లలితకళల విశ్వవిద్యాలయం ఏర్పాటుకు భూముల పరిశీలన

పర్యాటకం వార్తలు
407 Views

కడప నగర సమీప చిన్నచౌకు ప్రాంత చలమారెడ్డిపల్లె సమీప కొండగుట్ట ప్రాంతంలో రాష్ట్రస్థాయి లలితకళల యూనివర్సిటీ (స్టేట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ) ఏర్పాటుకు శనివారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ క్షేత్రస్థాయి స్థల పరిశీలన చేశారు. దాదాపు 134 ఎకరాల విస్తీర్ణంలో విశ్వవిద్యాలయం ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించారు. చిన్నచౌకు పరిధిలో 94 ఎకరాలు, సిద్ధవటం మండలానికి సంబంధించి 40 ఎకరాలు కలవడం జరుగుతోంది. కొండ గుట్ట పైన మంచి ఆహ్లాదకరమైన వాతావరణం కనిపిస్తూ… చుట్టూ పచ్చదనం పరచుకొని ఉండటం… గుట్టకు ఒకపక్కన కడప నగరం కనబడుతూ ఉండడం, మరొక పక్క చూస్తే పెన్నానది పారుతూ చూపరులను కనువిందు చేస్తోంది. గుట్ట పైన ఆలయం ఉండడం, పండగలు, జాతరాల సమయంలో అధిక సంఖ్యలో భక్తులు రావడం జరుగుతోంది. అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఒక పక్క యూనివర్సిటీ ఏర్పాటుతో పాటు… పర్యాటకం అభివృద్ధి చేసేందుకు గల అవకాశాలను… సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆమేరకు ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. యూనివర్సిటీకి ప్రతిపాదించిన ప్రణాళికలో ఎలాంటి ఆటంకాలు లేకుండా… పర్యాటక అభివృద్ధికి, ప్రజలు రాకపోకలకు ప్రతిపాదిత స్థలంలో తగిన మార్గాలను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ) ఎం.గౌతమి, కడప, రాజంపేట సబ్ కలెక్టర్లు పృధ్వితేజ్, కేతన్ గార్గ్, స్టేట్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ విజయ్ కిషోర్, రిజిస్ట్రార్ సురేంద్రరెడ్డి, విజయవాడ ఏపీఈడబ్ల్యూయుఐడిసి ఎస్ఈ విజయ్ కుమార్, ఈఈ జనార్ధన్ రెడ్డి, కడప సిద్ధవటం తాసిల్దార్లు బి.శివరామిరెడ్డి, రమాకుమారి, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *