ysrkadapa

రాచపాలెం

స్త్రీలను తల్లులుగా భావిస్తేనే

రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డిమానినులను తల్లిగా నాత్మనెంచిన

సందియమ్ములెల్ల సమసిపోవు

సమసిపోవ తాను సర్వేశ్వరుండౌను

కాళికాంబ!హంస!కాళికాంబ

ప్రాచీన తెలుగు కవులలో స్త్రీకి ఉన్నత స్థానమిచ్చిన కొద్దమంది కవులలో బ్రహ్మంగారు అగ్రేసరులు. జీవితంలోనూ రచనలలోనూ స్త్రీని గౌరవించారు బ్రహ్మంగారు. స్త్రీల మీద నిరంతరం దాడులూ అత్యాచారాలూ హత్యాచారాలూ జరుగుతున్న నేటి సమాజం బ్రహ్మంగారి నుంచి నేర్చుకోవలసినది ఉంది. మాలపల్లి నవలలో తక్కెళ్ళజగ్గడు ధర్మకన్నాలు వేసే సమయంలో స్త్రీలూ వృద్ధులూ చిన్నపిల్లలజోలికి వెళ్ళవద్దని తన సైన్యానికి సూచించాడు. ఆమాత్రం నీతికూడా కరువైపోయిన స్థితికి మన సమాజం చేరుకొంది. మహిళల్ని అమానుషంగా పీడిస్తున్నది నేటి పురుష ప్రపంచం. పీడక పురుషులకు కుల, మత ప్రాంత విద్యా విద్య వయో భేదాలు కనిపించడం లేదు. ఈ సమయంలో మనం  బ్రహ్మంగారిని చదువుకోవాలి. స్త్రీలను హీనంగా చూడడం వేధించడం వంటివి మధ్యయుగ లక్షణాలు. ఆధునిక యుగంలో కూడా పురుషులు ఆపనులే చేస్తున్నారంటే వాళ్ళు మధ్యయుగ అవశేషాలని అర్థం. వాళ్ళ కళ్ళు తెరిపించాలంటే బ్రహ్మంగారు ఉపయోగపడతారు. స్త్రీలను మొగవాళ్ళు తల్లులుగా  భావించగలిగితే సందేహాలన్నీ తీరిపోతాయి, సందేహాలు తీరిపోతే మొగవాడు సర్వేశ్వరుడౌతాడు అని బ్రహ్మంగారి ప్రబోధం. పరాయిస్త్రీని తల్లిగా భావించాలంటే ఎంతటి హృదయ సంస్కారం కావాలి! కాముక పురుషుడు నిలువెల్లా కాల్చుకొని తననుతాను సానబెట్టుకోవాలి. అది పరాయిస్త్రీలను తల్లులుగా భావించడం ద్వారానే సాధ్యమౌతుంది. మన సమాజంలో మనిషిని మనిషిగా చూడడం ఇంకా సాధ్యం కాలేదు. మీరేవుట్లు అని అడిగే సమాజం మనది. మనవాడా కాదా అని తెలిస్తే తప్ప బ్రహ్మను కూడా గౌరవించరు అని వాపోయారు గుర్రం జాషువ. ఒక మనిషి ఎదురవ్వగానే ఆమనిషి కులం, మతం ప్రాంతం జండర్ల గురించి ఆలోచించే మహోన్నత సంప్రదాయం మనకుంది. తరతరాలుగా ఈ ధోరణి మనరక్తంలో కలసిపోయి ఉంది. స్త్రీల విషయంలోనూ పురుషులకు అపోజిట్ సెక్స్ దృష్టే కొనసాగుతున్నది. ఇటీవలికాలంలో మనదేశంలో స్త్రీలపైన జరుగుతున్న దాడులను చూస్తుంటే మనది నాగరిక సమాజమేనా అని సందేహం కలుగుతున్నది.  స్త్రీ కనిపించగానే ఆమెను తల్లిగా చూడమంటున్నారు బ్రహ్మంగారు. ఇద్దరు మొగవాళ్ళకు కోపం వచ్చినా రెండు కుటుంబాల మధ్య వివాదం కలిగినా రెండుకులాల మధ్యనో గొడవలు జరిగితే అక్కడా స్త్రీలే అవమానింపబడుతారు. ఈసమస్యకు పరిష్కారం స్త్రీని తల్లిగా భావించడమే  పరిష్కారమంటారు బ్రహ్మంగారు. చెవులుంటే ఆయన్ని వినాలి. చదవుంటే ఆయన్ని చదవాలి. భాగవతంలో ప్రహ్లాదుడూ ఇలాగే చెప్పాడు. అయినా అత్యాచారాలూ అవమానాలూ వేధింపులూ అవిచ్ఛిన్నంగా సాగిపోతూనే ఉన్నాయి. ఇప్పుడైనా మనదేశం బ్రహ్మంగారిని చదవాలి. స్త్రీలు చదువుకొని బయటి సమాజంలో అనేకరంగాలలోకి ప్రవేశిస్తున్నారు. సహించలేని పురుష సమాజం వెంటనే వాళ్ళపైన పుకార్ల వేధింపుల అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తుంది. ఈ కుసంస్కారం మొగవాళ్ళలో నశించాలంటే బ్రహ్మంగారి కవిత్వం పనికి వస్తుంది. కన్నతల్లుల్నే కడతేర్చే కొడుకులు పుడుతున్న సమాజం మనది.  అందుకే బ్రహ్మంగారు నేటి అవసరం. తల్లితండ్రి గురువు దైవంలలో ఆయన తల్లికే ప్రాధాన్యం ఇచ్చారు. “తల్లిపూజ ముఖ్యమెల్లరకును” అన్నారు. బయట స్త్రీ కనిపిస్తే తల్లిగా భావించమని చెప్పిన బ్రహ్మంగారు  దానిని మరోరకంగా కూడా చెప్పారు. ఇంట్లో తల్లిని గనక మనం గౌరవిస్తూ ఉంటే బయటి స్త్రీలను తల్లులుగా చూడడం సాధ్యమౌతుందని అన్నారు.

మాతృపూజ చేయు మగవారికెల్లను

అన్యకాంత తల్లయట్లతోచు

ఎరుకమరచువారు నరకమ్ము పాలౌను.”అన్నారు.  స్త్రీ సృష్టికి మూలం అన్నారాయన. నేటి మృగాళ్ళు(మృగాలకు క్షమాపణతో) మనుషులుగా పరివర్తన చెందాలంటే తప్పకుండా చదవాల్సిన కవి బ్రహ్మంగారు. మన విద్యావ్యవస్థలో బ్రహ్మంగారి కవిత్వానికి స్థానం కల్పించాలి. విద్య ముగిసేలోగా విద్యా ర్థులకు అన్నమయ్య అన్నట్లు” పురుషులూ జీవులే పొలతులూ జీవులే” అనే అభిప్రాయం కలిగించాలి. బహిరంగ ప్రదేశాలలో బూతుసినిమా బొమ్మలు ,  చిల్లరనాయకుల బొమ్మలూ  కాకుండా స్త్రీని గురించి బ్రహ్మంగారు చెప్పిన పద్యాలను ప్రదర్శించాలి. చానెళ్ళలో బ్రహ్మంగారి పద్యాల మీద చర్చలు జరగాలి.”స్త్రీ నిజమ్ముగాను సృష్టికి మూలము”.

Leave a Comment