ysrkadapa

వార్తలు

కడప రామసుబ్బమ్మ

కడప రామసుబ్బమ్మ నేటి మహిళలకు ఆదర్శ మూర్తి. స్వాతంత్య్రానికి ముందే పలు పదవులను అలంకరించిన ప్రపథమ మహిళ. సుదీర్ఘకాలంగా కడప పురపాలిక కౌన్సిలర్‌గా పనిచేశారు. భర్త కోటిరెడ్డికి చేదోడు వాదోడుగా ఉంటూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకొని జైలుకెళ్లిన ధీరవనిత ఆమె. ఆగర్భశ్రీమంతుల ఇంటిలో జన్మించి, భోగభాగ్యాలను విడిచి మహిళలను చైతన్యం చేయడంలో చురుకైనా పాత్ర పోషించారు. దేశ విముక్తికోసం గాంధీజీ పిలుపుతో 1943 జిల్లా బోర్డు అధ్యక్ష పదవికి ఆమె రాజీనామా చేశారు.

స్త్రీపరదా పద్ధతికి వ్యతిరేకి
మహిళలపై ఆంక్షలను రామసుబ్బమ్మ తీవ్రంగా వ్యతిరేకించారు. హైదరాబాదులో ఆంధ్ర యువతి మండలి అయిదో వార్షికోత్సవానికి రామసుబ్బమ్మ అధ్యక్షురాలుగా వెళ్లారు. అప్పట్లో ముస్లింలే కాకుండా హిందు మహిళలు బురఖా వేసుకొనేవారు. మహిళలు బురఖాను తొలగిస్తేనే ప్రసంగిస్తానని ఆమె చెప్పారు. వెంటనే మహిళలు ముసుగును తొలగించారు. కొన్ని సమావేశాల్లో ఓవైపు పురుషులు, మరోవైపు మహిళలను కూర్చోబెట్టి వారి మధ్య తడికలను ఉంచేవారు. అందరూ కలిసే ఉండాలని ఆమె కోరేవారు.

ఆంధ్రోద్యమంలో కీలకపాత్ర
రాయలసీమ దత్తమండలంలో ఉండేది. ఆంధ్రోద్యమంలో రామసుబ్బమ్మ కీలకపాత్ర పోషించారు. ఆంధ్ర రాష్ట్రోద్యమ ఉపాధ్యక్షురాలి హోదాలో అన్ని ప్రాంతాల్లో తిరిగి ఉపన్యాసాలిచ్చారు. ఆరోజుల్లో సర్కారు ప్రాంతానికి చెందిన అగ్రనాయకులుండగా, రాయలసీమ నుంచి అగ్రనాయకుల్లో రామసుబ్బమ్మ ఒకరిగా చెప్పవచ్చు.

ఎన్నో పదవులు
రామసుబ్బమ్మ ఎన్నో పదవులను అలకరించారు. జిల్లా బోర్డు అధ్యక్షులుగా, కడప జిల్లా మహిళాభ్యుదయ మండలి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా, అఖిలభారత సాంఘిక సంక్షేమ మండలి సభ్యురాలిగా కొనసాగారు. అఖిల భారత స్త్రీసమాజంలో రాష్ట్ర అధ్యక్షురాలిగా, రాష్ట్ర సంక్షేమ మండలి సభ్యురాలిగా, శాసనమండలి సభ్యులుగా శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పాలకమండలి, కడప పట్టణ పరిపాలనమండలి, జిల్లావిద్యాసంఘ సభ్యురాలిగా ఎనలేని సేవచేశారు. సరోజినాయుడుతో కలిసి గుంటూరు సమావేశంలో మహిళలను జాగృతం చేశారు.

సీమకు ఎనలేని సేవ
రామసుబ్బమ్మ రాయలసీమకు ఎనలేని సేవ చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఖాదీ ఉద్యమం ద్వారా గ్రామీణ ప్రజల ఉపాధి కల్పనకు చేయూతనిచ్చారు. జిల్లాబోర్డు అధ్యక్షుల హోదాలో జిల్లాలోని పలుప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలను ఏర్పాటుచేశారు. తమ తల్లిదండ్రుల స్మారకార్థం కడపలో మహిళ డిగ్రీకళాశాల ఏర్పాటుకు కృషిచేశారు. అప్పటి సీఎం జలగం వెంగళరావు చేత ప్రారంభించారు. కడప అంధుల పాఠశాల ఏర్పాటులోనూ ఆమెకృషి ఉంది. 1940లో మహిళ సమాజాన్ని ఏర్పాటుచేసి స్త్రీ హక్కుల కోసం నిరంతరం పోరాడారు. దుర్గాబాయిదేశ్‌ముఖ్‌ను కడపకు రప్పించి వైభవంగా సభను నిర్వహించిన ఆమె జిల్లా మహిళలకు ఆదర్శంగా చెప్పవచ్చు.

 

Leave a Comment