ysrkadapa

వార్తలు

మ్రొక్కులతో బతుకు చక్కబడదు

సాటిమానవునకు సాయమ్ము పడబోక

నల్లరాళ్ళు తెచ్చి గుళ్ళుగట్టి

మ్రొక్కులిడిన బ్రతుకు చక్కబడంబోదు

కాళికాంబ!హంస!కాళికాంబ.

బాధలలో పేదరికంలో ఉన్న సాటి మనిషికి  సహాయం  చేయకుండా నల్లరాళ్ళు తెచ్చి గుడులు కట్టడం వల్ల  వాటికి మొక్కడం వల్ల మానవ జీవితం చక్కపడదు. మానవుని భౌతిక సమస్యలకు మతం దగ్గర పరిష్కారం లేదు. మానవ సమస్యలకు భౌతిక సమాజంలోనే పరిష్కారాలుంటాయి. వాటిని గుర్తించాలి. అంతేకానీ మనుషుల బాధలను పరిష్కరించేపనిని వదిలేసి, గుడులు కట్టించి రాళ్ళతో విగ్రహాలు చేసి వాటిని గుడులలో పెట్టి పూజించమని, పూజిస్తే సమస్యలు పరిష్కారమౌతాయని చెప్పడం అశాస్త్రీయం. ఆమొక్కుల వల్ల బతుకులు బాగుపడవని బ్రహ్మంగారు నిర్మొహమాటంగా చెప్పారు. ఆయన నాస్తికుడు కాదు. ఆస్తికుడే. భావవాదే. అయినా సంస్కర్త. దైవభావన చుట్టూ పేరుకున్న కర్మకాండను ,దానిని ఆవరించిన ఆధిపత్యాన్ని  బ్రహ్మంగారు విమర్శించారు. విగ్రహారాధనను తిరస్కరించి బ్రహ్మంగారు 17వ శతాబ్దంలోనే తాత్త్విక మార్పునకు పునాది వేశారు. కానీ గత మూడువందల ఏళ్లలో  గుడులు అనూహ్య సంఖ్యలో పెరిగాయి. కొత్తదేవుళ్ళు పుట్టుకొచ్చారు. రాతి విగ్రహాలే కాకుండా అవతారమూర్తుల రూపంలో  అనేకులు పుట్టుకొచ్చి గుడులు కట్టించుకున్నారు. పూజలందుకుంటున్నారు. తొక్కుడుస్వామి, కొట్టుడుస్వామి, తిట్టుడుస్వామి , ఎంగిలిస్వామి , తాకుడుస్వామి లెక్కలేనంతమంది. వీళ్ళందరికీ మందిరాలు వెలిశాయి. సుప్రభాతాలు వచ్చాయి. ఊరేగింపులు వచ్చాయి. ఆశ్రమాల పేరుతో సంపద గుడారాలు సమకూరాయి. అయినా  మానవ సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే. బతుకు చక్కపడంబోదు అన్న బ్రహ్మంగారి మాట అక్షరాలా నిజమని రోజురోజుకూ రుజువౌతున్నది. దేవుళ్ళ హుండీలు, వ్యాపారుల సంచులు నిండుతున్నాయి. మానవ సమస్యలు అపరిష్కృతంగానే ఉంటున్నాయి. విగ్రహారాధన  ఏసమస్యనూ ఎవరి సమస్యనూ పరిష్కరించదన్న బ్రహ్మంగారి ప్రబోధాన్ని ఇప్పుడైనా సమాజం వినాలి.

Leave a Comment