ysrkadapa

రాచపాలెం

ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు

వెలదులకును వేదవిద్యాధికారమ్ము
లేదటంచు బ్రహ్మలిఖితమంచు
నోరుతెరచి మరచినారు వాణిని నిన్ను
కాళికాంబ!హంస!కాళికాంబ!

ప్రాచీన, మధ్యయుగాలలో స్త్రీలకు చదువు కునే అర్హత లేకుండా చేసిన దుర్మార్గం మీద ఈపద్యంలో వీరబ్రహ్మంగారు విమర్శ పెట్టారు. స్త్రీలకు వేద విద్య నభ్యసించే అర్హత లేదనీ అది బ్రహ్మ రాసినరాత అనీ ప్రచారం చేస్తూ ఆవిద్యకు అధినేత్రి అయిన నిన్ను మరచిపోయినారమ్మా వాణీ అని వీరబ్రహ్మంగారు సరస్వతికి గుర్తు చేశారు. భారతీయ సామాజిక వ్యవస్థలలో ముఖ్యమైన విద్యావ్యవస్థలోని అసంబద్ధతను అన్యాయాన్నీ వీరబ్రహ్మంగారు ఎత్తిచూపారు. ఇక్కడ ప్రతిదానికీ ఒక దేవుడో దేవతో నాయకత్వంవహిస్తూ ఉంటారని సంప్రదాయం చెబుతుంది. వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు ఇలా వీళ్ళంతా మొగవాళ్ళే. విద్యకు మాత్రం ఒక మహిళను నాయకురాలిని చేశారు. ఆమె సరస్వతి. అయితే ఇందులోని అసంబద్ధత ఏమంటే ఒక స్త్రీ నాయకత్వం వహిస్తున్న వ్యవస్థలోకి స్త్రీలకు ప్రవేశం లేకుండా చేయడం. ఈ అన్యాయాన్ని వీరబ్రహ్మంగారు అధిక్షేపాత్మకంగా సమాజం ముందు పెట్టారు. విమర్శలోంచే ప్రగతి. ఇవాళ మహిళలు చదువుకోగలుగుతున్నారంటే ఆ హక్కు గాలిలోంచి ఊడిపడలేదు. వీరబ్రహ్మంగారిలాంటివాళ్ళు చేసిన విమర్శలూ, నడిపిన ఉద్యమాలూ ఆ హక్కును సాధించాయి. మొన్న మొన్నటి దాక కూడా ఆడవాళ్ళకు చదువెందుకు ఉద్యోగాలు చేస్తారా, ఊళ్ళేలుతారా అని అనేవాళ్ళు. శ్రీపాద సుబ్రహ్మణ్యంశాస్త్రి గారి తల్లిప్రాణం కథలో ఒక తండ్రి ఇలాగే అన్నాడు. అంటే తల్లి తిరగబడి యేం నాకూతురికి ఉద్యోగంజెయ్యడానికి తెలివిలేదా ఊళ్ళేలడానికి శక్తలేదా అని తన వితంతు కూతురిని చదివించి మళ్ళీపెళ్ళి చేసింది. విద్య ప్రతిమనిషికీ ఉండవలసిన ఒక సహజమైన హక్కు. ప్రాథమిక హక్కు. ఆ హక్కును దేశజనాభాలో సగంగా(ఆకాశంలో సగం అన్నాడు చైనా కమ్యనిస్టునాయకుడు మావో. ఇప్పుడు మనం అవనిలో సగం అంటున్నాం) ఉన్న మహిళలకు లేకుండా చేయడం తప్పు. భారతదేశ చరిత్రలో జరిగిన పెద్ద తప్పు విద్య అందరిదీ కాకపోవడం. రెండవది శ్రామికశక్తులను అంటరానివాళ్ళని ముద్రవేసి ఊరికిదూరంగా పెట్టి అవమానించడం. చరిత్రలో జరిగిన తప్పును భారతదేశం గుర్తించి సరిదిద్దుకోడానికి చాలాకాలం పట్టింది. శతాబ్దాలు గడచిపోయాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఒత్తిడులకు తలొంచి ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అని ప్రచారం చేసుకుంటున్నాం. ఆలస్యంగానైనా స్త్రీలకు న్యాయం జరగడం సంతోషాత్మకం. అయితే స్త్రీ లను విద్యకు దూరం చేయడం చరిత్ర ప్రారంభం నుంచీ ఉన్నదా అంటే ఉపనిషత్తుల కాలం నుంచే ఈనిషేధం ఉంది. అంతకుముందు లేదు అని ఒక అభిప్రాయముంది. ఉపనిత్తుల కాలం నుంచి కూడా మహిళలు చదవుకొని ఉంటే భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామిగా ఉండేది. ఎవరు కొందరు అజ్ఞానులైన స్వార్థపరుల తెలివితక్కువ నిర్ణయాన్ని ప్రశ్నించకుండా శిరసావహించడం వల్ల కలిగిన అనర్థం. ఈ అనర్థాన్ని ఇప్పడైనా గుర్తించి తప్పును సరిదిద్దుకోవడం ఆనందదాయకం. తల్లిని పిల్లలకు మొదటి గురువు అంటూనే ఆగురువుకే విద్యలేకుండా చేస్తే ఆమె తనపిల్లలకు ఏమి నేర్పగలదు? అయితే ఇందుకు అపవాదంగా మనదేశంలోనే చరిత్రలో చదువుకున్నమహిళలు తమబిడ్డలకు విద్యనేర్పిన తల్లులు కనిపిస్తారు. అవన్నీ అరుదైన ఉదాహరణలే తప్ప సార్వజనీనమైనవి కావు. తొంభైశాతం మందికి చదువు నిషేధింపబడిన మనదేశంలో అరదుగానైనా కొందరు చదువుకున్న మహిళలు ఉండడం విశేషమే. మైత్రేయి గార్గి వంటి పేర్లన్నీ అరుదైనవే. వాళ్ళెంత పోరాటం చేశారో. ఒక స్త్రీ నాయకత్వంలో ఉండే వ్యవస్థలోకి స్త్రీలకే నిషేధం విధించడంలోని అసంబద్ధతను గుర్తు చేసిన సామాజిక సంస్కర్త వీరబ్రహ్మంగారికి నమస్కరించకుండా ఉండలేం. మనుమరాలిని తనవారసురాలిని చేసిన నేత వీరబ్రహ్మంగారు. మీకు వీలయితే ఆచార్య కాత్యాయనీ విద్మహేగారి వ్యాసం పురణేతిహాసాలలో స్త్రీ విద్య… జీవితం చదవండి. 1933లో ఆమెరాసిన వ్యాసం సంప్రదాయ సాహిత్యం.. స్త్రీవాద ధృక్పథం అనే గ్రంథంలో ఉంది.

Leave a Comment