పరిశ్రమల స్థాపన తోనే ప్రగతి సాధ్యమవు తుందని ఆదిశగా కృషిచేయాలని జిల్లా కలెక్టర్ సి. హరి కిరణ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లాస్థాయి పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు, రాయితీలు అందిస్తోందని, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించి పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చేస్తే జిల్లాలో నిరుద్యోగులకు ఉపాధి పెరుగుతుందన్నారు. పరిశ్రమల స్థాపనకు అందిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్ధేశించిన గడువులోగా అనుమతులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. వెంటనే పరిశీలన పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వద్ద ఐదు దరఖాస్తులు, ఫ్యాక్టరీస్ శాఖ వద్ద 2, అగ్నిమాపక శాఖ వద్ద ఒకటి దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని వెనువెంటనే వాటి పరిశీలన పూర్తి చేసి అనుమతుల మంజూరు కొరకు సమర్పించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. మూల ధన పెట్టుబడి రాయితీ పథకం కింద 36 మంది ఎస్సీ, ఎస్టీలకు, జనరల్ కేటగిరి కింద నలుగురికి రూ. 4.19 కోట్ల చెల్లింపునకు సమావేశంలో కలెక్టర్ అనుమతి మంజూరు చేశారు. పావలా వడ్డీ రాయితీ కింద 24 మందికి 2016-17, 2017-18 సంవత్సరాలకు మొదటి, రెండవ అర్ధ వార్షిక లకు రూ.48.90లక్షలు చెల్లించేందుకు అంగీకారం తెలిపారు. విద్యుత్ రాయితీ కింద 21 మందికి రూ.13.53 లక్షలు మంజూరుకు అనుమతించారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం చాంద్ భాషా, ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ జయలక్ష్మి, ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ ఈ నరేంద్రబాబు, నగరపాలక కమిషనర్ లవన్న, ఎల్ డి ఎం ఆంజనేయ ఆచారితోపాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.