Friday, March 29, 2024

జ్ఞానమార్గం

ముండమోపికైన చాండాలికైనను
ఎగ్గులేక చేతులెత్తవలెను
ఎగ్గుసిగ్గులేక యెరగాలి మర్మంబు
కాళికాంబ! హంస!కాళికాంబ
బ్రహ్మంగారిది జ్ఞానమార్గం. ఆయన జ్ఞాని. తనకాలానికి జ్ఞానపరంగా ఆయన విశ్రాంతివర్గం కన్నా భిన్నంగానూ ముందుగానూ ఉన్నారు. ఆయన భావ వాదే అయినా ఆయన బుర్ర మూతపడినది కాదు. తెరిచిన వాకిలి. ప్రాచీన భారతీయ సమాజంలో బలమైన విధి నిషేధాలు ఉండేవి. అవి అనుల్లంఘనీయాలు. గీత దాటితే శిక్షే. తలుపులు మూసిన గదిలాంటి సమాజంలో వర్ణాశ్రమాల ధర్మాల సాంకర్యాన్ని ఆమోదించని కాలమది. ఈ విధినిషేధాలు. జ్ఞానం విషయంలోనూ ఉండేవి. ఎవరు జ్ఞానం పొందాలి. ఎవరు అందుకు అర్హులు కారు అనేదాని మీద ఆంక్షలు ఉండేవి. ఘనీభవించిన ఆవ్యవస్థను ద్రవీకరించడానికి అనేకులు కృషి చేశారు. వారిలో బ్రహ్మంగారు ఒకరు. బ్రహ్మంగారు ఆధిపత్యవాదుల కన్నా భిన్నమైన మెరుగైన వ్యవస్థను కోరుకున్నారు. ఆధిపత్యవాదులు జ్ఞానంగా ప్రచారం చేస్తున్నదానిలో ఎక్కువభాగం జ్ఞానం కాదని అది అజ్ఞానమని చెప్పారు. అసలైన జ్ఞానం ఏదో చెప్పారు. అది ప్రత్యామ్నాయ జ్ఞానం. జ్ఞానం అందరిదీ కావాలన్నారు. జ్ఞానం ఎక్కడి నుంచైనా ఎవరి నుంచైనా స్వీకరించవచ్చన్నారు. జ్ఞానం వితంతువు దగ్గరున్నా దళిత మహిళ దగ్గరున్నా సిగ్గు బిడియం లేకుండా వాళ్ళకు చేతులెత్తి నమస్కరించి స్వీకరించాలని ప్రబోధించారు. స్త్రీలకు విద్యను నిషేధించిన కాలంలో  స్త్రలనే జ్ఞానం నుండి దూరం చేసిన సమాజంలో నిలబడి బ్రహ్మంగారు తిరుగుబావుటా ఎగురవేశారు. భారతీయ సమాజంలో చులకన చేయబడ్డ వాళ్ళలో దళితులు స్త్రీలు ముఖ్యులు. పురుషస్వామ్య వర్ణ వ్యవస్థ ఇందుకు కారణం. ఎవర్రా అదవ అంటే మొగుడు చచ్చిన ఆడది అని సామెత. పైకులం వాళ్ళకు కోపమొస్తే నువ్వు కాపోడివా మాదిగోడివా అని తిట్టేవారు.  ఎవరైనా ప్రయాణమై పోతుంటే వితంతువులు దళితులు ఎదురుగా రాకూడదు. వస్తే ప్రయాణికులు ఇంటికి తిరిగి వచ్చి కూర్చొని నీళ్ళుతాగి మళ్ళీ వెళ్ళాలి. ఇది మౌఢ్యమేకాదు అమానుషత్వం కూడా. వాళ్ళు మనుషులే. ఒకస్త్రీ భర్త చనిపోవడానికీ ఒక స్త్రీ దళిత కులంలో పుట్టడానికి వాళ్ళు కారణం కాదు. వితంతువైనా దళిత స్త్రీ అయినా సాటి మనుషులే కదా అనే జ్ఞానం లేని కాలంలో వాళ్ళు కూడా మనుషులే వాళ్ళకు కూడా జ్ఞానమున్నది దానిని ఎవరైనా స్వీకరించవచ్చు అని చాటి చెప్పారు బ్రహ్మంగారు. వాళ్ళకూ జీవితముంది. అది జ్ఞానాన్నిచ్చింది. దానిని గుర్తించడానికి వెనుకాడవలసిన పనిలేదు అని బ్రహ్మంగారు చాటింపు వేశారు. జ్ఞానానికి కులం అంటులేదని చెప్పారు. బ్రహ్మంగారు తాను జీవసమాధి అయిన తర్వాత ముత్తైదుగుర్తలేవీ తీసి వేయవద్దని తన భార్యకు చెప్పినట్లు ఆయన జీవిత చరిత్రకారులు చెబుతారు. సంఘంలో వితంతు దళిత స్త్రీల పట్ల సంఘం చూపే వివక్షను గమనించి ఆయన ఈతిరుగుబాటును ప్రకటించి ఉంటారు. జ్ఞానం వితంతువు దగ్గరున్నా  దళిత స్త్రీ దగ్గరున్నా నిర్భయంగా వాళ్ళకు దండంబెట్టి నేర్చుకోమని బ్రహ్మంగారు ప్రకటించడం రామానుజాచార్యులు గాయత్రీ మంత్రాన్ని గాలి గోపురమెక్కి అన్ని కులాల వాళ్ళూ వినేటట్టుగా పలకడం వంటిదే.  ” జ్ఞాని కాక రంకు చంపగానేరడు”….
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular