వీరయ్య అంటారు. పంట దిగుబడి లేక పీకల్లోతు కష్టాల్లో మునిగి ఉన్నా. ఓ వెయ్యి వరహాలు ఇప్పిస్తే పంట రాగానే డబ్బు పువ్వుల్లో పెట్టిస్తా” అని వేడుకోసాగాడు.

తప్పకుండా సాయం చేస్తా వీరయ్య! మీకు ఎంత పొలం ఉంది. అందులో ఏ పంట వేయాలనుకుంటున్నా? అడిగాడు సూరయ్య.
రెండుఎకరాల్లో మిరప పంట వేయాలనుకుంటున్నా చెప్పాడు వీరయ్య.

‘సరే వీరయ్య చీకటి పడింది. ఈ రాత్రికి ఇక్కడే ఉండు. రేపు ఉదయాన్నే డబ్బు తీసుకుని వెళ్దువుగానీ” అన్నాడు సూరయ్య

వీరయ్య సంతోషంతో ఆరాత్రి సత్రంలో భోజనం చేసి నిద్రపోవడానికి సిద్ధమయ్యారు. అంతలో ఇద్దరు వ్యక్తులు రహస్యంగా మాట్లాడుకోవడం వినిపించింది. నిద్ర నటిస్తూ వారి మాటలు వినసాగాడు వీరయ్య.

ఓరే సోముడూ! ఈజమిందారు వెర్రి వెంగళప్పలా ఉన్నాడు. అడిగిన వాళ్లందరికీ పైకమిస్తున్నాడు. ఎవరికి ఎంతిచ్చాడో లెక్కా పత్రం ఉండదు. నేనైతే అయిదు వేల వరహాలు తీసుకున్నా అన్నాడు.
‘అంతేనా! నేనైతే పదివేల తీసుకున్నారా భీముడూ, అయినా డబ్బు మళ్లీ ఇచ్చేదా చచ్చేదా” అని అన్నాడు.

ఆమాటలు విన్న వీరయ్య ఆశ తట్టింది. ‘నేనెంత తెలివి తక్కువ వాడిని? వెయ్యి వరహాలే అడిగా. రేపు జమీందారుకు కల్లిబొల్లి కబుర్లు చెప్పి పదివేల వరహాలు తీసుకెళ్లాల్లిందే” అనుకుని పడుకున్నాడు.
మర్నాడు ఉదయాన్నే జమిందారు దగ్గరికి వచ్చాడు వీరయ్య. ‘అయ్యా నన్ను క్షమించాలి. నిన్న మిమ్మల్ని వెయ్యి వరహాలు అడిగా. కానీ రాత్రి కొందరు మిరప పంట సాగుకు పదివేల వరహాలు ఖర్చవుతాయని అనుకుంటుంటే విన్నా. కాబట్టి మొత్తం ఇప”పించగలరు” అని వినయం నటిస్తూ అడిగారు.

ఆమాటలకు సూరయ్య కోపం చూస్తూ ‘నీ నిజ స్వరూపం బయటపెట్టడానికే రాత్రి మావాళ్లు నీముందు అలా మాట్లాడారు. మిరప పంటకు 100 వరహాలు చాలు కానీ నువ్వు వెయ్యి వరహాలు అడిగినపుడే నీపై అనుమానం వచ్చింది. అయినా నేను దారిన పోయే దానయ్యలకు సాయం చేసే వెర్రివాణ్ని కాదు. అవసరమున్న పేదవారి గురించి అంతా తెలుసుకునే సాయం చేస్తా. నీలాంటి మోసగాళ్లకు కాదు” అని వీరయ్యపై ఆగ్రహించాడు సూరయ్య.

తన కపట బుద్ధి బయటపడినందుకు వీరయ్య తలొంచుకుని వెళ్లిపోయాడు.

(2014 డిసెంబరు 27న ఈనాడు ఆదివారం పుస్తకంలో ఈకథ ప్రచురితమైంది.)